టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-06-18T01:21:47+05:30 IST

స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ...

టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ సంచలన నిర్ణయం

స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ నెల 28న ప్రారంభమయ్యే వింబుల్డన్ ఛాంపియన్షిప్స్‌తో పాటు వచ్చే నెలలో మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో తాను పాల్గొనబోనని ప్రకటించాడు. 20 సార్లు గ్రాండ్ స్లామ్‌, రెండు సార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన 35 ఏళ్ల ఈ టెన్నిస్ స్టార్... గురువారం ట్విటర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘హాయ్ ఆల్... ఈ ఏడాది జరిగే వింబుల్డన్ చాంపియన్‌షిప్స్, టోక్యో ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయమేమీ కాదు.. కానీ నా శారీరక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, నా బృందంతో చర్చించాక ఈ నిర్ణయం సరైనదేనని అర్థం చేసుకున్నాను..’’ అని నాదల్ పేర్కొన్నాడు. 


‘‘కెరీర్‌ని మరింత కాలం పాటు కొనసాగించడం, నాకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేయడమే నా లక్ష్యం. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన లక్ష్యాలను సాధించేందుకు పూర్తి స్థాయిలో పోటీపడాలనీ... వాటి కోసం నా పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను..’’ అని నాదల్ పేర్కొన్నాడు. ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌ల్ సెమీ ఫైనల్ వరకు చేరుకున్న నాదల్.. నొవాక్ జెకోవిచ్ చేతిలో 6-3, 3-6, 6-7, 2-6 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. 



Updated Date - 2021-06-18T01:21:47+05:30 IST