Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఏపీ బీపీ... బూతు రోత!

twitter-iconwatsapp-iconfb-icon
ఏపీ బీపీ... బూతు రోత!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు జుగుప్సాకర స్థాయికి చేరుకున్నాయి. ఉద్దండ పండితులు, భాషాకోవిదులు నడయాడిన చోట ఇప్పుడు బూతులు రాజ్యమేలుతున్నాయి. నాయకుల నోటివెంట అత్యంత అభ్యంతరకరమైన పదాలు అలవోకగా జాలువారుతున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఉపయోగించిన ఒక పదం రాష్ట్ర రాజకీయాల్లో బీపీ తెచ్చింది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘బోసడికే’ అని తిడతావా అంటూ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల నేతృత్వంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడం, అందుకు నిరసనగా దాడిలో ధ్వంసమైన పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటలు దీక్ష చేయడం, ప్రతిగా వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ‘జనాగ్రహ దీక్ష’ చేయడాన్ని చూశాం. ‘బోసడికే’ అన్న పదంతో ముఖ్యమంత్రిని తిట్టినందుకు పోలీసులు పట్టాభిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఈ మొత్తం వ్యవహారంలో రెండు మూడు అంశాలు కీలకంగా మారాయి. రాజకీయాలలో బూతులు తిట్టడాన్ని మొదలు పెట్టింది ఎవరు? ఒక తప్పునకు రెండు శిక్షలు విధించవచ్చునా? పగలు-ప్రతీకారాలకు నిలయంగా రాష్ట్రం మారబోతోందా? అన్న అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం అవడమే కాకుండా ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రినిగానీ మరొకరిని గానీ బోసడికే అని తిట్టడం ముమ్మాటికీ తప్పే. ఈ విషయంలో పట్టాభి తప్పు చేశారు. నిజానికి తెలుగునాట కొన్ని పదాలను అర్థం తెలియకుండా వాడడం ఎప్పటి నుంచో జరుగుతోంది. మాదర్చోద్‌, బోసడికే వంటి పదాలు ఈ కోవలోకే వస్తాయి. ‘రౌడీ నెంబర్‌ వన్‌’ చిత్రంలో కథానాయకుడు కృష్ణ, ప్రతి నాయకుడిని బోసడికే అని తిడతాడు. హాస్యబ్రహ్మ జంధ్యాల చిత్రం ‘జంబలకిడి పంబ’లో కూడా ఈ పదాన్ని వాడారు. అయితే ఆ చిత్ర నిర్మాతలకు, దర్శకులకు ఈ పదం అర్థం తెలియకపోయి ఉండవచ్చు. అర్థం తెలిసి ఉంటే సెన్సార్‌ బోర్డు కూడా అనుమతించి ఉండేది కాదు. అంతెందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొనే ‘జబర్దస్త్‌’ అనే కార్యక్రమంలో ఒక మహిళా పాత్రధారి మరొకరిని బోసడికే అని పిలవడం, రోజా విరగబడి నవ్వడం చాలా మంది చూసి ఉంటారు. సన్నిహిత మిత్రులు కూడా బోసడికే అని పిలుచుకోవడం విన్నాం. మాదర్చోద్‌ అనే పదం విషయానికి వద్దాం! ఈ పదం కూడా అత్యంత అభ్యంతరకరమైనదే. అయితే వాడుకలో దీన్ని మరొక అర్థంతో వాడుతున్నారు. తెలివైన పిల్లలను లేదా ఫలానా వాడు ముదురు అని చెప్పడానికి మాదర్చోద్‌ అనే పదం వాడుతున్నారు. ఒక కార్యక్రమంలో సినీ గాయని శ్రీమతి జానకి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను ఉద్దేశించి మాదచ్చోద్‌ అన్నారు. బాలూని తిట్టడం కోసం ఆమె ఈ పదం వాడలేదు. పట్టాభి కూడా బోసడికే పదాన్ని అర్థం తెలియకుండా వాడినప్పటికీ ఈ పదప్రయోగం సమర్థనీయం కాదు. అయితే ఒక తప్పునకు రెండు శిక్షలు విధించవచ్చునా? అలా చేయవచ్చునని భారత శిక్షాస్మృతిలో లేదే! ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని బోసడికే అని తిట్టినందుకు రక్తపోటు వచ్చిన కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పట్టాభి ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. పని మనిషితో పాటు పట్టాభి కూతురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాత్‌రూమ్‌లో దాక్కోవలసి వచ్చింది. పట్టాభి ఇంట్లో చెయ్యాల్సిన విధ్వంసం పూర్తయ్యాక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పైకి దండెత్తి అక్కడ కూడా విధ్వంసం సృష్టించారు. అదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు చేయబోయారు. అంటే, అభ్యంతరకరమైన పదాన్ని వాడినందుకు పట్టాభి ఇల్లు ధ్వంసం చేశారు. ఈ లెక్కన పట్టాభిపై ప్రతీకారం తీర్చుకున్నట్టే కదా! అంతటితో ఆగకుండా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం చేశారు. అంటే, ఎకౌంట్‌ సెటిల్‌ అయింది అనుకోవచ్చు. కానీ, ఆ తర్వాత పట్టాభిపై పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. ఈలెక్కన ఒక తప్పుకు రెండు శిక్షలు విధించినట్టే కదా! ఇంతకీ బోసడికే అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి పట్టాభి అన్నారా? లేక సజ్జల రామకృష్ణా రెడ్డిని ఉద్దేశించి అన్నారా? అన్నది సంశయాత్మకంగా ఉంది. తననే లం....కొడకా అని తిట్టారని జగన్‌రెడ్డి స్వయంగా చెప్పుకొన్నందున ప్రస్తుతానికి ఆయన చెప్పిందే నిజమని నమ్ముదాం! పట్టాభి చెబితే కానీ ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నదీ స్పష్టం కాదు.


