రబీ లక్ష్యం 1.68 లక్షల హెక్టార్లు

ABN , First Publish Date - 2021-10-09T11:41:03+05:30 IST

రబీ సీజనకు వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. ఈ సీజనలో సాధారణ సాగు విస్తీర్ణం 1,68,848 హెక్టార్లు అయితే అంతకు మించి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రబీ లక్ష్యం 1.68 లక్షల హెక్టార్లు

లక్ష ఎకరాల్లో బుడ్డ శనగ సాగు 

అవసరమైన విత్తనాలు 90,608 క్వింటాళ్లు

విత్తన సబ్సిడీ 25 శాతమే 

ముందుగానే డబ్బులు చెల్లించాలి

ఎరువులు 1.09 లక్షల మెట్రిక్‌ టన్నులు 

కడప, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : రబీ సీజనకు వ్యవసాయ శాఖ సమాయత్తమైంది.  ఈ సీజనలో సాధారణ సాగు విస్తీర్ణం 1,68,848 హెక్టార్లు అయితే అంతకు మించి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం కూడా విత్తనాల ధరను ఖరారు చేసింది. అయితే సబ్సిడీని 25 శాతానికే పరిమితం చేసింది. ప్రభుత్వం ఇచ్చే ధర కన్నా మార్కెట్‌లోనే శనగ ధర తక్కువ ఉంది. ఇక విత్తనాలు కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. అవసరమైన విత్తనాల కోసం ముందుగానే డబ్బు చెల్లించాల్సి ఉంది. ఖరీ్‌ఫలాగానే రబీలో కూడా సాగు ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏయే మండలంలో ఏ పంటలు సాగు చేస్తారు...? విత్తనాలు ఎంత అవసరం..? ఎరువులు డిమాండ్‌ను మండలాల వారీగా సేకరించి యాక్షన ప్లాన సిద్ధం చేశారు. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1,06,320 హెక్టార్లు కాగా 1,08,930 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రబీ సీజన కూడా ఈనెల 15 నుంచి మొదలవుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సీజనలో సాధారణ సాగు విస్తీర్ణం 1,68,848 హెక్టార్లు అయితే అంతకంటే ఎక్కువగా సాగవుతుందని అంచనా వేస్తున్నారు. లక్ష ఎకరాల్లో శనగ సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వర్షాధార పంట కావడం, వర్షం లేకపోయినా మంచుతోనైనా పంట దిగుబడి వస్తుంది. దీంతో రైతులు శనగ పంట వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, ముద్దనూరు, కమలాపురం డివిజన్లలో ఎక్కువ సాగు చేస్తారు. ఇక అన్ని రకాల విత్తనాలు కలుపుకుని 90,608 క్వింటాళ్లు అవసరమవుతాయి. 1,09,900 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపింది. 65,848 క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరమౌతాయి. వేరుశనగ 11,559 క్వింటాళ్లు, వరి 11,851 క్వింటాళ్లు, పొద్దుతిరుగుడు 280 క్వింటాళ్లు, కందులు 240, జొన్న 235, సజ్జ 135, పెసలు 110, మొక్కజొన్న 65, కొర్ర 25 క్వింటాళ్లు అవసరం. యూరియా 39 వేల టన్నులు, కాంప్లెక్స్‌ 40,500, డీఏపీ 10,500, పాస్పేట్‌ 5500, కాంపోస్టు 6500, పొటాష్‌ 7900 టన్నులు అవసరమని ప్రభుత్వానికి ప్రణాళిక పంపించారు. 


సబ్సిడీ 25 శాతమే 

రబీకి అవసరమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తుంది. అయితే బహిరంగ మార్కెట్‌లోనే విత్తనాల ధర తక్కువ ఉండడం గమనార్హం. ప్రభుత్వం శనగ విత్తనాలను రాయితీతో క్వింటా రూ.5175గా నిర్ణయించింది. అయితే బహిరంగ మార్కెట్‌లో ధర రూ.4800లకే ఉండటం గమనార్హం. సాధారణంగా అయితే బహిరంగ రేటు కన్నా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాల ధర తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం బహిరంగ మార్కెట్‌లోనే తక్కువ ఉండడం గమనార్హం. 50 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రంలో ముందుగా డబ్బు చెల్లించిన తర్వాతే విత్తనాలను ఇస్తారు. 

Updated Date - 2021-10-09T11:41:03+05:30 IST