‘రాడిసన్ -బ్లూ’లో ఏం జరిగింది?

ABN , First Publish Date - 2022-04-04T08:39:04+05:30 IST

డ్రగ్స్‌ వినియోగంపై సమాచారంతో రాడిసన్‌-బ్లూ హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడుల సందర్భంగా..

‘రాడిసన్ -బ్లూ’లో ఏం జరిగింది?

అది బర్త్ డే పార్టీ కాదు!

అంతా ఎవరికి వారుగా పబ్‌కు వచ్చారు

ఐదారుగురు చేసినదానికి 100 మందికి పైగా కస్టమర్లు పోలీస్ స్టేషన్‌లో..

బాధితుల్లో ఐదుగురు విదేశీ యువతులు

‘ఆంధ్రజ్యోతి’తో బాధితుల గోడు 


(హైదరాబాద్‌ సిటీ బ్యూరో ప్రతినిధి, ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ వినియోగంపై సమాచారంతో రాడిసన్‌-బ్లూ హోటల్‌లోని పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడుల సందర్భంగా.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వ్యవహరించిన తీరు సరైందేనా? డ్రగ్స్‌ ఉన్నాయా? లేదా? చూడకుండా 148 మందిని అదుపులోకి తీసుకోవడం.. వారిని పోలీసు ఠాణాకు తరలించడం.. ఏడుగంటల పాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేయడం.. ఆ తర్వాత వదిలేయడం..! ఇదంతా సమంజసమేనా? డ్రగ్స్‌పై దాడులు సరైనవేనని, ఏ పాపం తెలియని వారిని ఇబ్బందులకు గురిచేయడం దారుణమని పలువురు బాధితులు వాపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో పలువురితో ‘ఆంధ్రజ్యోతి’ మాట్లాడగా.. పోలీసులు తమ ఆపరేషన్‌కు ముందు ఎలాంటి కసరత్తు చేయలేదని, ఆపరేషన్‌ తర్వాత బ్యాకప్‌ ప్రోగ్రామ్‌ ఏమిటనే ప్రణాళిక లేకుండా.. ఇష్టారాజ్యంగా ఠాణాకు తరలించారని చెబుతున్నారు. ఐదుగురు విదేశీ మహిళలైతే ఇది ‘అన్‌ ప్రొఫెషనల్‌’ పోలీసింగ్‌ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


నోటితో చెప్పలేని విధంగా తిట్లు!

పోలీ్‌సస్టేషన్‌లో మహిళల పట్ల ఒకరిద్దరు కానిస్టేబుళ్లు దురుసుగా వ్యవహరించారని.. నోటితో చెప్పలేని విధంగా ఓ యువతిని తిట్టారని ఓ మహిళ వివరించారు. ‘‘పబ్‌కు వెళ్లడం తప్పు, నేరం కాదు కదా? ఎవరో చేసిన తప్పును కారణంగా చూపుతూ పబ్‌లో ఉన్నవారందరినీ ఠాణాకు తీసుకురావడం ఎంత వరకు సబబు? ‘ఎంత సేపు ఠాణాలో ఉంచుతారు?’ అని ఓ యువతి ప్రశ్నిస్తే.. అక్కడున్న ఓ కానిస్టేబుల్‌ బూతులు తిట్టాడు. ఒకరిద్దరు కానిస్టేబుళ్లు ఇలా ప్రవర్తించారు. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన ఓ యువతి కంటతడి పెట్టింది’’ అని వివరించారు. ఏపీకి చెందిన ఓ విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి కూతురు ఇటీవలే అమెరికా నుంచి రాగా.. తన స్నేహితురాళ్లతో సరదాగా పబ్‌కు వచ్చారని పేర్కొన్నారు. చేయని నేరానికి ఆ యువతి, ఆమె స్నేహితురాళ్లను ఠాణాలో కూర్చోబెట్టారని తెలిపారు. ‘‘తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే. డ్రగ్స్‌ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఏ తప్పూ చేయనివారికి ఎందుకీ శిక్ష’’ అని ప్రశ్నించారు. మరో యువకుడు మాట్లాడుతూ అసలు అది బర్త్‌డే పార్టీనే కాదన్నారు. ‘‘ఐదారుగురు మాత్రమే ఏదో పుట్టిన రోజు వేడుక జరుపుకొన్నారు. మిగతా వారికి ఆ వేడుకతో సంబంధమే లేదు. మరో ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి నేను పబ్‌కు వచ్చాను. అర్ధరాత్రి 2 గంటలకు ఠాణాకు తీసుకెళ్లారు. ఉదయం 9 గంటలకు విడిచిపెట్టారు’’ అని వివరించారు. డ్రగ్స్‌ అనుమానాలుంటే.. రక్త నమూనాలు తీసుకోవాలని, అసలు పోలీసులు ఆ దిశలో ప్రయత్నాలే చేయలేదన్నారు. 