ఎవరిది బూతు...?

ఇప్పుడు రాజకీయాలలో బూతులు ప్రవేశపెట్టింది ఎవరు? అన్న విషయానికి వద్దాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్మోహన్‌ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పుతో కొట్టాలి, కాల్చి చంపాలి అంటూ తిట్టిపోశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అదే బాటలో దారుణంగా తిడుతుండేవారు. అయినా ఆనాటి ప్రభుత్వం జగన్‌తో పాటు ఎవరిపైనా కేసులు పెట్టలేదు. చంద్రబాబుకు అభిమానులు లేరేమో తెలియదుగానీ ఒక్కరికి కూడా రక్తపోటు పెరగలేదు. వైసీపీ కార్యాలయాలపై దాడులు జరగలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు తమకు లైసెన్స్‌ వచ్చినట్టుగా భావిస్తూ చంద్రబాబును దారుణంగా తిట్టిపోస్తూ వచ్చారు. ముఖ్యమంత్రినైన తనను లం...కొడకా అని తిట్టడం ఏంటని జగన్‌రెడ్డి వాపోయారు. నిజమే! ఆయననే కాదు, ఇతరులను కూడా అలా తిట్టకూడదు. అయితే, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి చాలా రోజుల క్రితమే చంద్రబాబును ఉద్దేశించి ‘బోసడికే’ అని కూడా కాకుండా లం...కొడకా అని తెలుగులోనే తిట్టారు. ఆ తర్వాత మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వంటి వారు చంద్రబాబును, లోకేశ్‌ను అత్యంత అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించి దూషించారు. చంద్రబాబు సతీమణి శ్రీమతి భువనేశ్వరిని దారుణంగా అవమానిస్తూ వల్లభనేని వంశీ అనే ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీరామారావు పెంపకాన్నే శంకించేలా ఉన్నాయి ఆ మాటలు. ఉచ్చనీచాలు మరిచిన ఆ వ్యాఖ్యలు బోసడికే అనే తిట్టుకంటే తీవ్రమైనవి కావా? దీనికి జగన్‌ ఏమని సమాధానం చెబుతారు? ఇలాంటి సందర్భాలలో జగన్‌రెడ్డి ఒక్కసారంటే ఒక్కసారి కూడా నోటితీటరాయుళ్లను వారించలేదు. పైపెచ్చు చంద్రబాబును ఎంత బాగా తిట్టగలిగితే జగన్‌రెడ్డి అంత సంతోషిస్తారన్న భావనను పార్టీ నాయకులూ, కార్యకర్తల్లో కలిగించారు. ఇప్పుడు జగన్‌రెడ్డిని పట్టాభి తిట్టినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటున్నారు. అప్పుడు చంద్రబాబును మంత్రులు, ఎమ్మెల్యేలు తిట్టినందుకు జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం వాళ్లు డిమాండ్‌ చేయలేదు. వైసీపీ కార్యాలయాలపై దాడులు కూడా చేయలేదే! చంద్రబాబును లం...కొడకా, నీ కారుపై బాంబులు వేస్తాం అన్నప్పుడు పోలీసులకు అభ్యంతరకరంగా అనిపించనప్పుడు ఇప్పుడెందుకు అనిపిస్తోంది? వైసీపీ వాళ్లకు మాత్రమే కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయన్నట్టు వ్యవహరిస్తున్న పోలీసులను ఎంత విమర్శించినా తక్కువే. పట్టాభితో చంద్రబాబే తిట్టించాడని అంటున్నవాళ్లు చంద్రబాబును మంత్రులతో జగన్‌రెడ్డే తిట్టించాడని అంగీకరిస్తారా? బోసడికే పదాన్ని వాడినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అంటున్నవాళ్లు ఇంతకు ముందు జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరలేదెందుకో? ప్రత్యర్థులను, ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌లను దూషించే హక్కు తమకు మాత్రమే ఉందని వైసీపీ నాయకులు భావిస్తున్నారా? రాజకీయాలు ఇంతగా దిగజారడం బాధగా ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డి తరచూ అంటుండేవారు. ఇప్పుడు తన మంత్రులు నోరు పారేసుకుంటున్నప్పటికీ ఆయనకు బాధ కలగలేదెందుకో!


