రాఫెల్స్‌ వచ్చేశాయ్‌!

ABN , First Publish Date - 2020-07-30T07:08:22+05:30 IST

దాదాపు రెండు దశాబ్దాల ఎదురుచూపులు ఫలించాయి! భారత వైమానిక దళ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది! మన వైమానిక దళ పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింపజేసే ఐదు రాఫెల్‌ యుద్ధవిమానాలు బుధవారం మనదేశానికి....

రాఫెల్స్‌ వచ్చేశాయ్‌!

భారత గడ్డపైకి ఐదు యుద్ధ విమానాలు

అంబాలా ఎయిర్‌బేస్‌లో ల్యాండింగ్‌

జలఫిరంగులతో సంప్రదాయ స్వాగతం

హాజరైన వైమానిక దళాధిపతి భడౌరియా

భారత్‌కు చేరుకున్న ఐదు విమానాల్లో మూడు సింగిల్‌ సీటర్‌ ఫైటర్‌ జెట్లు

మిగతా రెండూ ట్విన్‌ సీటర్‌ ట్రైనర్‌ జెట్లు

‘స్వాగతం’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌

నవశకం ఆరంభం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

దేశ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించాలనుకునేవారికి వీటితో భయం కలుగుతుందంటూ చైనాకు పరోక్ష చురకలు

భారత వైమానిక దళానికి ఇది చరిత్రాత్మక దినం: అమిత్‌ షా


న్యూఢిల్లీ, జూలై 29: దాదాపు రెండు దశాబ్దాల ఎదురుచూపులు ఫలించాయి! భారత వైమానిక దళ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది! మన వైమానిక దళ పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింపజేసే ఐదు రాఫెల్‌ యుద్ధవిమానాలు బుధవారం మనదేశానికి చేరుకున్నాయి. ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన ఈ విమానాలు ఏడుగంటల ప్రయాణం అనంతరం సోమవారం సాయంత్రం యూఏఈలోని అల్‌ దఫ్రా ఎయిర్‌బే్‌సలో దిగాయి. మంగళవారం గగనతలంలో 30 వేల అడుగుల ఎత్తున ఫ్రాన్స్‌ ట్యాంకర్‌ నుంచి ఇంధనం నింపుకొన్నాయి. మొత్తం ఏడువేల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి.. అంబాలా(హరియాణా)లోని వాయుసేన బేస్‌లో.. బుధవారం మధ్యాహ్నం 3:10 గంటలకు ల్యాండయ్యాయి! భారత గగనతలంలోకి ఈ యుద్ధవిమానాలు ప్రవేశించగానే.. రెండు సుఖోయ్‌ 30 ఎంకేఐలు వాటికి ఎస్కార్టుగా ప్రయాణించి అంబాలా బేస్‌ దాకా తోడ్కొని వచ్చాయి (భారతవైమానిక దళానికి చెందిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక స్థావరాల్లో అంబాలా బేస్‌ ఒకటి. అక్కణ్నుంచి భారత్‌-పాక్‌ సరిహద్దు 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది). ల్యాండయిన ప్రతి విమానానికీ సంప్రదాయం ప్రకారం జలఫిరంగులతో స్వాగతం పలికారు.


వైమానిక దళాధిపతి ఆర్కేఎస్‌ భడౌరియా,  సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌కు చేరుకున్న ఈ ఐదు విమానాల్లో మూడు సింగిల్‌ సీటర్‌వి కాగా.. రెండు ట్విన్‌ సీటర్‌ విమానాలు. దేశానికి చేరుకున్న రాఫెల్‌ యుద్ధవిమానాలకు ప్రధాని మోదీ సంస్కృతంలో స్వాగతం చెబుతూ ‘రాఫెల్‌ ఇండియా’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌చేశారు. ‘‘దేశ రక్షణే పుణ్యం. దేశ రక్షణే వ్రతం. దేశ రక్షణే గొప్ప యజ్ఞం. దీన్ని మించినది ఏదీ లేదు. ఆకాశాన్ని గర్వంగా తాకుదాం. స్వాగతం’’ అని అందులో పేర్కొన్నారు. రాఫెల్‌ విమానాల రాకను ఉద్దేశించి.. ‘‘పక్షులు అంబాలాలో సురక్షితంగా దిగాయి’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఘట్టాన్ని ఆయన భారత సైనిక చరిత్రలో కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించారు. దేశ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించాలనుకునేవారు..  ఈ కొత్త సామర్థ్యాన్ని చూసి భయపడాల్సిందేనంటూ చైనాకు పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. దేశానికి ఎదురయ్యే ఎలాంటి ప్రమాదాన్నైనా దీటుగా అడ్డుకునే శక్తిని భారతవైమానిక దళం ఈ విమానాలతో సంతరించుకుంటుందని పేర్కొన్నారు. భారత వైమానిక దళానికి అవసరమైన సదుపాయాలన్నింటితో వీటిని కొనుగోలుచేశామని.. ఈ విమానాల కొనుగోలుపై వచ్చిన ఆధార రహిత ఆరోపణలన్నింటికీ సమాధానం చెప్పామని వివరించారు. కేవలం మోదీ వల్లే రాఫెల్‌ యుద్ధవిమానాల ఒప్పందం కుదిరిందని.. చాలాకాలంపాటు పెండింగ్‌లో ఉన్న ఈ కొనుగోలుపై ప్రధాని మోదీ సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా రాఫెల్‌ విమానాలను తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.


రాఫెల్‌ యుద్ధవిమానాలు భారతదేశానికి వచ్చిన రోజును భారత వైమానిక దళానికి చరిత్రాత్మక దినంగా.. భారతదేశానికి గర్వకారణమైన క్షణాలుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. గగనతలంలో ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే సామర్థ్యం వాటికి ఉందని పేర్కొన్నారు. కాగా రాఫెల్‌ యుద్ధ విమానాలు నేరుగా తమ గడ్డపై దిగడంతో హరియాణాలోని అంబాలా ప్రజల సంబరం అంబరాన్నంటింది. విమానాలు ల్యాండవగానే అంతా మిఠాయిలు పంచుకుంటూ వీధుల్లో నృత్యాలు చేశారు. కొందరు వ్యాపారులు, మాజీ సైనికులు మూడు రంగుల బెలూన్లను ఎగురవేసి.. ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు. కాగా చైనా వద్ద ఉన్న యుద్ధవిమానాల కన్నా రాఫెల్‌ అత్యంత శక్తిమంతమైనది, అధునాతనమైనది, ప్రాణాంతకమైనదని రక్షణ రంగ నిపుణుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ బెహరా అన్నారు. చైనా వద్ద ఉన్న జే-20 ఫైటర్‌ జెట్లకు, రాఫెల్‌కు అసలు పోలికే లేదని ఐఏఎఫ్‌ మాజీ చీఫ్‌ ఫాలీ హోమీ మేజర్‌ తెలిపారు.



Updated Date - 2020-07-30T07:08:22+05:30 IST