Advertisement
Advertisement
Abn logo
Advertisement

మత ప్రాతిపదికన జాతి నిర్మాణం అసాధ్యం

జాతీయోద్యమ భావ వ్యాప్తికి ఉన్నవ ‘మాలపల్లి’లోనే అంకురార్పణ చేశారు

శత జయంతి సభలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కే శ్రీనివాస్‌


గుంటూరు(విద్య), డిసెంబరు 5: ‘‘మత ప్రాతిపదికన నేటి నేతలు జాతి నిర్మాణం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అసహనాన్ని దేశంలో ప్రవహించేలా చేస్తున్నారు. కానీ జాతీయ భావం ద్వారానే సామాజంలో అంతరాలు తొలిగిపోతాయి. దీనిని గట్టిగా విశ్వశించిన ఉన్నవ లక్ష్మీనారాయణ తన మాలపల్లి నవల ద్వారా జాతీయోద్యమ భావాలను ప్రజల్లో రగిలించడానికి అంకురార్పణ చేశారు. జాతిని ఒక్కటి చేయడంలో ఆయన గాంధీజీ కంటే సీనియర్‌’’ అని ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్‌ అన్నారు. సాహిత్య అకాడమీ, అమరావతి సామాజిక అధ్యయన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా మాలపల్లి నవల శత జయంతి సదస్సు జరిగింది. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు కే శివారెడ్డి అధ్యక్షత వహించిన ఆ సదస్సులో ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్‌ కీలకోపన్యాసం చేశారు. ‘‘దళితుల జీవితాలను ప్రతిఫలింపచేస్తూ, వ్యవహారిక భాషలో వచ్చిన తొలి నవల మాలపల్లి. ఇది విమర్శకుల నుంచి ప్రశంసలను మాత్రమే కాదు... వ్యతిరేకతనూ ఎదుర్కొంది. విమర్శలు ఎన్ని ఎదురైనా ఉన్నవ ఏనాడూ దళితులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎత్తిచూపడంలో వెనక్కి తగ్గలేదు. ప్రజల్లో నెలకొన్న అంతరాలు తొలగించి, జాతీయభావం పెంచడానికి నాటి నేతలు ఎంతో కృషి చేశారు. ఆయన 1907లో పంచమోద్యమం పేరుతో అట్టడుగు వర్గాలపై జరిగే వివక్ష ఎత్తి చూపారు. తరువాత 1917లో పంచమాంధ్ర మహాసభ నిర్వహించారు. ఈ సభల్లోని కీలక వ్యక్తులనే తన నవల ద్వారా ఉన్నవ పరిచయం చేశారు. తరువాత కాలంలో గాంధీజీ బాటలో నడిచి దళితుల అభ్యున్నతికి మరింత కృషి చేశారు. ఆయన కులాలను వ్యతిరేకించాడనే కంటే, కులం ఆధారంగా ఏర్పడిన వివక్షను వ్యతిరేకించార’’ అని చెప్పారు. ఉన్నవ, హిందూ మత పరిధిలోనే ఆలోచించినా కుల భేదాలను పరిష్కరించేలా కృషి చేశారని అన్నారు. ఉన్నవ మతాంతరీకరణను వ్యతిరేకించారని చెప్పారు. ఆయన రచనలు ఎన్నో ఇంకా మరుగునపడే ఉన్నాయనీ, వాటికి ప్రాచుర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అమరావతి సామాజిక అధ్యయన సంస్థ వ్యవస్థాపకులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌... ‘‘మహాప్రస్థానం, గబ్బిలం, మాలపల్లి... మూడింటినీ కలిపి ఒక పుస్తకం తయారు చేస్తే అది భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అవుతుంది’’ అని అన్నారు. వందేళ్ల నాటి మాలపల్లి నవల నేటి సామాజిక పరిస్థితులను ప్రతిపాదించడం ఆశ్చర్యం కలిగిస్తోందని సాహిత్య అకాడమి సంచాలకులు కే శివారెడ్డి అన్నారు. సాహిత్య అకాడమి కార్యదర్శి కే.శ్రీనివాసరావు... కథలు, నాటకాలు, నవలల ద్వారా ఉన్నవ లక్షల మందిని ప్రభావితం చేశారని అన్నారు. మాలపల్లి నవల ద్వారా గ్రామీణ జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లు ఉన్నవ లక్ష్మీనారాయణ వివరించారని గోరటి వెంకన్న కొనియాడారు.

Advertisement
Advertisement