Jul 30 2021 @ 22:44PM

సంక్రాంతికి ‘రాధే శ్యామ్‌’

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్‌’. వాస్తవానికి ఈ నెల 30న విడుదల చేయాలనుకున్నారు. అన్నీ కుదిరితే శుక్రవారమే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఉండేది. అయితే, కరోనా రెండో దశ పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు శుక్రవారం చిత్రబృందం వెల్లడించింది. అలాగే, ప్రభాస్‌ కొత్త స్టిల్‌ను విడుదల చేసింది. క్లాసీ లుక్‌లో హీరో చాలా స్టయిలిష్‌గా ఉన్నాడని అభిమానులు సంబరపడుతున్నారు.


తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం - ఐదు భాషల్లో ఏకకాలంలో ‘రాధే శ్యామ్‌’ను విడుదల చేయనున్నట్టు చిత్రాన్ని నిర్మిస్తున్న వంశీ, ప్రమోద్‌, ప్రసీధ వెల్లడించారు. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. దక్షిణాది భాషలకు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా, హిందీ వెర్షన్‌కు మిథున్‌-మనన్‌ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, సమర్పణ: కృష్ణంరాజు.


సంక్రాంతి22 బరిలో ముక్కోణపు పోటీ!

ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ విడుదల తేదీ ప్రకటనతో ప్రస్తుతానికి సంక్రాంతి 2022 బరిలో ముక్కోణపు పోటీ నెలకొంది. ‘సర్కారు వారి పాట’ను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు మహేశ్‌బాబు చిత్రబృందం గతంలో వెల్లడించింది. ఇటీవలే పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి హీరోలుగా నిర్మిస్తున్న చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలియజేసింది. ఎవరూ వెనక్కి తగ్గకపోతే... మూడు చిత్రాల మధ్య పోటీ నెలకొనడం ఖాయం. నిజం చెప్పాలంటే... వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా రూపొందుతోన్న ‘ఎఫ్‌ 3’ను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.


‘ఎఫ్‌ 2’ సంక్రాంతికి విడుదలైంది. భారీ వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్‌ 3’నూ సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయాలని సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయితే, ఇప్పటికే మూడు చిత్రాలు పోటీలో ఉండటంతో ముందుకు వస్తారో? వెనక్కి వెళతారో? చూడాలి. సంక్రాంతికి ఇంకా ఐదు నెలల సమయం ఉండటంతో అప్పటికి ఏదైనా జరగొచ్చు. అన్నీ భారీ చిత్రాలే కనుక... థియేటర్ల సమస్య తలెత్తకుండా పరస్పర అంగీకారంతో విడుదల తేదీలను మార్చుకోవచ్చు.