వణుకు పుట్టిస్తున్న రాఘవ నేరచరిత్ర

ABN , First Publish Date - 2022-01-11T02:29:25+05:30 IST

కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయ అండదండతో షాడో ఎమ్మెల్యేగా చలామని అవుతున్న వనమా రాఘవ నేర చరిత్ర వణుకు పుట్టిస్తోంది.

వణుకు పుట్టిస్తున్న రాఘవ నేరచరిత్ర

పాల్వంచ: కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయ అండదండతో షాడో ఎమ్మెల్యేగా చలామని అవుతున్న వనమా రాఘవ నేర చరిత్ర వణుకు పుట్టిస్తోంది. ఇప్పటివరకు ఎన్నికేసులు ఉన్నా బహిర్గతం కాకుండా రాజకీయ పెత్తనం సాగిస్తున్నాడు. రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఘటనలో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నోట్‌లో అతడి నేర చరిత్ర బహిర్గతమైంది. ఏదైనా కేసులో నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచే క్రమంలో సదరు నిందితుడి పూర్తి నేర చరిత్రను వివరిస్తూ పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పిస్తారు. అటువంటి రిమాండ్‌ రిపోర్ట్‌లోనూ వనమా రాఘవకు మార్క్‌ కనపడింది. ఎవరికి లేనంతగా రిమాండ్‌ రిపోర్ట్‌ పోలీసులు సిద్ధం చేశారు. ప్రస్తుతం పాతపాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉండటమే కాకుండా మరో 12కేసుల్లో రాఘవ పలు సెక్షన్ల కింద నిందితుడిగా ఉన్నటు రిపోర్టులో పేర్కొన్నారు.


నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ-3, ఏ-4గా ఉన్న లోగ మాధవి(నాగరామకృష్ణ సోదరి), మండిగ సూర్యావతి(నాగరామకృష్ణ తల్లి)లను పోలీసులు సోమవారం ఉదయం పాతపాల్వంచలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ, వైద్య పరీక్షల అనంతరం ఇద్దరినీ కొత్తగూడెం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14రోజుల రిమాండ్‌ విధిస్తూ ఖమ్మం జిల్లా జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దాంతో పోలీసులు వారిని ఖమ్మం జైలుకు తరలించారు.

Updated Date - 2022-01-11T02:29:25+05:30 IST