‘దయచేసి కాపాడండి.. వారంతా తప్ప తాగి అనుచితంగా వ్యవహరిస్తున్నారు..’

ABN , First Publish Date - 2021-11-15T13:46:33+05:30 IST

వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో మరోసారి ర్యాగింగ్‌ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఓ విద్యార్థి ప్రముఖులకు ట్విటర్‌ వేదికగా చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం ఈ సంఘటనపై విచారణ జరిపారు. వివరాల్లోకి వెళితే..

‘దయచేసి కాపాడండి.. వారంతా తప్ప తాగి అనుచితంగా వ్యవహరిస్తున్నారు..’

కేఎంసీలో మరోసారి ర్యాగింగ్‌ కలకలం

ఫ్రెషర్స్‌ డే వేడుకల్లో విద్యార్థుల మధ్య గొడవ 

హాస్టల్‌-1లో సీనియర్ల అనుచిత ప్రవర్తన 

మోదీ, కేటీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ విద్యార్థి ట్వీట్‌


హనుమకొండ అర్బన్‌: వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో మరోసారి ర్యాగింగ్‌ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఓ విద్యార్థి ప్రముఖులకు ట్విటర్‌ వేదికగా చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం ఈ సంఘటనపై విచారణ జరిపారు. వివరాల్లోకి వెళితే.. కేఎంసీలో రెండు రోజుల కిందట మూడో సంవత్సరం విద్యార్ధులు ఫ్రెషర్స్‌ డే ఏర్పాటు చేసుకున్నారు. దీనికి నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆహ్వానించారు. ఈసందర్భంగా నిర్వహించిన వేడుకలో సుమారు 50మంది పాల్గొన్నారు. అక్కడ వారీ మధ్య గొడవ జరిగింది. మూడో సంవత్సరం విద్యార్థులు తమను గౌరవించడం లేదని, తగిన మర్యాద ఇవ్వడం లేదని సీనియర్లు ఆగ్రహించినట్టు తెలిసింది. ఈనేపథ్యంలో ఆదివారం ట్విటర్‌ వేదికగా ఓ విద్యార్థి పలు ఆరోపణలు చేశాడు.


‘‘కేఎంసీలో ర్యాగింగ్‌ తరహా చాలా ఘటనలు జరుగుతున్నాయి. దయచేసి కాపాడండి. వారంతా తప్ప తాగి జూనియర్‌ మెడికోల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా వరంగల్‌ కేఎంసీలోని న్యూమెన్స్‌ హాస్టల్‌-1లో జరుగుతోంది. దయచేసి కాపాడండి’’ అని కోరాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మంత్రి కేటీఆర్‌, తెలంగాణ డీజీపీ, వరంగల్‌ సీపీతోపాటు మరో 8 మందిని ఈ ట్వీట్‌కు ట్యాగ్‌ చేశాడు. ఈనేపథ్యంలో వరంగల్‌ సీపీ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీసులు ఆదివారం కేఎంసీని సందర్శించారు. న్యూమెన్స్‌ హాస్టల్‌లో ఏం జరుగుతోందనే దానిపై ఆరా తీశారు. ట్విటర్‌లో చేసిన ఫిర్యాదు ప్రాతిపదికగా విచారణ జరిపారు. దీనిపై కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాస్ స్పందిస్తూ.. ఒకటి, రెండు రోజుల్లో స్టూడెంట్‌ వెల్ఫేర్‌ కమిటీతో సమావేశమై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.



Updated Date - 2021-11-15T13:46:33+05:30 IST