ఇదేమి పోలీసింగ్‌...?

ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుశాఖ వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉంది. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే జోగి రమేశ్‌ నాయకత్వంలో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించినా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. పట్టాభి ఇంటిపైనా, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైనా దాడి చేసినవారెవరో వీడియోలో కనిపిస్తున్నా అరెస్టుల విషయంలో తాత్సారం చేసి... పట్టాభిని మాత్రం తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేసిన పోలీసులను ఏమనాలి? అధికార పార్టీ వారు నోరు జారితే ఆవేదనతో అన్నారని, భావప్రకటనా స్వేచ్ఛ అని సమర్థించుకుంటున్న పోలీసులను చీదరించుకోకుండా ఉండగలమా? అధికార పార్టీ వాళ్లకు మాత్రమే రక్షణ కల్పించడానికి, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోకుండా ఉండిపోవడానికి పోలీసులకు వైసీపీ కార్యాలయం నుంచి జీతాలు చెల్లిస్తున్నారా? రూల్‌ ఆఫ్‌ లా పాటించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? డీజీపీ  గౌతం సవాంగ్‌ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? సమాధానం లేని పక్షంలో ఆయన ఆ పదవిలో కొనసాగడానికి అర్హత కోల్పోయినట్టే. అధికార పార్టీ నాయకులకు గులాంగిరీ చేయడానికి అలవాటు పడిపోవడంతో పోలీసులంటే వైసీపీ నాయకులకు కనీస గౌరవం లేకుండా పోయింది. అందుకే కుప్పంలో వైసీపీ నేత ఒక సీఐపై చేయి చేసుకున్నాడు. రక్తపోటు పెంచుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడటంతో తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతున్నారు. చంద్రబాబు దీక్ష సందర్భంగా ప్రసంగించిన పలువురు నాయకులు తాము అధికారంలోకి రాగానే ఇంతకు పదిరెట్లు చెల్లిస్తామని అన్నారు. దీన్ని బట్టి ఇప్పుడు వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాల ఫలితంగా భవిష్యత్తులో మొత్తం రాష్ట్రం ఫ్యాక్షన్‌ జోన్‌గా మారబోతోందన్నమాట! అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఏం కావాలి? రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఒకప్పుడు పరిమితమైన ఫ్యాక్షనిజం లక్షణాలు ఇప్పుడు అన్ని ప్రాంతాల వారిలోనూ వ్యాపిస్తున్నాయి. ‘తోటకూర దొంగిలించిననాడే’... అన్నట్టుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి వయసు, అనుభవాన్ని కూడా గౌరవించకుండా తన మంత్రులు, శాసనసభ్యులు దుర్భాషలాడినప్పుడే జగన్‌రెడ్డి మందలించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా! ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి రాష్ర్టాన్ని ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు. పట్టాభి మాత్రమే మొదటగా అలాంటి పదాన్ని ఉపయోగించి ఉంటే తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఆత్మరక్షణలో పడి ఉండేది. ప్రజలు కూడా ఆ పార్టీని ఛీత్కరించుకుని ఉండేవారు. అయితే... వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు నోరు తెరిస్తే బూతులే ప్రవహిస్తున్నందున ఇప్పుడు అధికార పార్టీ తీరును ప్రజలు హర్షించడం లేదు. దాడి చేసిన వాళ్లే జనాగ్రహ దీక్షలంటూ రోడ్డుకెక్కడం ఎబ్బెట్టుగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దొంగే ‘దొంగదొంగ’ అని అరచినట్లుగా వైసీపీ తీరు ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారందరినీ భయపెట్టి, కేసులు పెట్టించి లొంగదీసుకోవాలని అనుకోవడం వెర్రితనమే అవుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాలను పోలీసుల సహకారంతో ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందినవారు తమకు లొంగిపోవడానికి అంగీకరించని ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ వంటి మీడియా సంస్థలపై కూడా దాడులు చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయాలపై దాడి చేస్తే తమకు అత్యంత ఆప్తుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారం ఉంటుందని కూడా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎంత నాశనమైతే తెలంగాణ అంత బాగుపడుతుందని నమ్ముతున్న కేసీఆర్‌ అండ్‌ కో జగన్‌రెడ్డి దీర్ఘకాలం అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశంపై ఎవరు దాడులు చేశారో తెలియదుగానీ, ముఖ్యమంత్రిని బూతులు తిట్టడం ఏమిటని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తన సన్నిహితుడు జగన్‌ రెడ్డిని వెనుకేసుకొచ్చారు. బోసడికే పదం పట్ల కేటీఆర్‌కు అభ్యంతరం ఉండడం సహజం. కానీ, తమ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇటీవలే బోసడికే అని తిట్టినప్పుడు ఎందుకు స్పందించలేదంటారూ?!


