Apr 14 2021 @ 10:41AM

దర్శకురాలిగా మారిన రాధిక ఆప్టే..!

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్.. ఇతర నటీ నటులు.. సంగీత దర్శకులు, సినిమాటోగ్రాఫర్స్ ..ఇలా 24 భాగాలకు చెందిన వారిలో కొంతమందికి మెగా ఫోన్ పట్టాలని ఎంతో తాపత్రయం ఉంటుంది. కానీ అవకాశం రావాలి. ఇక్కడ ఒక విభాగంలో సత్తా చాటడమే కష్టం. ఒకేసారి రెండు పడవల ప్రయాణం అంటే పెద్ద రిస్క్ చేస్తున్నట్టే. అయితే టాలెంట్ ఉంటే తమని తాము ప్రూవ్ చేసేకునేందుకు బాగానే ఆరాటపడుతున్న వాళ్ళు ఇటు సౌత్ గానీ అటు నార్త్‌లో గానీ చాలామందే ఉన్నారు. వారిలో తాజాగా హీరోయిన్ రాధికా ఆప్టే దర్శకురాలిగా మారి ఒక షార్ట్ ఫిలింని తెరకెక్కించింది. రాధికా ఆప్టేకి నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి పేరే ఉంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్', 'లయన్' సినిమాలు చేసింది. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి'లో కూడా రాధికా ఆప్టే నటించి మంచి పేరు సంపాదించుకుంది. 

కాగా తాజాగా మెగా ఫోన్ పట్టి హార్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'స్లీప్ వాకర్స్' లఘు చిత్రానికికి దర్శకత్వం వహించింది. షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాధికా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా రాధికా ఆప్టే మాట్లాడుతూ..నేను ఎప్పుడూ దర్శకురాలిగా మారతానని ఎప్పుడు భావించాలేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆ ఆలోచనే నాకు లేదు. ఆసక్తికరంగా అనిపించి రాయాలనుకున్నాను. హనీ ట్రెహాన్, అభిషేక్ చౌబేలకు ఈ కథ చెప్పినప్పుడు.. నిర్మించాలనుకున్నారు. షూటింగ్‌కు, ప్రిపేరేషన్‌కు 10 రోజులు ఉందనగా కథ రాయడం అయిపోయింది. అయితే ఈ కథలో నేను నటించాలనుకోలేదు. దర్శకత్వం వహించాలనిపించింది. అందుకే 'స్లీప్ వాకర్స్'కి నేనే దర్శకత్వం చేశాను. డైరెక్షన్ నాకు బాగా నచ్చిందని వెల్లడించింది.