భూ దందాలు.. సెటిల్‌మెంట్లు

ABN , First Publish Date - 2022-04-24T17:06:41+05:30 IST

హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని శివారు పోలీస్‌ స్టేషన్లకు రోజూ వస్తున్న ఫిర్యాదుల్లో 60 శాతం

భూ దందాలు.. సెటిల్‌మెంట్లు

ఠాణాలే అడ్డాలుగా..

వివాదాస్పదంగా కొందరు ఖాకీల తీరు 

సివిల్‌ వివాదాల్లో జోక్యం

అక్రమార్కులకు అండగా..

చర్యలు తీసుకుంటున్నా మారని వైనం


భూ దందాలు, సెటిల్‌మెంట్లు వంటి సివిల్‌ పంచాయితీలకు పోలీస్‌ స్టేషన్‌లు అడ్డాగా మారుతున్నాయి. పోలీసులు సివిల్‌ వ్యవహారాల్లో తలదూర్చొద్దని ఉన్నత న్యాయస్థానాలు, ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. కబ్జాదారులకు కొమ్ముకాస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. కొంతమంది డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు, సెక్టార్‌ ఎస్సైల తీరు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారుతోంది. 


హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని శివారు పోలీస్‌ స్టేషన్లకు రోజూ వస్తున్న ఫిర్యాదుల్లో 60 శాతం సివిల్‌ పంచాయితీలే ఉంటున్నాయని పోలీస్‌ ఉన్నతాధికారులే చెప్తున్నారు. భూముల రేట్లు రూ.కోట్లలోకి పెరగడంతో భూ దందాలు, కబ్జాలకు పాల్పడుతున్న కొందరు పోలీసులను మంచి చేసుకుంటున్నారు. రూ.కోట్ల రూపాయల విలువైన భూములు కావడంతో రూ. లక్షల్లో ముడుపులు ముట్టజెప్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు, సెక్టార్‌ ఎస్సైలు అందినకాడికి దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు, రియల్టర్‌ల మధ్య గొడవలు, గ్రూపు తగాదాలు జరిగి హత్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ వద్ద జరిగిన ఇద్దరు రియల్టర్‌ల హత్యలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ జంట హత్యలకు ముందు ఇరువర్గాలు ఇబ్రహీంపట్నం ఏసీపీని ఆశ్రయించారని, ఏసీపీ బాలకృష్ణారెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విచారణలో తీవ్ర జాప్యం చేశారనే ఆరోపణలతో ఆయనను సీపీ మహేష్‌ భగవత్‌ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేసినట్లు సమాచారం. తాజాగా ఏసీపీని సస్పెండ్‌ చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మల్కాజిగిరి ఏసీపీగా పనిచేసిన నర్సింహారెడ్డి, వనస్థలిపురంలో సస్పెండైన ఏసీపీ జయరాం సైతం భూ వివాదాల్లో తలదూర్చిన కారణంగానే సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం.


 కొన్ని నెలల క్రితం ఓ భూవివాదంలో తలదూర్చిన ఇన్‌స్పెక్టర్‌ను సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సస్పెండ్‌ చేశారు. భూ వివాదంలో ఒక వర్గం నుంచి డబ్బులు తీసుకున్న  ఇన్‌స్పెక్టర్‌ ఆ వర్గానికి మాత్రమే సపోర్టు చేసినట్లు విచారణలో తేలడంతో సీపీ ఆయన్ను సస్పెండ్‌ చేశారు.

మహిళలను వేధించి, బ్లాక్‌మెయిల్‌ చేసి, డబ్బులు దండుకుంటున్నాడనే ఆరోపణలతో వారం రోజుల క్రితం ఒక కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సస్పెండ్‌ చేశారు. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కానిస్టేబుల్‌ ఇటీవల ఓ జంటను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తేలింది.

అభాసుపాలు

పోలీస్‌ శాఖలో మితిమీరిన రాజకీయ జోక్యం రాజ్యమేలుతుండటంతో నాయకుల మాటలకు పోలీసులు తలొగ్గక తప్పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం పెరిగిపోయింది. వారు ఏం చెప్తే ఉన్నతాధికారులు సైతం అదే చేయాల్సిన పరిస్థితి నెలకొంది.  చట్ట విరుద్ధమైన పనైనా సరే తప్పనిసరి చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో బాధితులు వెళ్లి ఉన్నతాధికారులను కలిసిన్పడు  చివరకు  పోలీసులే అభాసుపాలవుతున్నారని కొంతమంది పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది డివిజన్‌, జోన్‌ స్థాయి ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.  

Updated Date - 2022-04-24T17:06:41+05:30 IST