అద్భుత హావభావాలు

‘ఈ రాజకీయ నాయకులు ఉన్నారే... వాళ్ల నటన ముందు మా నటన ఏ పాటిది?’ అని విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా పేరొందిన ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి తనను బోసడికె అని తిట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి ఒక కార్యక్రమంలో ప్రదర్శించిన హావభావాలు చూసిన తర్వాత ఎన్టీఆర్‌ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. జగన్‌రెడ్డి నటనకు ముగ్ధులు అయినవారు ఆయనను ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ చేయాలని భావించారు. ముఖ్యమంత్రిని పట్టుకొని ‘లం.... కొడకా అని తిడతావా?’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం వరకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. తనను తిట్టినందుకు తన అభిమానులకు రక్తపోటు పెరిగి పట్టాభి ఇంటిపైన, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపైనా దాడి చేశారని ఆయన సమర్థించుకోవడం మాత్రం రోతగా ఉంది. ఎవరికైనా బీపీ పెరిగితే మందులు వేసుకుంటారు గానీ ఇలా పరుల ఆస్తులను ధ్వంసం చేస్తారా? రాష్ట్రంలో వైసీపీ వాళ్లకు మాత్రమే రక్తపోటు ఎందుకు పెరుగుతున్నదో తెలుసుకుని చికిత్స అందించని పక్షంలో జగన్‌రెడ్డికి నిజంగానే రక్తపోటు వస్తుంది. ‘నేను ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని’ అని పదే పదే గుర్తుచేసుకునే జగన్‌రెడ్డికి... ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి హింస, దౌర్జన్యాలను ప్రోత్సహించకూడదు అని తెలియదా? జగన్‌ చెబుతున్న దాన్నిబట్టి ఇకపై ఎవరు ఏ నేరం చేసినా ఫలానా కారణంగా నాకు రక్తపోటు పెరిగి నేరం చేశానని చెప్పి తప్పించుకోవచ్చు కదా! నేరాలకు పాల్పడిన వారిని, హత్యలు చేసిన వారిని రక్తపోటు పెరిగిన కారణంగానే ఆ నేరాలు చేసి ఉంటారని పోలీసులు కూడా కేసులు పెట్టరేమో! ఆంధ్రాలో అంతేలే అని భావించాలేమో! రాష్ర్టాలకు గవర్నర్లు మాత్రమే రాజ్యాంగ అధిపతులుగా ఉంటారని, ముఖ్యమంత్రులు కాదనే విషయం కూడా తెలియకుండా తనను రాజ్యాంగ అధిపతిగా జగన్‌ రెడ్డి చెప్పుకోవడం వింతగా ఉంది. రాష్ట్రంలో మద్యం ధరలు అడ్డగోలుగా పెంచి నాసిరకం మద్యాన్ని అంటగడుతున్నారని మందుబాబులకు రక్తపోటు పెరిగి ప్రభుత్వ అధికారులు, ఆస్తులపై దాడులు చేస్తే ముఖ్యమంత్రి ఇలాగే సమర్థించుకుంటారా? గడచిన నాలుగు రోజులుగా జరిగిన పరిణామాలను,  మంత్రులు, శాసనసభ్యుల నోటికి హద్దులేకుండా బూతులు తిట్టడాన్ని