‘రచ్చ’బండ!

ABN , First Publish Date - 2022-01-17T05:30:00+05:30 IST

‘రచ్చ’బండ!

‘రచ్చ’బండ!

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న పెద్దల పంచాయితీలు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న కొందరు 

కొన్నిసార్లు శ్రుతిమించుతున్న తీర్పులు 

ఏకపక్ష నిర్ణయాలకు బలవుతున్న అమాయకులు

వనమా రాఘవ ఘటన ఈ కోవకు చెందిందే

చట్టాలపై అవగాహనలేమే అసలు కారణమా?

ప్రస్తుతం రెవెన్యూ డివిజన్‌గా మారిన ఓ మండలంలో ఓ యువకుడి కామవాంఛకు మాసనికస్థితి బాగాలేని ఓ బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డను పెళ్లి చేసుకోవాలని బతిమిలాడారు. ఈ క్రమంలో ఇరు వర్గాలను పిలిపించిన పెద్దమనుషులు పంచాయితీ చేసి సదరు బాధితురాలికి సదరు యువకుడు జరిమానాగా రూ.40వేలు చెల్లించేలా తీర్పు చెప్పారు. ఆ తర్వాత ఆ బాలికకు అబార్షన్‌ చేయించబోగా.. అది వికటించి ఆమె మృతి చెందింది. 

మరో ఘటనలో యువతిని వేధిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకునే క్రమంలో పెద్ద మనుషులు పంచాయితీ చేసి.. యువకుడిపై ఎలాంటి కేసు పెట్టకుండా ఉండేలా ఒప్పందం చేశారు. కానీ సదరు యువకుడు వేధింపులు ఆపకపోగా.. మరింత ఎక్కువ చేయడంతో.. ఆ యువతి చివరికి ఆత్మహత్య చేసుకుంది. 

మధిర నియోజకవర్గానికి చెందిన పదో తరగతి వరకు చదివి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఓ యువకుడు, అదే గ్రామానికి చెందిన మరో యువతి ప్రేమించుకుని కుటుంబసభ్యులు ఒప్పుకోరని పోలీసులను ఆశ్రయించారు. కానీ తెలివిగా ఆలోచించిన యువతి తల్లిదండ్రులు తమ ఇంట్లో బంగారం పోయిందంటూ సదరు యువకుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ గొడవ కాస్త కులపెద్దల దృష్టికి వెళ్లింది. ఇరువర్గాలను పిలిచి పంచాయితీ చేసిన కులపెద్దలు అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పగా దానికి యువతి అంగీకరించకపోవడంతో యువకుడి కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్థులు ఎవరైనా వారితో మాట్లాడితే రూ. 10వేలు జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. 

ఖమ్మం నగరంలో నివాసం ఉండే ఓ కుటుంబంలో పనిచేస్తూ అక్కడే ఉంటున్న ఓ బాలికపై సదరు ఇంటి యజమాని కుమారుడు లైంగికదాడికి దిగగా దాన్ని సదరు బాలిక ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు బాలికపై పెట్రోల్‌ పోసి నిప్పటించడంతో ప్రాణపాయ స్థితికి వెళ్లింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకుగాను బాలిక కుటుంబసభ్యులకు కొంత నగదు అప్పగించేలా పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించారు. కాలిన గాయాలతో ఆ బాలిక చికిత్స పొందుతున్న క్రమంలో విషయం వెలుగులోకి రావడంతో అప్పుడు పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించారు. 

నేలకొండపల్లి మండలంలో ఓ కుటుంబంలో తోటికోడళ్ల మధ్య వివాదం కాస్తా పెద్ద మనుషుల వద్దకు చేరగా పంచాయితీలోనే మాటమాట పెరిగి ఒకరి కుటుంబంపై మరొకరు దాడి దాడి చేసుకోవడంతో కుటుంబంలోని ఓ వ్యక్తి మరణించాడు. 

ఖమ్మంజిల్లా కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ మండలంలోని చిన్న గ్రామం అది. అక్కడ నుంచి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే కేసులను వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. అంటే అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తవని కాదు. వారి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌ మెట్లేక్కెవారు చాలా అరుదు అని. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అయినా వారి పెద్ద మనుషుల మధ్య కూర్చోని పరిష్కరించుకోవాల్సిందే మరి. 

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే... బయటకు రాని ఇలాంటి సంఘటనలెన్నో. సాంకేతికంగా ఎంతోఅభివృద్ధి చెందినా.. చాలా గ్రామాల్లో రచ్చబండలు నిర్వహించడం, కులపెద్దల పంచాయితీలు చేయడం.. జరిమానాలు విధించడం, కుల, గ్రామ బహిష్కరణలు చేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చాలా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కొందరు పెద్దలు తమ ఉనికి కోసం, తమ రాజకీయ, పలుకుబడి స్వార్థం కోసం చేస్తున్న పంచాయితీలు కుటుంబాల మధ్య ‘రచ్చ’ చేస్తున్నాయన్న విషయాన్ని గుర్తించకపోగా.. తమదే పైచేయి అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఖమ్మం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఏదైనా సమస్య వస్తే పోలీస్‌ స్టేషన్‌కంటే ముందే ఆ సమస్య పెద్ద మనుషుల వద్దకు చేరిపోతుంది. వారి వద్దకు చేరిన తర్వాత రెండు వర్గాలను పిలిచి పంచాయితీలు చేయడం ఉమ్మడి జిల్లాలో పరిపాటిగా మారింది. అలాంటి సందర్భాల్లో పెద్ద మనుషుల తీర్పులు మంచిగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు కాని అవి శృతిమించితే.. పెద్ద మనుషుల మాట లెక్కచేయకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. కొందరు పెద్ద మనుషులు ఇచ్చే తీర్పులు సైతం తమకు లబ్ది చేకూరేలా, పలుకుబడి ఉన్నవారివైపు ఏకపక్షమైన నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. కొందరు పెద్దలైతే పంచాయితీల్లో తమ స్వలాభం కూడా చూసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వనమా రాఘవ చేసిన పంచాయితీ ఏకంగా ఓ కుటుంబాన్నే బలితీసుకుంది. 

