19 నక్షత్రాల నుంచి రేడియో సిగ్నల్స్.. గ్రహాంతరవాసుల పనే అని అనుమానం..

ABN , First Publish Date - 2021-10-13T21:46:54+05:30 IST

తాజాగా సౌర వ్యవస్థ అవతలి నుంచి రేడియో తరంగాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది గ్రహాంతరవాసుల పనే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

19 నక్షత్రాల నుంచి రేడియో సిగ్నల్స్.. గ్రహాంతరవాసుల పనే అని అనుమానం..

గ్రహాంతరవాసుల గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా.. అవి ఉన్నట్లు ఇప్పటివరకూ సరైన ఆధారాలు లేవు. ఎక్కడ ఏదైనా వింత ఘటన జరిగితే.. అది గ్రహాంతరవాసుల పనే అంటూ చర్చ జరగడం సాధారణమైంది. వీటి ఉనికిపై ఎన్నో దశాబ్దాల నుంచి అన్ని దేశాల శాస్త్రవేత్తలూ పరిశోధనలు సాగిస్తున్నారు. అయినా  వాటి గురించి ఆధారాలు లభ్యమవలేదు. ఏలియన్స్‌ను చూశామంటూ కొన్నిసార్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. అవి ఎంత వరకు నిజమో తెలీదు గానీ.. వీడియోలు మాత్రం తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా సౌర వ్యవస్థ అవతలి నుంచి రేడియో తరంగాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది గ్రహాంతరవాసుల పనే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అంతరిక్షం నుంచి చాలా సార్లు గుర్తు తెలియని సిగ్నల్స్‌ వచ్చాయి. వాటిని ఏలియన్సే పంపి ఉంటారని అనుకున్నారు. అయితే వస్తున్న సిగ్నల్స్ మాత్రం.. ప్రత్యేకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


అంతరిక్షం నుంచి కొత్త సంకేతాలు అందుతుండడంతో ఏలియన్స్ ప్రస్తావన.. మరోసారి తెరపైకి వచ్చింది. మన సౌర వ్యవస్థకు అవతల నుంచి వస్తున్న రేడియో సంకేతాలను తొలిసారిగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుదూర నక్షత్రాల నుంచి వస్తున్న అసాధారణ సంకేతాలను రేడియో యాంటెనా ‘ద డచ్‌ లో-ఫ్రీక్వెన్సీ అరే’ (లోఫర్‌) సాయంతో గుర్తించారు. 19 అరుణ మరుగుజ్జు నక్షత్రాల నుంచి సిగ్నల్స్ గుర్తించామని చెబుతున్నారు. అయితే వీటిలో నాలుగు నక్షత్రాల చుట్టూ ఇతర గ్రహాలు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. వాటిపై ఏలియన్స్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


సౌరకుటుంబంలోని గ్రహాల నుంచి శక్తివంతమైన రేడియో తరంగాలు వస్తుంటాయని, అయితే ఇప్పుడు వస్తున్న తరంగాలు.. చాలా ప్రత్యేకంగా ఉన్నాయని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి తరంగాలు అందలేదంటున్నారు. మరుగుజ్జు నక్షత్రాల్లో తీవ్రస్థాయిలో అయస్కాంత చర్యలు ఉంటాయని, ఫలితంగా రేడియో తరంగాలు వెలువడుతుంటాయట. ఇప్పుడు వస్తున్న తరంగాలు అలాంటివే అని చెబుతున్నారు. దీనిపై లోతైన విశ్లేషణ చేస్తే మరింత ఖచ్చిత సమాచారం వస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-10-13T21:46:54+05:30 IST