మహాభారతాన్ని ఆంధ్రా రాజకీయాలకు ముడిపెట్టిన ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2020-10-13T19:29:39+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ‘ధరిత్రి ఎరుగని చరిత్ర’గా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు అభివర్ణించారు.

మహాభారతాన్ని ఆంధ్రా రాజకీయాలకు ముడిపెట్టిన ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ‘ధరిత్రి ఎరుగని చరిత్ర’గా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు అభివర్ణించారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. న్యాయమూర్తులకు ఉద్దేశ్యాలు ఆపాదించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నా దాడులు ఆగడం లేదన్నారు. పార్లమెంట్‌కు సైతం పరిమితులు ఉన్నాయన్నారు. నందిగం సురేశ్, ఆమంచి కృష్ణ మోహన్, మరికొందరు రెడ్ల పేర్లు కోర్టులను దూషించిన వారి జాబితాలో ఉన్నాయన్నారు. సోషల్ మీడియా దూషణాలపై ఆరు నెలలుగా పిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వైసీపీ నేతలను ఎవరైనా ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే మాత్రం సెక్షన్లపై సెక్షన్లు ఆరోపణల చేస్తూ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేని, చేతకాని, నిస్సహాయ, నిస్సిగ్గు సీబీసీఐడీ రాష్ట్రంలో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో మాతృభాషలోనే హత్య చేసే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  


అలనాడు కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందని, ఇవాళ న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోందంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నేటి అభినవ కౌరవసభలో తానూ భాగస్వామిని అయినందుకు సిగ్గుపడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను వివస్త్రలను చేసే ప్రయత్నం ఎవరు చేసినా వారికి మనుగడ ఉండదన్నారు. ఆనాడు ద్రౌపదిని గోవిందుడు కాపాడితే, ఇవాళ న్యాయవ్యవస్థను కోవిందుడు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కాపాడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-13T19:29:39+05:30 IST