ఇక తప్పించుకోలేరు..!

ABN , First Publish Date - 2020-10-28T12:17:43+05:30 IST

గతేడాది యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్‌ గ్రామంలో బాలికలపై అత్యాచారం, హత్యలు జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌ రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలని, నడిరోడ్డుపై కొట్టి చంపాలని

ఇక తప్పించుకోలేరు..!

హైదరాబాద్‌ : గతేడాది యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్‌ గ్రామంలో బాలికలపై అత్యాచారం, హత్యలు జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌ రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలని, నడిరోడ్డుపై కొట్టి చంపాలని ధర్నాలు, రాస్తారోకోలు కూడా జరిగాయి. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డిని కటకటాల్లోకి నెట్టారు. అతను చేసిన దారుణాలకు చట్టప్రకారం శిక్షపడేలా చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాలతో దర్యాప్తు బృందం పక్కా ఆధారాలను సేకరించింది. సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ను సేకరించింది. భువనగిరి ఏసీపీ భుజంగరావు బృందం 90 రోజుల్లోనే పక్కా ఆధారాలతో కిల్లర్‌ శ్రీనివాస్‌ రెడ్డిని కోర్టు బోనులో నిలబెట్టింది. పోలీసుల సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయ స్థానం నిందితునికి రెండు కేసుల్లో ఉరిశిక్షతో పాటు.. మరో కేసులో జీవితఖైదు విధించింది. ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాచకొండ పోలీస్‌ బృందానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశంసలు అందజేశారు.


రాష్ట్రంలోనే టాప్‌...

హజీపూర్‌ ఘటనలోనే కాదు.. నేరాల్లో  నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో రాచకొండ పోలీసులు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. 2019లో పోలీసులు 34 శాతం కన్విక్షన్‌ రేటు సాధించి స్టేట్‌లోనే టాప్‌గా నిలిచారు. 823 కేసుల్లో నిందితులను కోర్టు బోను ఎక్కించారు. 278 కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేయగలిగారు. 10 కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు పడటం గమనార్హం.


సీపీ ప్రత్యేక పర్యవేక్షణ...

‘తప్పు చేసిన వారు తప్పించుకోలేరు.. నేరం చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే’ అని రా చకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తన సిబ్బందికి తరచూ చెబుతుంటారు. నేరం చేసిన వారికి శిక్షపడేలా చేయడంలో సీపీ మహేష్‌ భగవత్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్స్‌, విచారణాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటారు. చార్జిషీటు దాఖలు చేయడంలో మెళకువలు, సాంకేతిక, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ను సేకరించి న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అంశాలపై సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తుంటారు. ఫలితంగా నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా చార్జిషీటు దాఖలు చేయడంలో రాచకొండ పోలీసులు సఫలీకృతం అవుతున్నారు


చట్టం ముందు అంతా సమానమే

చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తప్పించుకోలేరు. మా సిబ్బంది సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌, టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో పక్కా ఆధారాలను, సాక్ష్యాలను సేకరించి నిందితులను కోర్టు బోనులో నిలబెట్టి శిక్షలు పడేలా చేస్తున్నారు. 2019లో 34 శాతం కన్విక్షన్‌ రేటుతో రాచకొండ పోలీస్‌ రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది.

- మహేష్‌ భగవత్‌, రాచకొండ సీపీ

Updated Date - 2020-10-28T12:17:43+05:30 IST