చూస్తున్న, వింటున్న ప్రజలకు కూడా రక్తపోటు పెరుగుతోంది. అయితే, వారు గత ఎన్నికల్లో చేసిన తప్పునకు పశ్చాత్తాప  పడుతున్నారు గానీ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడకపోవడం రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ఏకకాలంలో తన ముఖంలో నవరసాలను పలికించగలిగిన జగన్‌ రెడ్డి చేయాల్సిందంతా చేసి సానుభూతి కోసం ఇప్పుడు పాకులాడటం ఆశ్చర్యంగా ఉంది. తనని లం..కొడకా అని తిట్టడం ద్వారా తన తల్లిని అవమానించారని ఆయన చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లకు ఇప్పుడు ఆయనకు తల్లి విజయమ్మ గుర్తుకొచ్చింది. ఎన్నికలకు ముందు ఉపయోగపడిన ఆమె అవసరం మళ్లీ ఏర్పడినట్టుంది. ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిననాడు మాత్రమే వేదికపై కనిపించిన విజయమ్మ ఈ రెండున్నరేళ్లలో ఒక్కసారైనా అధికారిక ఉత్సవాలలో కనిపించారా? లేదే! ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి వచ్చే ప్రముఖులకు భార్య భారతి రెడ్డితో కలసి స్వాగతం చెప్పి అతిథి మర్యాదలు చేసే జగన్‌ రెడ్డి ఒక్కనాడైనా తన తల్లిని అక్కడ సదరు అతిథులకు పరిచయం చేశారా? చెల్లి షర్మిల గురించి చెప్పాలంటే చాలా ఉంది. తనకోసం కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన ఆమెకు కనీసం రాజ్యసభ సీటు ఇవ్వడానికి కూడా జగన్‌రెడ్డికి మనసొప్పలేదే! వంచన గురించి మాట్లాడే జగన్‌రెడ్డి దీన్ని ఏమంటారో చెబితే వినాలని ఉంది. తమను నిరాదరిస్తున్నప్పటికీ విజయమ్మకు గానీ, షర్మిలకు గానీ రక్తపోటు పెరగలేదు. తండ్రిని దారుణంగా గొడ్డలితో నరికి చంపిన దోషులను పట్టుకునే విషయంలో నిరాసక్తి ప్రదర్శిస్తున్న సోదరుడు జగన్‌ను చూసి డాక్టర్‌ సునీతకు రక్తపోటు పెరగలేదే? రాష్ట్రంలో మరెవరికీ పెరగని రక్తపోటు కేవలం జగన్‌ను అభిమానించే వారికి మాత్రమే పెరుగుతోందంటే వారికి సీరియస్‌ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టే. ఈ రోగానికి తగిన చికిత్స చేయగలిగింది ప్రజలు మాత్రమే. సరైన సమయంలో వైసీపీకి చికిత్స చేయడానికి ప్రజలు సిద్థపడుతున్నట్టుగా కనిపిస్తోంది. నిన్నటి వరకు గుడ్డిగా జగన్‌రెడ్డిని సమర్థిస్తూ వచ్చిన వారు కూడా ఇప్పుడు సైడవుతున్నారు. ముఖ్యమంత్రి అభిమానులకు రక్తపోటు పెరిగితే వారే బాధపడాలి గానీ రాష్ట్రం ఇబ్బందులపాలు కాకూడదు. జరిగిన విధ్వంసాన్ని గొప్పగా సమర్థించుకున్నానని ముఖ్యమంత్రి భావిస్తుండవచ్చు కానీ సామాజిక మాధ్యమాలలో ఆయనను ఆడుకుంటున్నారు.


