Abn logo
Aug 11 2020 @ 01:14AM

జాతి ఆత్మబంధువు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జనాదరణ రోజురోజుకు ఎందుకు పెరుగుతోంది? ఆయన ఈ దేశ అస్తిత్వాన్ని నిలబెట్టడమే అందుకు ప్రధాన కారణం. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక భారత దేశ అస్తిత్వ పరిరక్షణ ధ్యేయమే కనపడుతుంది. సరిహద్దుల్లోనైనా, దేశంలోనైనా జాతి ఆత్మగౌరవాన్నీ, అస్తిత్వాన్నీ, స్వావలంబనను కాపాడి తమ సమస్యలను నిజంగా అర్థం చేసుకుని పరిష్కరించగలిగిన నరేంద్రమోదీ తమకు నాయకుడుగా ఉన్నందుకు ఈ దేశ ప్రజలు గర్విస్తున్నారని ఇవాళ ఎవర్ని కదిలించినా అర్థమవుతుంది.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతున్నదే కాని తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనపడడం లేదు. నిజానికి అధికారంలో ఉన్న వారు తమ ప్రతిష్ఠను, జనాదరణను నిలుపుకోవడం అంత సులభం కాదు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడడానికి అనేక కారణాలుంటాయి. మోదీ సర్కార్ మాత్రం అలాంటి పరిస్థితిని ఏ మాత్రం ఎదుర్కోవడం లేదు. అత్యంత తీవ్ర సంక్షోభ సమయంలో కూడా ఆయన తన ఆదరణ చెక్కుచెదరకుండా కాపాడుకోగలగుతున్నారు. కరోనా మూలంగా దాదాపు రెండు నెలల పాటు దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. దాని పర్యవసానాలు మనలను ఇంకా చికాకు పరుస్తూనే వున్నాయి. కరోనా మూలంగా జీవితాలు దెబ్బతిన్న కోట్లాది పేద, గ్రామీణ ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం నెలకొనడం, పెట్టుబడుల ప్రవాహానికి, ఎగుమతులకు అంతరాయం కలగడం మూలంగా ఎలా మన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలా తేల్చుకోలేకపోయాం. పులిమీద పుట్రలాగా ఒకవైపు పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే లద్దాఖ్లో చైనా దురాక్రమణ, మన సైనికులు 20 మందిని బలికావడంతో దిగ్భ్రాంతి చెందాల్సి వచ్చింది.


ఇటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో మరే ప్రధానమంత్రి అధికారంలో ఉన్నా ఆయన చేతులెత్తేయడమే కాకుండా దేశ ప్రజలంతా ధైర్యం కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది. మన అదృష్టం ఏమిటంటే ఈ సంక్షుభిత సమయంలో మోదీ వంటి బలమైన నాయకుడు మనకు ప్రధాన మంత్రిగా ఉండడం. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన ఏ మాత్రం చెక్కుచెదరకుండా అవసరమైనప్పుడల్లా ప్రజల ముందుకు వచ్చి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రులను విశ్వాసంలోకి తీసుకుని వారికి ఆత్మవిశ్వాసం అందించారు. అదే సమయంలో దేశానికి ఏది అవసరమో అటువంటి చర్యలన్నీ తీసుకున్నారు. ఆర్థిక, సామాజిక వ్యవస్థల్ని ఒక దారిన పెట్టే ప్రయత్నం చేశారు. అందుకే ప్రజలు ఈ ఆపత్కర పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం దిగాలు పడలేదు. ధైర్యం కోల్పోలేదు. అందుకు ప్రధాన కారణం ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఉండడమే. తెల్లటి దుస్తుల్లో మెడలో కండువా వేసుకుని, తెల్లటి గడ్డంతో ఒక సాధువులా, యోగిలా కనపడే నరేంద్రమోదీ గంభీరమైన వాక్కులు వింటేనే మనకు ఎక్కడ లేని ధైర్యం కలుగుతోంది. ఆయన ఉన్నాడు అన్న భరోసా మనకు కలుగుతోంది. ఈ విషయం ‘ఇండియా టుడే’ నిర్వహించిన తాజా సర్వేలో ప్రస్ఫుటమైంది. ఈ సంస్థ కొన్ని సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు దేశ ప్రజల మనోభావాలను కనుగొనేందుకు సర్వేలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ మన దేశానికి ఇంతటి ఉత్తమమైన ప్రధానమంత్రి ఎవరూ లేరు.. అని దేశంలో 44 శాతం మంది ప్రజలు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా మనకు మోదీ కంటే ఉత్తమ నేత ఎవరూ లేరు.. అని 66 శాతం మంది ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడు కావాలని కేవలం 8 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. మోదీ ప్రభుత్వ పనితీరు అత్యద్భుతంగా ఉన్నదని దేశంలో 78 శాతం మంది భావిస్తుండగా, 17 శాతం మంది మాత్రమే ఈ ప్రభుత్వ పాలన సగటుగా ఉన్నదని భావిస్తున్నారు. పాలన అంత బాగులేదన్న వారు 5 శాతం మాత్రమే ఉన్నారు.


