రబీ గట్టెక్కేనా..?

ABN , First Publish Date - 2021-01-12T05:24:51+05:30 IST

ఖరీ్‌ఫలో వరుస తుఫాన్లు, వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీలోనైనా కష్టాలు గట్టెక్కుతాయనే ఆశతో కేసీ కాలువ కింద సాగుకు సన్నద్ధం అయ్యారు.

రబీ గట్టెక్కేనా..?
చెన్నూరు మండలంలో కేసీ కాలువ పరిధిలో వరి నాట్లు జోరు

 కేసీ కాలువ కింద రబీ పంటగా 65 వేల ఎకరాలు

 శ్రీశైలంలో 160.91 టీఎంసీల నీళ్లు

 18.26 టీఎంసీలు అవసరం

 రబీకి ఏప్రిల్‌ ఆఖరువరకు సాగునీరు ఇవ్వాలని రైతుల డిమాండ్‌

 కృష్ణా బోర్డుపైనే అందరి ఆశలు..!


(కడప-ఆంధ్రజ్యోతి): ఖరీ్‌ఫలో వరుస తుఫాన్లు, వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీలోనైనా కష్టాలు గట్టెక్కుతాయనే ఆశతో కేసీ కాలువ కింద సాగుకు సన్నద్ధం అయ్యారు. 65 వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్‌ ఆఖరు వరకు సాగునీరు ఇవ్వాలి. కడప, కర్నూలు జిల్లాల్లో రబీ పంటలు గట్టెక్కాలంటే శ్రీశైలం నుంచి 22 టీఎంసీలు కావాలని కేసీ కాలువ ఇంజనీరింగ్‌ అధికారులు గత నెలలోనే ప్రభుత్వానికి లేఖ రాశారు. నెలన్నర కావొస్తున్నా ఎలాంటి స్పందన లేదు. నేడు కృష్ణా బోర్డు సమావేశం ఉంది. ఈ మీటింగ్‌పైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. 

కర్నూలు, కడప జిల్లాల ప్రధాన సాగునీటి వనరు కర్నూలు-కడప (కేసీ) కాలువ. ఈ కాలువ కింద కడప జిల్లాలో మైదుకూరు, కమలాపురం, ప్రొద్దుటూరు, కడప నియోజకవర్గాల పరిధిలో 90 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఖరీ్‌ఫలో పూర్తి ఆయకట్టు సాగు చేశారు. వరి అత్యధికంగా వేశారు. పంట కీలక దశలో అధిక వర్షాలు, తుఫాన్లు, వరదల వల్ల చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. ఖరీ్‌ఫలో తీవ్రంగా నష్టపోయినా రబీలోనైనా గట్టెక్కాలనే ఆశతో సుమారుగా 65 వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేపట్టారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటలకు మార్చి ఆఖరు వరకు, ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న వరి పైరుకు ఏప్రిల్‌ ఆఖరు వరకు సాగునీరు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

శ్రీశైలంలో 160.91 టీఎంసీలు నిల్వ

శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.85 టీఎంసీలు. ప్రస్తుతం 875.40 అడుగుల్లో 160.91 టీఎంసీలు ఉన్నాయి. శ్రీశైలం 810 అడుగుల వరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కాలువకు నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. కాగా ఖరీఫ్‌లో కురిసిన తీవ్ర వర్షాలతో కడప, కర్నూలు జిల్లాల్లో కేసీ కాలువ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని శ్రీశైలం జలాశయంలో డెడ్‌ స్టోరేజీ 53.85 టీఎంసీలు పోనూ మిగిలిన నీటిలో రబీ పంటల సాగుకు 22.02 టీఎంసీలు కేటాయించి మార్చి ఆఖరు వరకు కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీటిని ఇవ్వాలంటూ కర్నూలు ఇరిగేషన్‌ ప్రాజెక్టు సీఈ మురళినాథ్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. నెలన్నర దాటినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రబీ పంటలు చేతికి రావాలంటే 18.6 టీఎంసీల నీళ్లు సరిపోతాయని, ఆ మేరకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తామంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కేసీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


నేడు కృష్ణా బోర్డు సమావేశం

కృష్ణా జలాల వినియోగంపై మంగళవారం కృష్ణా నదీయాజమాన్యం బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం ఉంది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటి వినియోగం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డిమాండ్‌ మేరకు కృష్ణా బోర్డు కేటాయింపులు చేసే అవకాశం ఉందని ఇంజనీర్లు తెలిపారు. అందులో భాగంగానే శ్రీశైలం నుంచి కేసీ కెనాల్‌కు 20 టీఎంసీలకు బోర్డు అనుమతి తీసుకొని రబీ పంట చేతికొచ్చే వరకు సాగునీరు ఇవ్వాలని కేసీసీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


ఖరీ్‌ఫలో తీవ్రంగా నష్టపోయాం

- వారిష్‌ అహ్మద్‌, చెన్నూరు

కేసీ కాలువ కింద 2.50 ఎకరాల ఆయకట్టు ఉంది. మరో 11 ఎకరాలు కౌలుకు చేశాను. ఖరీఫ్‌ వరి సాగు చేస్తే అధిక వర్షాలకు పైరు నీటిపాలై పెట్టుబడి రూ.3.50 లక్షలు నష్టపోయాను. రబీలోనైనా కష్టాలు నుంచి గట్టేక్కుతామనే ఆశతో సాహసం చేసి వరి నాట్లు వేస్తున్నాను. పంట చేతికి వచ్చే వరకు కేసీ కాలువకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలి.



 

Updated Date - 2021-01-12T05:24:51+05:30 IST