వారు టీటీడీ పదవుల నుంచి తప్పుకోవాలి: రఘురామ

ABN , First Publish Date - 2021-08-31T21:01:05+05:30 IST

టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ చేతకాకపోతే సుబ్బా‌రెడ్డి, ధర్మా‌రెడ్డి, జవహర్‌రెడ్డి టీటీడీ పదవుల నుంచి తప్పుకోవాలని వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

వారు టీటీడీ పదవుల నుంచి తప్పుకోవాలి: రఘురామ

ఢిల్లీ: టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ చేతకాకపోతే సుబ్బా‌రెడ్డి, ధర్మా‌రెడ్డి, జవహర్‌రెడ్డి టీటీడీ పదవుల నుంచి తప్పుకోవాలని వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం సుప్రీం‌కోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన 9మందికి అభినందనలు తెలిపారు. అలాగే పమిడి ఘంటం శ్రినర్సింహం, జేకే మహేశ్వరిలతో సీజే రమణ ప్రమాణం చేయించడం ఏంతో శుభదినమన్నారు. ఈసందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీలో  ప్రజలు, ప్రముఖులు ఇచ్చిన వందల కోట్ల విరాళాలతో నిత్యన్నదానం నిర్వహిస్తున్నారన్నారు. ఆగమ మండలి ఏర్పాటు మీద కొంచం దృష్టి పెట్టాలని చెప్పారు. సుబ్బారెడ్డి, ఇతర అధికారులు నిష్ణాతులైన వారిని ఆగమ మండలిలో నియమించాలని కోరారు.కల్యాణ మండపాలు అద్దెకిస్తే  అక్కడ సువార్త సభలు పెడితే సుబ్బారెడ్డి ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. భక్తులు ఇచ్చిన భూముల్లో కల్యాణ మండపాలు నిర్మించారని, వాటిని ఎవరికో అద్దె కిస్తే పరిస్ఠితి ఏమిటని నిలదీశారు.ధర్మ పరిషత్‌ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని రఘురామ కృష్ణంరాజు  ప్రశ్నించారు. 


జెరూసలేం వెళ్లే వారికి సబ్సిడీ ఇస్తూ టీటీడీలో అన్నింటికీ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెరూసలేంకి ఇచ్చే సబ్సిడీకి తిరుమలలో దోపిడీ ఏమిటని ప్రశ్నించారు. టీటీడీ ఆదాయం కోసం రూమ్‌రెంట్లు కూడా పెంచుతున్నారని ఇది ఏమాత్రం సమంజసం కాదన్నారు. టీటీడీ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని రఘురామ కృష్ణంరాజు సూచించారు.భక్తులను భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దయచేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించొద్దని చెప్పారు. డబ్బుల కోసం చేసే పనులు మానేయండి చేతకాకపోతే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి జవహర్‌రెడ్డి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మద్యంపై ఇప్పటికే సీఎం జగన్ వేలకోట్లు అప్పులు చేశారని ధ్వజమెత్తారు.  ప్రభుత్వం ఇంకో 25 వేల కోట్ల రూపాయలకు ప్రణాళికలు వేస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు.మద్యంపై రుణమే రాబోయే రోజుల్లో రణం అవుతుందన్నారు. ఏపీలో ఇసుక చోరీలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.

Updated Date - 2021-08-31T21:01:05+05:30 IST