Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : ముందు బైక్ చోరీ.. ఆ తర్వాత చైన్ స్నాచింగ్.. కొద్ది దూరం వెళ్లాక... CP సీరియస్‌గా రంగంలోకి దిగడంతో..!

  • స్నాచర్ల ఆటకట్టు
  • కడప చైన్‌ స్నాచింగ్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌
  • రూ. 18.70 లక్షల సొత్తు స్వాధీనం
  • ఏడాదిలో 38 కేసుల నమోదు

చైన్‌ స్నాచింగ్‌ల కోసం ముందుగా బైక్‌ చోరీ చేస్తారు. దానిమీద నగరంలోని పలు కాలనీల్లో తిరుగుతారు. రెక్కీ చేసుకున్న ప్రాంతంలో మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కుంటారు. ఆ తర్వాత బైక్‌పై ఉడాయిస్తారు. కొద్దిదూరం వెళ్లి బైక్‌ను పడేసి కారులో చెక్కేస్తారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వరుస స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర కడప దొంగల ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం, రూ. 1.70 లక్షల నగదు, రూ. 7 లక్షల విలువైన కారు సహా మొత్తం రూ. 18.70 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ మహేష్‌ భగవత్‌ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలు వెల్లడించారు.


హైదరాబాద్‌ సిటీ : ఈ ఏడాది మే, జూన్‌, జూలై నెలల్లో మేడిపల్లి ప్రాంతంలో వరుస చైన్‌ స్నాచింగ్‌లు జరిగాయి. స్నాచర్లు మళ్లీ హల్‌చల్‌ చేయడంతో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ బృందం, సీసీఎస్‌ ఎల్‌బీనగర్‌, మేడిపల్లి క్రైమ్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు.  టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా, సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసి కడపకు చెందిన చైన్‌ స్నాచింగ్‌ గ్యాంగ్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

బైక్‌ను పడేసీ కారులో వెళ్తారు.. 

కడపకు చెందిన సయ్యద్‌ బాషా అలియాస్‌ సయ్యద్‌ 2010లో ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి తీగలు చోరీ చేసేవాడు. ఈ క్రమంలో పోలీసులకు దొరికి జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత 2017లో డ్రైవింగ్‌ పని కోసం కువైట్‌ వెళ్లాడు. అక్కడ యాక్సిడెంట్‌ చేసి 2020లో తిరిగి ఇండియాకు వచ్చాడు. స్నేహితుడు షేక్‌ ఆయూబ్‌తో కలిసి చైన్‌ స్నాచింగ్‌లు చేయాలని పథకం వేశాడు. పోలీసులకు దొరక్కుండా ఉండటానికి ముందుగా ఏదైనా బైక్‌ చోరీ చేసి, దాని మీద తిరుగుతూ చైన్‌ స్నాచింగ్‌లు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వరుసగా స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఒక్క ఏడాదిలో 2 బైక్‌ చోరీలు, 36 చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి మహిళలను భయబ్రాంతులకు గురిచేశారు. స్నాచింగ్‌లు చేసిన అనంతరం బైక్‌ను నిర్మానుష్య ప్రాంతంలో పడేసి, ముందుగా బుక్‌చేసుకున్న క్యాబ్‌లో వెళ్లిపోతారు. అలా పరిచయమైన క్యాబ్‌ డ్రైవర్‌ వీరికి సహకరించేవాడు. తన వాటా తాను తీసుకునేవాడు. గత నెలలో చైన్‌ స్నాచింగ్‌లకు వచ్చిన ముఠా రామంతాపూర్‌లో హీరోహోండా బైక్‌ను చోరీ చేసింది. దానిపై తిరుగుతూ మేడిపల్లి పరిధిలో రెండు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. బైక్‌ను వదిలేసి కారులో వెళ్లిపోయారు.

అభినందించిన సీపీ..

కడప చైన్‌ స్నాచింగ్‌ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన పోలీస్‌ సిబ్బందిని సీపీ అభినందించారు. బాధితులను సీపీ కార్యాలయానికి పిలిపించి సొత్తు అప్పగించారు. తక్కువ సమయంలో దొంగలను పట్టుకొని బంగారం అప్పగించినందుకు రాచకొండ పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

200 కెమెరాలు జల్లెడ పట్టాం.. 

సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాలతో ఐటీసెల్‌, సీసీఎస్‌, మేడిపల్లి క్రైమ్‌ టీమ్‌ సభ్యులం రంగంలోకి దిగాం. ముందుగా మేడిపల్లి పరిధిలో దొంగలు వదిలేసిన బైక్‌ రికవరీ అయింది. దాంతో ఫోకస్‌ బైక్‌ చోరీపై పెట్టాం. అది రామంతాపూర్‌కు చెందిన వ్యక్తిదిగా తేలింది. స్నాచింగ్‌కు ముందురోజు బైకు చోరీ అయినట్లు తెలిసింది. దాంతో అక్కడి కాలనీల్లోని సీసీటీవీ కెమెరాలు వడపోశాం. అక్కడ నిందితుడు సుమారు 4 గంటలపాటు తిరిగినట్లు గుర్తించాం. అలా ఫుటేజీలు పరిశీలిస్తుండగా బైక్‌ చోరీకి వచ్చినప్పుడు కారులోంచి దిగినట్లు గుర్తించాం. ఆ కారు నంబర్‌ సరిగా కనిపించ లేదు. ఆ తర్వాత మేడిపల్లి పరిధిలో జరిగిన చైన్‌ స్నాచింగ్‌ అనంతరం అదే కారులో నిందితులు వెళ్లిపోయినట్లు తేలింది. దాంతో కారు వివరాల కోసం పరిశోధన సాగించాం. మేడిపల్లి నుంచి సనత్‌నగర్‌ వరకు సుమారు 200 కమ్యూనిటీ సీసీటీవీలు వడపోశాం. చివరకు సనత్‌నగర్‌ పరిధిలో నిందితులకు సంబంధించిన క్లియర్‌ పిక్చర్‌ వచ్చింది. కారు నంబర్‌ ఆధారంగా ముం దుగా క్యాబ్‌ డ్రైవర్‌ను, ఆ తర్వాత దొంగల ముఠాను అదుపులోకి  తీసుకున్నాం. స్నాచర్లు కొట్టేసిన బంగారాన్ని కడపలోని శశిధర్‌రెడ్డి, జాఫర్‌ ఖాన్‌ల ద్వారా అమ్మేసి సొమ్ము చేసుకునేవారు. - శ్రీధర్‌ ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌, రాచకొండ.

Advertisement
Advertisement