‘సరస్వతి’ లీజు పునరుద్ధరణ జీవో అమలు నిలిపివేయండి

ABN , First Publish Date - 2021-06-23T08:59:56+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతీ రెడ్డి వాటా కలిగిన సరస్వతీ పవర్‌ కంపెనీకి సున్నపురాయి మైనింగ్‌ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎంపీ

‘సరస్వతి’ లీజు పునరుద్ధరణ జీవో అమలు నిలిపివేయండి

హైకోర్టులో రఘురామకృష్ణంరాజు అప్పీలు


అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతీ రెడ్డి వాటా కలిగిన సరస్వతీ పవర్‌ కంపెనీకి సున్నపురాయి మైనింగ్‌ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో అప్పీల్‌ చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్‌ చేయాలని కోరారు.  సరస్వతి పవర్‌-ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మైనింగ్‌ లీజును పునరుద్ధరిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 109 అమలును నిలుపుదల చేయాలని విన్నవించారు. సీఎం కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చేందుకు మోసపూరితంగా అధికారాన్ని ఉపయోగించి నీటి కేటాయింపులు, మైనింగ్‌ లీజును 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన జీవోల అమలునూ నిలుపుదల చేయాలని కోరారు. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి, గనులశాఖ డైరెక్టర్‌, ఏపీ కలుష్య నియంత్రణ మండలి మెంబర్‌ సెక్రెటరీ, ఎస్‌పీఐపీఎల్‌ డైరెక్టర్‌లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ‘1999లో సరస్వతీ పవర్‌ కంపెనీని గ్రంథి ఈశ్వరరావు ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్‌, ఆయన భార్య భారతి, తల్లి విజయలక్ష్మి, మరో ఇద్దరికి షేర్లు బదిలీ చేసి ఒరిజినల్‌ ప్రమోటర్లు కంపెనీని విడిచి వెళ్లారు. 2008 మార్చి/ఏప్రిల్‌ నెలల్లో గుంటూరు జిల్లాలో 266 హెక్టార్ల సున్నపురాయి లీజుకోసం కంపెనీ దరఖాస్తు చేసింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 మే 19న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే ప్రభుత్వం ఈ కంపెనీకి మైనింగ్‌ లీజు ఇచ్చింది. అయితే, 2014 సంవత్సరం నాటికీ కంపెనీ మైనింగ్‌ కార్యకలాపాలను ప్రారంభించకపోవడంతో అప్పటి ప్రభుత్వం మైనింగ్‌ లీజు ల్యాప్స్‌ అయినట్లుగా ప్రకటిస్తూ 2014 అక్టోబరు 9న ఉత్తర్వులు ఇచ్చింది.


ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కంపెనీ యాజమాన్యం హైకోర్టులో రిట్‌ దాఖలు చేసింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారంటూ సీబీఐ దర్యాప్తు నిర్వహించింది. దర్యాప్తులో భాగంగా మైనింగ్‌ లీజులో అక్రమాలు జరిగాయని సీబీఐ గుర్తించింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, లీజు ల్యాప్స్‌ అయినట్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరింది. మైనింగ్‌ లీజు ల్యాప్స్‌ అయినట్లు 2014లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో 2019 అక్టోబరు 30న ప్రభుత్వం సరైన సమాచారం పొందుపర్చకుండా కౌంటర్‌ దాఖలు చేసింది. వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారు. సరైన వివరాలు సమర్పించకుండా కోర్టును తప్పుదోవ పట్టించారు. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి రిట్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ... లీజు కాలపరిమితి ముగిసినట్లు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్‌ చేయండి’ అని రఘురామ అప్పీలులో కోరారు. 

Updated Date - 2021-06-23T08:59:56+05:30 IST