ప్రొటోకాల్‌పై జీవీఎంసీ కౌన్సిల్‌లో రగడ

ABN , First Publish Date - 2022-08-11T09:14:02+05:30 IST

ప్రొటోకాల్‌పై జీవీఎంసీ కౌన్సిల్‌లో రగడ

ప్రొటోకాల్‌పై జీవీఎంసీ కౌన్సిల్‌లో రగడ

మేయర్‌, కమిషనర్‌ సమక్షంలో వైసీపీ, విపక్ష సభ్యుల తోపులాట

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): విపక్ష కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిని టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన కార్పొరేటర్లు నిలదీశారు. బుధవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో సభను జీరో అవర్‌తో ప్రారంభించాలని విపక్ష సభ్యులు పట్టుబడడంతో అందుకు మేయర్‌ అనుమతించారు. టీడీపీ, ఇతర విపక్షాలకు చెందిన కార్పొరేటర్లు లేచి తమ వార్డుల్లో అధికారిక కార్యక్రమాల నిర్వహణలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఆరోపించారు. తమపై ఓడిపోయిన వారిని ముందుపెట్టి కార్యక్రమాలు జరిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్‌ లక్ష్మీషా బదులిస్తూ ఇకపై ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇప్పటి వరకూ తాము చేసిన ఫిర్యాదులపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. మేయర్‌ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో విపక్ష సభ్యులంతా మేయర్‌ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఆ సమయంలో డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌ ఆవేశంగా దూసుకుంటూ వచ్చి, టీడీపీ సభ్యులను నెట్టేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.  సభలో గందరగోళం జరుగుతుండగానే అజెండాలోని అంశాలన్నింటికీ మేయర్‌ ఆమోదం తెలిపి, పోడియం దిగి వెళ్లిపోయారు.


Updated Date - 2022-08-11T09:14:02+05:30 IST