భారంగా వరి కోతలు

ABN , First Publish Date - 2020-04-04T09:02:50+05:30 IST

జిల్లాలో రబీ సీజన్‌లో వరి కోత కోసేందుకు రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు.

భారంగా వరి కోతలు

జిల్లాలో ఉన్న హార్వెస్టర్లు 258

అవీ పొరుగు జిల్లాలకు వెళ్లిన వైనం

గంటకు రెండు వేల పైనే వసూలు


(ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం): జిల్లాలో రబీ సీజన్‌లో వరి కోత కోసేందుకు రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. జిల్లాలో 62 వేల హెక్టార్లలో వరి సాగు జరగ్గా, ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉంది. మరో వారం రోజుల వ్యవధిలో కోతలు ఊపందుకుంటాయి. జిల్లాలో 258 వరి కోత యంత్రాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. పక్క జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో యంత్రాలు అక్కడకు వెళ్లాయి. యంత్రాలు అవసరమైతే మండల వ్యవసాయ శాఖాధికారికి సమాచారం ఇస్తే సమకూరుస్తామని అధికారులు అంటున్నారు.


 తిరువూరు నియోజకవర్గంలో 5,700 హెక్టార్లలో వరి సాగు జరిగింది. కోకిలంపాడు, కొమ్మారెడ్డిపల్లి, రొచ్చుగుంట్ల, రాజుగూడెం, మునుకుళ్ల తదితర గ్రామాల్లో యంత్రాల కొరత కారణంగా కోతలు వేగంగా జరగడం లేదు. వరి కోత యంత్రానికి గంటకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. 


   ధాన్యం సంచుల కొరత

జిల్లాలో ఇప్పటి వరకు సుమారుగా 15 వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయి. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని 17 శాతం తేమ వచ్చే వరకు ఆరబెడుతున్నారు. ధాన్యం విక్రయానికి వ్యాపారుల వద్దకు వెళితే సంచుల కొరత ఉందని చెబుతున్నట్లు రైతులు అంటున్నారు. సంచులను సమకూరిస్తేనే ధాన్యం విక్రయాలు ఊపందుకోనున్నాయి. 267 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా వీటిలో చాలా మటుకు పనిచేయని పరిస్థితి ఉంది. జిల్లాలో ఖరీఫ్‌, రబీకి సంబంధించి ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది.  కోత యంత్రాలను  అందుబాటులో ఉంచడంతో పాటు సంచులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని రైతులు కోరుతున్నారు. కాగా జిల్లాలో వరి కోత యంత్రాలు అందుబాటులోనే ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ టి.మోహనరావు తెలిపారు. 


గంటకు రూ.2,500 నుంచి 3 వేలు 

 పమిడిముక్కల :  మండలంలో దాదాపు 300 ఎకరాల్లో వరి సాగవుతుండగా, కరోనా ప్రభావంతో కోతలకు కూలీలు రావటం లేదని, యంత్రాలను ఆశ్రయిస్తుండడంతో గంటకు రూ.2,500 నుంచి మూడు వేల వరకు తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.  ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-04-04T09:02:50+05:30 IST