8 కార్లు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: వివిధ రాష్ట్రాల్లో కార్లను చోరీచేసి మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాల్లో అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దొంగల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ. 50లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు శనివారం నేరేడ్మెట్ కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర అమరావతికి చెందిన ఇమ్నాన్ ఖాన్ పటాన్ కాప్రాలో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇక్కడ కార్లు దొంగతనం చేసి, వాటిని మహారాష్ట్రకు తీసుకెళ్లి మారుమూల ప్రాంతాల్లో అమ్మేసి సొమ్ము చేసుకోవాలని భావించిన ఇమ్రాన్.. మహారాష్ట్రలో ఉంటున్న తన స్నేహితులు సంతోష్ జగన్నాథ్ పవార్, ఫర్మాన్ ఆలీఖాన్, సోహబ్ ఆలీ, ఎవురుల్లా్హఖాన్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. వారిని నగరానికి రప్పించి, రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించేవారు. తర్వాత నకిలీ తాళం చెవులు ఉపయోగించి కార్లను చోరీ చేసేవారు. ముఖ్యంగా మారుతి స్విఫ్ట్, ఎర్టిగా, హోండా అమేజి, ఐ-10 కార్లను టార్గెట్ చేసి చోరీ చేసేవారు. కొంతకాలంగా నాచారం, కుషాయిగూడ, మల్కాజిగిరి ప్రాంతాల్లోని కార్లు వరుసగా చోరీకి గురవడంతో సీపీ మహేష్ భగవత్ మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ పర్యవేక్షణలో మల్కాజిగిరి సీసీఎస్ టీమ్‌తో పాటు.. నాచారం పోలీసులను రంగంలోకి దింపారు. టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో దొంగల ముఠా జాడను గుర్తించిన పోలీసులు ఇమ్రాన్‌ఖాన్ పటాన్, జగన్నాథ్ పవార్‌ను అరెస్ట్ చేశారు. దొంగల ముఠా ఆటకట్టించిన పోలీసులను అడిషనల్ సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.