రాష్ట్రమేగతి బాగుపడునోయ్‌?

జగన్‌రెడ్డి, చంద్రబాబు వంటి వారు వస్తుంటారు, పక్కకు పోతుంటారు. రాష్ట్రం శాశ్వతం. దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి లోకంలో తాము ఉన్నామని ప్రజలు భావించే పరిస్థితి రాకూడదు. ప్రస్తుత దుస్థితికి కారకులైన ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు అండ్‌ కోను మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిట్టడం వినీవినీ అలవాటు పడిపోయిన ప్రజలు పట్టాభి వంటి వారి నోటినుంచి రాకూడని మాట విని కించిత్‌ ఆశ్చర్యపోయారు. అర్థం తెలియకుండా ఆ పదాన్ని వాడాననీ, సినిమాలలో కూడా వాడినందున తప్పు కాదనుకున్నాననీ పట్టాభి పార్టీ నాయకులకు వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా బూతుల సంస్కృతికి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వైసీపీ దూరంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా, వినియోగం పెరిగిపోవడం ఈ మొత్తం పరిణామాలకు మూలకారణం. రాష్ట్రంలో గంజాయిని విచ్చలవిడిగా సాగుచేస్తూ యథేచ్ఛగా ఇతర రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ఆ అంశాన్ని పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌లోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోతోందన్న విషయం తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించి కఠిన చర్యలకు ఆదేశించారు. గంజాయి సాగు చేస్తే భూమి పట్టాలు రద్దు చేస్తామని కూడా ప్రకటించారు. జగన్‌రెడ్డి ఇలాంటి చర్యలకు పూనుకోకుండా దాడులు, దౌర్జన్యాలను సమర్థించడం శోచనీయం. ప్రభుత్వ ఆస్తులను కూడా కుదవపెట్టి అప్పులు చేసి పంచిపెట్టడం వల్ల ప్రజలు తాత్కాలికంగా సంతోషపడవచ్చును గానీ, అలాంటి నాయకుడిని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుని పూజించరు. రాజశేఖర రెడ్డి ఇలా పంచిపెట్టకపోయినా ప్రజలు ఆయనను గుర్తు పెట్టుకున్నారుగా! సైబరాబాద్‌ పురోగతి చూస్తున్న వాళ్లందరూ చంద్రబాబును గుర్తుచేసుకోవడం లేదా? జగన్‌ అండ్‌ కోకు ఈ ఇంగితం కొరవడినందునే రాష్ర్టానికి ప్రస్తుత దుస్థితి. హంసలా ఉండటమా లేదా అన్నది జగన్‌ రెడ్డి తేల్చుకోవాలి!

ఆర్కే

ఏపీ బీపీ... బూతు రోత!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.