Minister Botsa మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయ్.. పట్టించుకోవద్దు: RRR

ABN , First Publish Date - 2021-08-30T19:49:24+05:30 IST

మంత్రి బొత్స మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

Minister Botsa మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయ్.. పట్టించుకోవద్దు: RRR

న్యూఢిల్లీ: మంత్రి బొత్స సత్యన్నారాయణ మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశంలో మంత్రి బుద్ధిలేని,  మతిలేని ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. బుర్ర లేని సచ్చు వెదవల సలహాలతోనే ఇలాంటి పరిస్థితులు దాపురించాయన్నారు. పనికిమాలిన, దిక్కుమాలిన సూత్రాలు చెప్పవద్దని మంత్రి బొత్సాకు సూచించారు. మంత్రి అనుకున్నట్లు రాజధాని విశాఖ వెళ్ళడం అయ్యే పని కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.


రాజధాని తరలించాలంటే సుమారు రూ. 90 వేల కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని రఘురామ అన్నారు. మంత్రి బొత్స మాటలు పట్టించుకోవద్దని అమరావతి రైతులు, మహిళలను కోరుతున్నానన్నారు. సీఎం జగన్ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా మంత్రి ఇలానే మాట్లాడుతుంటారని అన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గేదెల కోసం స్విమ్మింగ్ పూల్స్ కట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. 25 కేంద్ర ప్రభుత్వం  పథకాలకు కేంద్రం రూ. 12 వేల కోట్లు ఇస్తే.. రాష్ట్రం మరో రూ. 6 నుంచి 7 వేల కోట్లు మార్జిన్ మని  కలిపి ఇవ్వాలని, ఆ డబ్బుల కోసం ఎస్‌బీఐ నుంచి అప్పుగా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలా చేయడం ఎఫ్‌ఆర్‌బిఎం నిభందనలు ఉల్లంగించడమేనన్నారు. నవరత్నాలను అమలు చేస్తున్నామని చెప్పుకునేందుకు కార్పొరేషన్‌లకు నిధులు మళ్లించి ఖర్చు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రంలో ఒక ఆర్థిక మంత్రి, ఢిల్లీలో మరో ఆర్థిక మంత్రి ఉండవలసిన పరిస్ధితులు ఏర్పడ్డాయన్నారు. జగన్ భిక్షతో  దొడ్డిదారిన ఎంపీ అయ్యింది విజయ్ సాయి రెడ్డని, తాను ప్రజల నుంచి ఎన్నికైన వాడినని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.


కాగా.. మంత్రి బొత్స వ్యాఖ్యలపై రాజధాని దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం తన వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మంత్రి మాటలతో ఆవేదన చెందామని రాజధాని దళిత రైతులు అన్నారు. మంత్రి బొత్సపై ఎస్సీ, ఎస్టీ, చీటింగ్‌ కేసు నమోదు చేయాలని దళిత జేఏసీ డిమాండ్ చేసింది.

Updated Date - 2021-08-30T19:49:24+05:30 IST