రగులుతున్న రాయలసీమ

ABN , First Publish Date - 2021-01-19T09:39:44+05:30 IST

మొన్నటి ఎన్నికల్లో శత కోటి ఆశలతో వైకాపా గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన రాయలసీమ నేడు కుతకుతలాడిపోతోంది. 51 శాసనసభా స్థానాల్లో 49 స్థానాలు...

రగులుతున్న రాయలసీమ

మొన్నటి ఎన్నికల్లో శత కోటి ఆశలతో వైకాపా గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన రాయలసీమ నేడు కుతకుతలాడిపోతోంది. 51 శాసనసభా స్థానాల్లో 49 స్థానాలు కట్టబెట్టామని సోషల్ మీడియాలో గణాంకాలు పొందుపర్చి తమ ఆవేదనలను వెలిబుచ్చుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా తాము ఆశించిన అభివృద్ధి కన్పించడం లేదని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వలస బతుకులు అంతం కావాలని తమ ప్రాంతం కూడా పాడి పంటలతో వర్ధిల్లాలనే ఆకాంక్ష వారిది. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించాలని, ఆగిన ప్రాజెక్టులు పూర్తి చేసి నికరజలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 


ఈ అసంతృప్తి ఒక్కో సమయంలో ఎంతవరకు వెళ్తున్నదంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో మార్గం లేదనే భావజాలానికి ఎక్కువమంది లోనవుతున్నారు. న్యాయ రాజధాని కనుచూపు మేర కన్పించకపోగా, న్యాయంగా కర్నూలులో ఏర్పాటవుతుందని అనుకున్న కృష్ణ యాజమాన్య బోర్డు కేంద్ర కార్యాలయం విశాఖలో ఏర్పాటుకు ప్రకటన వెలువడగానే సీమవాసులు ఆగ్రహిస్తున్నారు. టిడిపి హయాంలో సీమ పరిరక్షణ కోసం పోరాడిన వివిధ ప్రజా సంఘాల నేతలు తాము ఊహించిన ఆశల సౌధాల కోటగోడలు ఒక్కొక్కటిగా కూలి పోతుండగా ‘వికేంద్రీకరణ’ అంటే ఇదేనా అని మధనపడటం మొదలైంది. ఇంతకాలం గళం విప్పిన మేధావులు ఇప్పుడు మౌనం దాల్చడంపై మరి కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతో అట్టహాసంగా ప్రకటించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం విస్తరణ పనులకు బ్రేక్ పడి నెలలు గడుస్తున్నా పరిష్కారం లభిస్తుందనే నమ్మకం సడలి పోతున్న దశలో గుండ్రేవుల రిజర్వాయర్‌కు టెండర్లు పిలిచారు. ఇది కొత్త పథకమని ఇంజనీరింగ్ చీఫ్ కృష్ణ యాజమాన్య బోర్డుకు లేఖ రాయడం సీమ ప్రజలకు అప్పట్లోనే పుండుపై కారం రాసినట్లయింది. అప్పటికీ భరించారు. కాని యాజమాన్య బోర్డు కార్యాలయం విశాఖలో నెలకొల్పేందుకు ప్రకటన వెలువడగానే మిగిలిన ఆశలు ఆవిరైపోయాయి. ఈ లోపు పులిమీద పుట్ర లాగా నంద్యాలలో ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రంలోని 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీకి కేటాయించడంతో కర్నూలు జిల్లాలో నిరసన ధ్వనులు మొదలయ్యాయి. రాయలసీమలో రైతులు పలు రకాల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంటారు. అందుకు అనుగుణంగా కొత్త రకం వంగడాల ఉత్పత్తిలో ఈ వ్యవసాయ క్షేత్రం ప్రధాన భూమిక పోషిస్తున్నది. మెడికల్ కాలేజీకి అవసరమైన ఇతర భూములు ఉన్నా వీటిని కేటాయించడంపై కర్నూలు జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. గమనార్హమైన అంశమేమంటే జిల్లాలోని ప్రజాప్రతినిధులు తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. 


