సాగు చేయమంటారా..?

ABN , First Publish Date - 2020-12-06T05:16:59+05:30 IST

దాళ్వా సాగు చేయమంటారా.. సాగునీరు అందుతుందా అంటూ జిల్లా వ్యవసాయ శాఖాధికారిని రైతులు ప్రశ్నించారు.

సాగు చేయమంటారా..?
కాళ్ళలో జిల్లా వ్యవసాయాధికారికి వరి దుబ్బులను చూపుతున్న రైతులు

విత్తనాలు లేవు.. 

దాళ్వాకు నీరందుతుందా..  

అధికారులను ప్రశ్నించిన రైతులు


ఆకివీడు, డిసెంబరు 5: దాళ్వా సాగు చేయమంటారా.. సాగునీరు అందుతుందా అంటూ జిల్లా వ్యవసాయ శాఖాధికారిని రైతులు ప్రశ్నించారు. ఆకివీడులో ముందస్తు దాళ్వా సాగుపై శనివారం రైతులకు నిర్వహించిన సదస్సులో పాల్గొన్న జేడీ గౌషియా బేగం దృష్టికి పలు సమస్యలు తీసుకు వెళ్లారు. ఎగువన మురుగుకాల్వ అయిన వెంకయ్య వయ్యేరు దిగువ ఆయకట్టుకు పంట కాలువ అన్నారు. కాలువలో ఆక్వా వ్యర్థాల కారణంగా పంట నష్టపోతున్నామని, భూములు చౌడుబారిపోతున్నాయన్నారు. ఉప్పు టేరు, చినకాపవరం మురుగుకాల్వ ఆక్రమణకు గురై పూడుకుపోయి పారుదల క్షీణించడంతో సాగు, తాగునీరు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. శాశ్వత ప్రక్షాళన చేసిననాడే రైతులు ముంపు సమస్య తప్పుతుందన్నారు. ఇరిగేషన్‌, డ్రెయినేజీ అధికారులు ఎవరో తమకు తెలియదని, ఏ సమావేశం లో కూడా కనిపించరని, తమ సమస్యలు ఎలా తెలుస్తాయన్నారు. దాళ్వా సాగు చివరలో కాల్వలు కట్టేస్తారని చెబుతున్నారు. సాగుకు పూర్తి స్థాయిలో నీరందుతుందా అని వారు అనుమానం వ్యక్త చేశారు. ఈ వారంలోనే నారుమడులు పూర్తికావాలని అధికారులు చెబుతున్నారని, ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ముందస్తు సాగుచేయండి : జేడీ గౌసియా బేగం

జేడీ గౌసీయా బేగం మాట్లాడుతూ జిల్లాలో సార్వా పంట నష్టంపై కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామన్నారు. ప్రస్తుతం దాళ్వా సాగుకు త్వరితగతిన చేప ట్టాలని సూచించారు. మార్చి నెలాఖరులో కాలువలు మూసివేస్తారని, అప్పటికి సాగు పూర్తయ్యేలా రైతులు ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే నారుమడులు పూర్తికావాలని, లేకుంటే వెదజల్లడం, బెంగాలీలతో నాట్లు  చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీ ఈదా అనిల్‌కుమారి, ఏవో ప్రియాంక, సలహా మండలి చైర్మన్‌ సీతారామయ్య, అంబటి రమేష్‌, పుప్పాల పండు, దుర్గయ్య రైతులు ఉన్నారు.


నెలాఖరుకు నాట్లు పూర్తిచేయాలి

కాళ్ళ, డిసెంబరు 5 : దాళ్వా నాట్లు ఈనెలాఖరుకు పూర్తి చేయాలని వ్యవసాయశాఖ జేడీ గౌసియా బేగం రైతులకు సూచించారు. బొండాడ రైతు భరోసా కేంద్రం వద్ద సమావేశంలో రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఇటీవల వర్షాలకు పాడైన వరి పంటను రైతులు ఆమెకు చూపించి ఆదుకోవాలని కోరారు. రబీ సీజన్‌కు 1121 వరి రకం అనువైందని ఆమె సూచించారు. ఏవో జయవాసుకి, ఏఈవో మురళి కృష్ణ, రైతులు పాల్గొన్నారు.


రైతులే వ్యవసాయ నిపుణులు

ఉండి, డిసెంబరు 5 : రైతులే వ్యవసాయ నిపుణులని, వారికి వ్యవసాయ శాఖ సూచనలు ఇస్తుందని జేడీ గౌసియా బేగం అన్నారు. ఉండి రైతు భరోసా కేంద్రం వద్ద వ్యవసాయ ప్రణాళికను వివరిస్తూ పోస్టరు విడుదల చేశారు. వ్యవసాయ సాగులో రైతులకు అండగా ఉంటామన్నారు. వ్యవసా య సలహా మండలి చైర్మన్‌ తాటిపట్టి పెదవీరప్ప, ఏవో బి.సంధ్య, ఏఈవో ఆల్ర్ఫెడ్‌, రైతులు పాల్గొన్నారు.


విత్తనాలు లేవు

ఇప్పటి వరకు విత్తనాలు లేవు, ఎలా సాగు చేయాలి. పంట, మురుగు కాల్వలు తూడు, గుర్రపుడెక్క, కిక్కిసతో పూడుకుపోయాయి. ఆక్రమణలకుతో చేలకు చుక్క నీరు అందడం లేదు. విత్తనాలు అవస రమైన సమయంలో ఇవ్వకుండా చివరిలో ఇస్తే లాభమేంటి. మినీ కిట్లు సరఫరా చేస్తే సార్వాకైనా ఉపయోగపడతాయి. ఉప్పు టేరు, చినకాపవరం మురుగు కాల్వలు తూతూమంత్రంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపితే రైతులు ముంపు నుంచి బయటపడతారు.

గంధం మధు, మాదివాడ, ఆకివీడు


సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలి

సార్వా సాగులో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాళ్వా సాగుకు విత్తనాలు సబ్సిడీపై అందించాలి. దోమపోటు, తెగుళ్లు తట్టుకొనే విత్తనాలు సరఫరా చేయాలి. పంట, మురుగు కాల్వలు ఆధునీకరించి సాగు నీరు, ముంపు బెడద నివారించాలి. అధిగ దిగుబడులిచ్చే వంగడాలు అందించాలి. సార్వా పంట నష్టంతో బీమా పరిహారం వచ్చేలా చూడాలి. ప్రతీ ఏటా ముంపు తలెత్తితే రైతులు ఇక వ్యవసాయం వదులుకోవాల్సి వస్తుంది.

ఏలూరి రత్తయ్య, మాదివాడ, ఆకివీడు

Updated Date - 2020-12-06T05:16:59+05:30 IST