‘రచ్చబండ’ జోష్‌

ABN , First Publish Date - 2022-05-22T06:06:44+05:30 IST

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేసిన విమర్శనాస్ర్తాలకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది.

‘రచ్చబండ’ జోష్‌
అక్కంపేటలో నిర్వహించిన రచ్చబండ సభకు హాజరైన ప్రజలు, మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి చిలువేరు జానీ ఇంట్లో భోజనం చేస్తున్న రేవంత్‌

కాంగ్రెస్‌ నేతల్లో కదనోత్సాహం
అక్కంపేటలో శ్రీకారం
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
రాహుల్‌ను తీసుకువస్తా..
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
కార్యకర్తలకు ధైర్యం.. రైతులకు భరోసా..
రైతు డిక్లరేషన్‌పై గ్రామంలో ప్రచారం
ఉత్సాహంగా సాగిన పీసీసీ చీఫ్‌ పర్యటన


ఓరుగల్లు, మే 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై చేసిన విమర్శనాస్ర్తాలకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ నెల 6న హనుమకొండలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్న రైతు సంఘర్షణ సభలో చేసిన రైతు డిక్లరేషన్‌ను గ్రామస్థులకు, రైతులకు రేవంత్‌రెడ్డి వివరించారు. కార్యకర్తల్లో మనోధైర్యం నింపడంతో పాటు రైతులకు పలు హామీలు ఇచ్చారు.

అక్కంపేట అభివృద్ధి
రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగానే అక్కంపేటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ స్వస్థలం అయిన అక్కంపేట అభివృద్ధిని ఎత్తిచూపుతూ రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం గ్రామస్థులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అన్ని విధాలా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పీహెచ్‌సీ, పశువుల ఆస్పత్రి నిర్మిస్తానన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాననన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్‌ గాంధీని గ్రామానికి తీసుకువస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

వనదేవతలకు.. పోచమ్మకు మొక్కి..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రచ్బబండ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆత్మకూరు మండలం అక్కంపేటను సందర్శించారు. అంతకుముందు రేవంత్‌ రెడ్డి తొలుత అత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్‌లోని సమ్మక్క, సారలమ్మల గద్దెలకు చేరుకుని పూజలు చేశారు. ఆనంతరం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీసంఖ్యలో వెంట రాగా ర్యాలీగా అక్కంపేటకు చేరుకున్నారు. గ్రామకూడలిలోని ఆచార్య జయశంకర్‌, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. గ్రామంలోని దళిత కాలనీలో పర్యటించారు. కాలనీలోవాసులతో ముచ్చటించారు. ఇంటింటికి వెళ్లి రైతు డిక్లరేషన్‌ కరపత్రాలను పంపిణీ చేశారు. రైతు డిక్లరేషన్‌లోని అంశాలను వారికి విడమరిచి చెప్పారు.  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రతీ అంశాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలోని పోచమ్మగుడిని సందర్శించారు. పోచమ్మతల్లికి పూజలు చేశారు. ఇక్కడే రావి చెట్టు కింద  ఏర్పా టు చేసిన రచ్చబండ బహిరంగ సభలో పాల్గొన్నారు.

జయశంకర్‌పై చిన్నచూపు

ఆచార్య జయశంకర్‌పై సీఎం కేసీఆర్‌ చిన్నచూపు చూస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన పేరు ప్రజల్లో ఉండిపోతే తన పేరును గుర్తుంచుకోరని కేసీఆర్‌ భావిస్తున్నాడన్నారు. అందుకే అయన స్వగ్రామం అయిన అక్కంపేటను పట్టించుకోవడం లేదన్నారు. గ్రామంలో మిషన్‌ భగీరథ నల్లా లేదని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టించలేదని, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. తండాలను  పంచాయతీలుగా చేసిన కేసీఆర్‌.. జయశంకర్‌ గ్రామాన్ని  కనీసం రెవెన్యూ గ్రామం కూడా చేయలేదని నిలదీశారు. ఇక్కడి దళితుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. జయశంకర్‌ స్వగ్రామంలో పుట్టడమే ఇక్కడి వారి శాపమా అన్నారు. వరంగల్‌ జిల్లాలో ఉన్న ఈ గ్రామాన్ని హనుమకొండ జిల్లాలో ఎందుకు కలిపారో తెలియడం లేదన్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరి, స్పీకర్‌ మధుసూదనాచారి ఽగ్రామాన్ని సందర్శించి జయశంకర్‌ విగ్రహం, స్మృతివనం నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపడుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది జీర్ణించుకోని కేసీఆర్‌.. వారి పదవులను ఊడగొట్టాడని అన్నారు. గ్రామంలో ఉన్న జయశంకర్‌ విగ్రహాన్ని కూడా కాంగ్రెస్‌ నేతలు కొండామురళి, సురేఖ దంపతులే కట్టించారన్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు.

హేమలతకు అండగా..
టీఆర్‌ఎ్‌సకు ఓటు వేయలేదని తనపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేశారని హేమలత అనే దళిత మహిళ తన గోడును చెప్పుకుంది. దీంతో వారిపై తాను ఎస్సీ, ఎస్టీ కేసును పెట్టానని, అయితే కేసును వెనక్కి తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ నేతలు బెదిరిస్తున్నారని చెప్పింది. దీంతో రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హేమలతమ్మ జోలికొస్తే  వంగబెట్టి చెప్పుతో కొడతానంటూ తీవ్రంగా హెచ్చరించారు.  కేసీఆర్‌ అండ ఉందని చెలరేగి పోవద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఉద్దేశించి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

దళిత కుటుంబంతో భోజనం
సభ అనంతరం గ్రామంలోని అక్కంపేట గ్రామంలోని దళిత కాలనీలో చిలువేరు జాని-లత ఇంటి పూరిగుడిసెలో వారితో కలిసి రేవంత్‌రెడ్డి భోజనం చేశారు. కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీ నాయకుడు మా వాడకు రాలేదని, మొదటిసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయడం మా జన్మధన్యమైందని రేవంత్‌రెడ్డితో అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే కాలనీవాసులందరికీ ఇందిరమ్మ గృహాలను మంజూరు చేస్తామని, వాటి గృహ ప్రవేశాలకు మళ్లీ వస్తానన్నారు.

Updated Date - 2022-05-22T06:06:44+05:30 IST