‘డర్టీ పిక్చర్‌’పై రచ్చ రచ్చ

ABN , First Publish Date - 2022-08-06T07:55:04+05:30 IST

‘డర్టీ పిక్చర్‌’పై రచ్చ రచ్చ

‘డర్టీ పిక్చర్‌’పై రచ్చ రచ్చ

ట్రెండింగ్‌లో గోరంట్ల ఎపిసోడ్‌

ట్విట్టర్‌లో టాప్‌-3కి మాధవ్‌ వీడియో

ఇన్‌స్టాలో టాప్‌ 20లో ట్రెండ్‌

సోషల్‌ మీడియాలో హోరు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో జాతీయ  స్థాయిలో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆయన వీడియో వైరల్‌గా మారింది. ‘వైసీపీ ఎంపీ డర్టీ పిక్చర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వీడియో షేర్‌ అవుతోంది. విచిత్రమేమిటంటే... దేశంలో ప్రధానమైన, కీలకమైన అంశాలను దాటేసి అది ట్రెండింగ్‌లో నిలిచింది. ట్విట్టర్‌ డేటాసైన్స్‌ లెక్కల ప్రకారం... ‘వైసీపీ ఎంపీ డర్టీపిక్చర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ శుక్రవారం మధ్యాహ్నం వరకు టాప్‌-3లో నిలిచింది. ట్విట్టర్‌లో టాప్‌-1గా కాంగ్రెస్‌ పార్టీ జీఎ్‌సటీ వ్యతిరేక ఆందోళన నిలిచింది. బీజేపీ రామమందిర  అంశం నంబర్‌ 2లో ఉండగా, వైసీపీ ఎంపీ డర్టీ పిక్చర్‌ టాప్‌ 3లో నిలిచింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే... టాప్‌ 1, 2లు రాజకీయ రంగానికి సంబంధించినవి. ఇవి ఆ రంగంలో ట్రెండింగ్‌లో టాప్‌లో ఉన్నాయి. కానీ.. ‘ట్రెండింగ్‌ ఇన్‌ ఇండియా కేటగిరీ’లో మొదటి స్థానం ‘డర్టీ పిక్చర్‌’దే! దాదాపు 28 వేల మంది హ్యాష్‌ట్యాగ్‌ను రీ ట్వీట్‌చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వైసీపీ ఎంపీపై అనర్హత వేటు వేయాలని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ వీడియోను ట్యాగ్‌ చేసిన కొన్ని సామాజిక సంస్థలు, ప్రజాసంఘాలు ఎంపీ తీరుపై తిట్టిపోశాయి. మహిళలకు ఎలా గౌరవం ఇవ్వాలో లోక్‌సభలో గొప్పగా స్పీచ్‌లిచ్చిన వ్యక్తి ఓ మహిళకు వీడియోకాల్‌చేసి అసభ్యంగా ప్రవర్తించడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని పలువురు మండిపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంటరీ ప్రివిలేజ్‌ కమిటీ సుమోటోగా స్వీకరించాలని మరి కొందరు కోరారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్‌ దేశం ‘ఆజాదీకా అమృతోత్సవ్‌’ జరిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో బయటపడిన ఈ ‘నగ్న’ వ్యవహారం వ్యవస్థకు ఒక మచ్చలా మారిందని, ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల నేతలు ట్వీట్‌లు చేశారు. లోక్‌సభలో గతంలోఎంపీ మాధవ్‌ మహిళల గౌరవం గురించి చేసిన ప్రసంగం వీడియోను జతచేసి... ‘న్యూడ్‌ వీడియో చేసింది ఇతనేనా? ఇదేం చెత్తపని’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం తర్వాత ‘వైసీపీ ఎంపీ డర్టీ పిక్చర్‌’ ట్విట్టర్‌లో టాప్‌ 10లోకి వచ్చింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇదే హ్యాష్‌ట్యాగ్‌ హోరెత్తించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హ్యాష్‌ట్యాగ్‌ టాప్‌-20లో నిలిచింది. ఈ అంశంపై 37 వేల మందికిపైగా స్పందించారు. తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈమోజీలు పెట్టారు. ‘ఇంకా ఈయనపై చర్యలు తీసుకోలేదా?’ అని ప్రశ్నించారు.

Updated Date - 2022-08-06T07:55:04+05:30 IST