ప్లానింగ్‌ లేకుండా దాడులు

పోలీసులు అసలు ఏమాత్రం ప్రణాళిక లేకుండా దాడులు చేశారని, అమాయకులను ఇబ్బంది పెట్టారని ఓ యువతి వాపోయారు. ‘‘రాత్రి సమయంలోనూ పబ్‌ తెరిచి ఉంది కదా అని నేను లోనికి వెళ్లాను. డ్రింక్‌ ఆర్డరిచ్చాను. తాగింది లేదు. అంతలోనే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వచ్చారు. ఠాణాకు తీసుకెళ్లారు. మేం డ్రగ్స్‌ తీసుకోలేదని, బ్లడ్‌ టెస్ట్‌ చేసుకోవచ్చని చాలా మంది కోరారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పై అధికారులు చెప్పేదాకా వెయిట్‌ చేయాలన్నారు. అంటే.. దాడులు చేశాక.. తర్వాత ప్లానింగ్‌ లేకుండానే అందరినీ పోలీ్‌సస్టేషన్‌కు తీసుకువచ్చారు. ఉదయం 7 గంటల నుంచి ఒక్కొక్కరి వివరాలు తీసుకుని, పంపించడం ప్రారంభించారు. ఆ పబ్‌కు వెళ్లిన పాపానికి నరకాన్ని అనుభవించాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నిస్తే.. ‘‘కామ్‌గా కూర్చోండి. లేకుంటే వీడియోలు తీస్తాం’’ అని బెదిరించారని మరో యువతి వాపోయారు. ‘‘సీనియర్‌ అధికారి నిద్రపోతున్నారు. ఆయన లేచి ఆదేశాలిచ్చాక తదుపరి ప్రక్రియ ఉంటుంది’’ అంటూ పోలీసులు దురుసుగా చెప్పారంటూ మరికొందరు ఆరోపించారు. ఇంత పెద్ద ఆపరేషన్‌కు ఆదేశాలిచ్చిన సదరు అధికారి.. ఇంత మందిని ఇబ్బంది పెట్టి ఎలా నిద్రపోతారని ప్రశ్నించారు.


విదేశీ యువతుల సీరియస్‌

పోలీసులు ఠాణాకు తరలించిన వారిలో ఐదుగురు విదేశీ యువతులు ఉన్నారు. ‘‘హైదరాబాద్‌ సిటీలో ఇలా జరుగుతుందా?’’ అంటూ వారు ప్రశ్నించారు. ‘‘అన్‌ ప్రొఫెషనల్‌ పోలీసింగ్‌. ఇలానా తనిఖీలు చేసేది? తప్పు చేస్తే శిక్షించాలేకానీ, ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని పట్టించుకోరా? ఇలా వ్యవహరించడం వేధింపులకు గురిచేయడమే’’ అని వారు అన్నారు. ఇలాంటి చేదు అనుభవాన్ని తామెన్నడూ ఎదుర్కోలేదని, దీనిపై తమ కాన్సులేట్‌లో ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ‘‘తనిఖీలు చేయడం తప్పు కాదు. కానీ, దానికి ఒక ప్రణాళిక ఉండాలి కదా?’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2022-04-04T08:39:04+05:30 IST