‘ఇండియా టుడే’ 2017లో జరిపిన సర్వేతో పోలిస్తే మోదీ జనాదరణ మరింత పెరిగిందే కాని తగ్గలేదని అర్థమవుతోంది. ఎందుకు మోదీ జనాదరణ పెరుగుతోందని విశ్లేషిస్తే, అందుకు అనేక కారణాలు మనకు కనపడతాయి. ఈ కారణాలన్నిటిలోనూ అంతర్లీనంగా కనపడే ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశ అస్తిత్వాన్ని నిలబెట్టడం. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో భారత దేశ అస్తిత్వం కనపడుతుంది. దేశ ప్రజలంతా గర్వంగా తలెత్తుకు జీవిస్తున్నారన్న ఆలోచన కలుగుతుంది. కశ్మీర్లో 370 అధికరణను రద్దు చేసి అది ఈ దేశంలో అంతర్భాగమని మోదీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఒకానొక ఉదయం ప్రకటిస్తే ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోయి సభ మధ్యలోకి దూసుకువచ్చి సభా కార్యక్రమాలకు భంగం కలిగించారు. కానీ ఈ దేశంలో ప్రజలు వీధుల్లో మతాబాలు వెలిగించి పండగ చేసుకున్నారు. ఇన్నాళ్లకు కశ్మీర్ మనదనే అభిప్రాయాన్ని ఖండితంగా ప్రకటించడమే కాదు, ఆచరణలో రుజువు చేసిన మోదీ అసలు సిసలైన నేతగా వారు భావించారు.


మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి గొప్ప నిర్ణయంగా వారు సర్వేలో చెప్పారు. ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజలో నరేంద్రమోదీ పాల్గొనడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే కోట్లాది ప్రజలు ఇంటింటా తమ ఆరాధ్య దైవానికి మంగళ హారతులు సమర్పించారు. అందుకే కశ్మీర్ తర్వాత రామమందిరంపై సుప్రీం తీర్పు అత్యంత కీలకమైన నిర్ణయంగా ప్రజలు తీర్మానించారు. కశ్మీర్, అయోధ్య మన అస్తిత్వాన్ని నిలబెట్టేందుకు తీసుకున్న చర్యలైతే, మరో వైపు ఈ దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు మోదీ తీసుకున్న కీలక నిర్ణయాలను ముఖ్యంగా ఆత్మనిర్భరత పేరుతో ప్రకటించిన చర్యలను మన స్వావలంబనను పెంపొందించేవిగా ప్రజలు భావిస్తున్నారని చెప్పక తప్పదు. దేశంలో మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి స్వయం సమృద్ధ భారత్ నిర్మాణానికి మోదీ తీసుకుంటున్న అనేక నిర్మాణాత్మక చర్యలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ‘ఇండియా టుడే’ సర్వేలో 77 శాతం మంది కరోనా ను అరికట్టడంలో అద్భుతంగా, సమర్థంగా వ్యవహరించారని చెప్పారు. ఈ దేశ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ పై తమకు విశ్వాసం ఉన్నదని 77 శాతం మంది చెప్పారు.


కరోనా కల్పించిన విపత్కర పరిస్థితులనుంచి మనం క్రమంగా కోలుకుంటున్న సమయంలోనే చైనా మరో సారి మన భూభాగాలను దురాక్రమించింది. ఈ పొరుగు దేశం దుర్మార్గం పట్ల దేశం యావత్తూ మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుక బాసటగా నిలిచింది. చైనా దురాక్రమణను ఖండించక పోవడంతో పాటు, మన సైనికుల త్యాగాలను గౌరవించని ప్రతిపక్షాలు తెంపరితనంతో ప్రధానమంత్రిని విమర్శించిన తీరును ప్రజలు హర్షించలేదని విస్పష్టమవుతోంది. చైనా దురాక్రమణను భారత్ ధైర్యంగా ఎదుర్కొని తిప్పిగొట్టగలదని ‘ఇండియా టుడే’ సర్వేలో 72 శాతం మంది ప్రజలు భావిస్తున్నారంటే మోదీ నాయకత్వం పట్ల వారికెంత విశ్వాసముందో అర్థమవుతుంది. చైనా కు మనం గట్టి గుణపాఠం చెప్పగలిగామని 69 శాతం మంది భావిస్తున్నారు. ప్రధానిని విమర్శిస్తూ రాహుల్ చేసిన అర్థం పర్థం లేని వ్యాఖ్యల్ని ప్రజలు హర్షించలేదని చైనా దురాక్రమణ తర్వాత జరిగిన ఈ సర్వేలో ఆయన రేటింగ్ పడిపోవడంతోనే అర్థమవుతోంది.


లాక్డౌన్ విధించిన రెండు రోజుల్లోనే గరీబ్ కల్యాణ్ యోజన పేరుతో ప్రజలను ఆదుకునేందుకు రంగంలోకి దిగిన మోదీ ప్రభుత్వం ఆ తర్వాత వరుసగా రకరకాల పథకాలు ప్రకటించి, వాటి అమలుకు వేల కోట్లను క్రమంగా విడుదల చేస్తూ వచ్చింది. పిఎం-కిసాన్ పథకం క్రింద తాజాగా విడుదల చేసిన ఆరవ వాయిదాతో ఇప్పటి వరకు రైతులకే రూ.90 వేల కోట్లు విడుదల చేసింది. వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆదివారంనాడు విడుదల చేసిన లక్ష కోట్ల నిధితో గ్రామీణరంగం రూపురేఖలు మారతాయనడంతో సందేహం లేదు. సరిహద్దుల్లోనైనా, దేశంలోనైనా జాతి ఆత్మగౌరవాన్నీ, అస్తిత్వాన్నీ, స్వావలంబనను కాపాడి తమ సమస్యలను నిజంగా అర్థం చేసుకుని పరిష్కరించగలిగిన నరేంద్రమోదీ తమకు నాయకుడుగా ఉన్నందుకు ప్రజలు గర్విస్తున్నారని ఇవాళ ఎవర్ని కదిలించినా అర్థమవుతుంది.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Advertisement
Advertisement
Advertisement