మరో పరిణామం కూడా రాయలసీమ యువతను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా పథకం ప్రకారం హత్యలు దాడులు బెదిరింపులు జరిగితే రాజకీయ పార్టీల నేతలు సీమ వాసుల ప్రస్తావన తీసుకు రావడంపై ఇంతకాలం సీమ యువత భగ్గుమనే వారు. తమ ప్రాంతీయులను ఫ్యాక్షన్ కోణంలో చిత్రించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. అది గతించిన చరిత్రగా తేల్చేవారు. ఒక విధంగా అది వాస్తవం కూడా. కానీ, నేడు సీన్ రివర్స్ అయింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకాలం లేని హత్యలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి నేతల హత్యలు, వారిపై దాడులే కాకుండా వైకాపా వర్గాల్లో కూడా ఫ్యాక్షన్‌ దాడులు పెచ్చుమీరడం సీమ యువతలో ఆందోళన కలిగిస్తోంది. 


వైకాపా అధికారంలోకి రాగానే సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం మొదలౌతాయని సీమ వాసులు భావించారు. నేడు అంతా తలకిందులైంది. హంద్రీనీవా విస్తరణ అటకెక్కింది. గాలేరు నగరి రెండవ దశ పథకం నేల మట్టమైంది. అసలు డిపిఆర్‌లో పేర్కొన్న నీటి కేటాయింపులు దారి దోపిడీకి గురయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమకు చెందిన కీలకమైన అన్ని ప్రాజెక్టులు (వెలుగొండ ఒకటవ టన్నెల్ తప్ప) నిధులు లేమితో, అంతర్ రాష్ట్ర వివాదాలతో పడకేశాయి. ఎద్దు పుండు కాకికి ముద్దా అన్నట్లు ఈ దశలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ సీమ వాసులకు గోరు చుట్టుపై రోకటి పోటులాగా తగిలింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ రెండు పథకాల ఆశలపై చన్నీళ్ళు చల్లినట్లయింది. ఇప్పట్లో ఈ పథకానికి మోక్షం లభిస్తుందనే నమ్మకం సన్నగిల్లింది. అంతేకాదు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం మొదలుపెట్టి నిర్మాణాలు పూర్తయిన సీమ ప్రాజెక్టులను కూడా కొత్త ప్రాజెక్టులుగా కేంద్ర జల్‌శక్తి శాఖ అంచనా వేస్తుంటే రాష్ట్ర జల వనరుల శాఖ ఏం చేస్తున్నదనే ఆగ్రహం సీమ వాసుల్లో వ్యక్తమౌతోంది. ప్రధానంగా కర్నూలు జిల్లాకు చెందిన పలు పథకాలు వివాదంలో చిక్కుకున్నాయి. కేంద్ర మంత్రి లేఖలోని ప్రాజెక్టుల చరిత్ర పరిశీలిస్తే రాష్ట్ర జల వనరుల శాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తినా ఈ పాటికే ఆ ప్రాజెక్టులకు చెందిన వాస్తవ పరిస్థితి రాష్ట్ర జలవనరుల శాఖ ఎందుకు నివేదించలేదు? 


కేంద్ర జల్‌శక్తి మంత్రి రాసిన లేఖ పరిశీలిస్తే, తెలంగాణ ప్రభుత్వం కసి కొద్ది ఎడాపెడా అభ్యంతరాలు తెలిపిన ప్రాజెక్టుల లిస్టును కేంద్ర జల్‌శక్తి శాఖ యధావిధిగా తీసుకున్నట్లుంది. గత ఏడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను బోర్డుకు సమర్పించింది. ఆ దశలోనే ఒక మారు కేంద్రమంత్రి రెండు రాష్ట్రాలు పరస్పరం చేసుకున్న అభ్యంతరాల ప్రాజెక్టుల గురించి ఆయా రాష్ట్రాలకు తెలియజేయడం జరిగింది. కాని ఇప్పటివరకు ఏపీ జల వనరుల శాఖ పాత ప్రాజెక్టుల గురించి బోర్డుకు వివరణ ఇవ్వలేదు. కేవలం పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు చెందిన వివరణ మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నది. అయితే వారు దాన్ని తిరుగు టపాలో పంపారు. ప్రస్తుతం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి తన లేఖలో మరో ముక్తాయింపు ఇచ్చి రెండు రాష్ట్రాలను ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యారు. ‘ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు చేపట్టినా కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపినా ప్రాజెక్టు పరిధి మారితే కొత్తదిగానే పరిగణించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. 