పెరుగుతున్న పెద్దల పంచాయితీలు.. 

ఆస్తులపంపకాలు, ప్రేమ వివాహాలు, విడాకులు, వరకట్న సమస్యలు.. ఇలా వివాదాలు ఏవైనా వస్తే చాలు స్టేషన్‌ మెట్లెక్కుతున్న రోజులివీ. కానీ స్టేషన్‌ మెట్లు ఎక్కినా ఇరువురికి రాజీ కుదిర్చే ప్రయత్నంలో భాగంగా మళ్లీ పెద్దమనుషులను ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో చాలా వివాదాలు పెద్ద మనుషుల మధ్యే పరిష్కారమవుతున్నాయి. రోజువారీ కూలీ పనులకు వెళ్లేవారు, పేదలు, సాధారణ, మధ్య తరగతి ప్రజలు సమస్యలపై పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందన్న భయంతో పెద్ద మనుషులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని ఘటనల్లో సామరస్యపూర్వకంగా వివాదాలు పరిష్కరించుకోవాలన్న భావనతో పోలీసులే గ్రామంలోని పెద్ద మనుషుల దగ్గరకు వెళ్లాలని చెబుతున్నారు. దాంతో ఉమ్మడిజిల్లాలో పోలీస్‌స్టేషన్లలో పరిష్కారమయ్యే సమస్యలకంటే పెద్దమనుషులు చేస్తున్న పంచాయితీలే ఎక్కువగా ఉంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. 

శ్రుతిమించుతున్న తీర్పుల వ్యవహారం..

పోలీసులు, చట్టాలు, కోర్టులు ఎన్ని ఉన్నా.. ఎంత కఠిన శిక్షలు ఉన్నా కొందరు తమ పెద్దలు చెప్పిన మాటకే జై కొడుతున్నారు. పెద్ద మనుషులు నిర్వహిస్తున్న పంచాయితీల్లో తీర్పులు శ్రుతిమించుతున్నాయి. ముఖ్యంగా రెండు సామాజిక వర్గాల వారి మధ్య ప్రేమ, పెళ్లిళ్లు లాంటి వాటిలో కొందరు పెద్ద మనుషులు గుంజీలు తీయించడం, గుండ్లు కొట్టించడం, గ్రామం నుంచి వెలేయడం, కులం నుంచి బహిష్కరించడం లాంటి వికృత శిక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో ఊరందరి ముందు ఊ కొట్టినా.. ఆ తర్వాత వారిచ్చిన తీర్పులు ఏకంగా కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. కొందరేమో అంతకు మించి ఏమి చేస్తారులే అన్న ధోరణిలో మళ్లీ మళ్లీ తప్పులు చేస్తుంటే.. కొందరేమో మనస్తాపాలకు గురై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వివాదాలు పోలీస్‌స్టేషన్లు, కోర్టులకు వెళితే భయంతోనైనా, శిక్ష పడితే అయినా ఆయా వ్యక్తుల్లో మార్పు వస్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

పంచాయితీల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు..

ఖమ్మం నగరం నుంచి మొదలు మారుమూల పల్లె వరకు పలు పంచాయితీల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల జోక్యం ఉంటోంది. అయితే కొందరు నేతలు మాత్రం ఇరువర్గాల మధ్య సమస్యను పరిష్కరించే దిశగా సర్ధిచెబుతుండగా.. మరికొందరు తమ ఆర్థిక పురోగతికి బాటలు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరువర్గాల్లో ఆర్థికంగా తమకు ఎవరు చేయూతనిస్తారో వారివైపు నిలబడి పంచాయితీ చేయడం అలవాటు చేసుకుంటున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా అవతలి వర్గాలకు న్యాయం జరగదంటూ బెదిరింపులకు దిగడం.. సివిల్‌కు సంబంధించిన వివాదాల్లో తలదూర్చి.. కోర్టులకు వెళ్తే సమస్య ఇప్పట్లో పరిష్కారం కాదంటూ చెప్పి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అలా జిల్లాలో కేవలం పంచాయితీలపైనే నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్న ప్రజాప్రతినిధులు, నేతలూ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామీణస్థాయి నుంచి చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ద్వారా మున్ముందు పంచాయితీలు లాంటివి జరగకుండా నియంత్రించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 

Updated Date - 2022-01-17T05:30:00+05:30 IST