ఈ షరతు మేరకు కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన, ప్రధానంగా సీమ ప్రాజెక్టులకు అభ్యంతరాలు వర్తించవు. ముచ్చుమర్రి, గుండ్రేవుల, గాజులదిన్నె సంప్లిమెంటేషన్‌, గురురాఘవేంద్ర, పులికనుమ, సిద్దాపురం, శివ భాష్యం, ఆర్డీయస్ కుడి కాలువ, నాగులదిన్నె వేదవతి రాయలసీమకు చెందిన పథకాలను కొత్త ప్రాజెక్టులుగా కేంద్ర మంత్రి తమ లేఖలో పేర్కొని వీటికి డిపిఆర్ సమర్పించమని కోరారు.


ఇందులో గుండ్రేవుల, వేదవతి ఒకటి రెండు తప్ప మిగిలిన పథకాల వివరాలను పరిశీలించితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. ముచ్చుమర్రి లిప్టుకు 2007లో పరిపాలన అనుమతి ఇచ్చారు. నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం మార్పులు చేయడం లేదు. తుంగభద్ర దిగువ కాలువకు కేటాయింపులు ఉన్నా పూర్తి స్థాయిలో నీళ్లు రావడం లేదని 18 టియంసిల మాత్రమే వస్తున్నాయని దాని భర్తీకి 1999 మార్చి నెలలో 135 కోట్ల రూపాయల వ్యయంతో తుంగభద్ర నుండి లిఫ్ట్‌ను గురురాఘవేంద్ర పథకం పేర పరిపాలన అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఇదీ కొత్త ప్రాజెక్టుగా చెబుతూ డిపిఆర్ ఇవ్వమంటున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు హంద్రీనదిపై నిర్మాణానికి 1971లో పరిపాలన అనుమతి ఇస్తే 1987 నిర్మాణం పూర్తయింది. సప్లిమెంటేషన్ పేరు పెట్టి కొత్త పథకంగా డిపిఆర్ సమర్పించమని ప్రస్తుతం కోరారు. అలాగే శివ భాష్యం (వరదరాజులు గుడి లిఫ్ట్) కూడా కొత్త ప్రాజెక్ట్ అని డిపిఆర్ కోరడం వింతల్లో వింత. ఈ ప్రాజెక్టు నల్లమల అటవీ ప్రాంతం నుండి వచ్చే మునిమడుగుల వాగుపై 1985లో నిర్మాణం మొదలుపెట్టారు. 2000లో పూర్తయింది. ఈ వాగు భవనాసి వాగులో కలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ పథకాల లిస్ట్ తీసుకొని అభ్యంతరాలు పెట్టినా బోర్డు గాని, కేంద్ర జలశక్తి శాఖ గాని అసలే పరిశీలన చేయలేదు. ఇన్నాళ్లుగా ఎపి ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వకపోవడం జలవనరుల శాఖ పనితీరుకు దర్పణంగా ఉంది. వాస్తవంలో తొలిరోజుల్లోనే గుండ్రేవుల రిజర్వాయర్ కొత్తదని, ఇంకా డిపిఆర్ తయారు కాలేదని తర్వాత సమర్పిస్తామని బోర్డుకు రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ లేఖ రాసినపుడే జలవనరుల శాఖ డొల్లతనం బహిర్గత మైంది. వైకాపా అధికారంలోకి వచ్చి ఎంతోకాలమైనా సీమవాసుల చిరకాల వాంఛితమైన సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు లేకపోవడం మున్ముందు ఏదో జరుగుతుందనే ఆశలను వమ్ము చేస్తోంది. సీమలో ఏర్పడిన అల్పపీడనం త్వరలోనే తుఫాన్ రూపు దాల్చే అవకాశాలు లేకపోలేదు.

వి. శంకరయ్య 

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2021-01-19T09:39:44+05:30 IST