నిలబడి తడబడిన లక్నో.. పంజాబ్ ఎదుట ఓ మోస్తరు లక్ష్యం

ABN , First Publish Date - 2022-04-30T03:07:24+05:30 IST

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల

నిలబడి తడబడిన లక్నో.. పంజాబ్ ఎదుట ఓ మోస్తరు లక్ష్యం

పూణె: పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోకు మూడో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. 6 పరుగులు మాత్రమే చేసిన కెప్టెన్ కేఎల్ రాహుల్.. రబడ బౌలింగులో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా మరో ఓపెనర్ డికాక్‌కు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి నిదానంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. క్రీజులో కుదురుకున్నాక జోరు పెంచారు.


ఈ క్రమంలో ఇద్దరూ రెండు వికెట్‌కు 85 పరుగులు జోడించాక 37 బంతుల్లో 4 ఫోర్లు, 2  సిక్సర్లతో 46 పరుగులు చేసిన డికాక్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 98 పరుగులు. ఆ తర్వాత లక్నో ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఆ వెంటనే దీపక్ హుడా (34), కృనాల్ పాండ్యా (7), ఆయుష్ బడోని (4) మార్కస్ స్టోయినిస్ (1) క్రీజులోకి వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లక్నో ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయంది.


13 ఓవర్ల వద్ద 98/2తో ఉన్న లక్నో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి 111 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు 130 పరుగులు చేయడం కూడా కష్టమేనని అనిపించింది. అయితే, జాసన్ హోల్డర్ (11) ఒకటి, దుష్మంత చమీర (17) రెండు, మోసిన్ ఖాన్ (13) ఒక  సిక్సర్ బాదడంతో 153 పరుగుల మోస్తరు స్కోరు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ నాలుగు వికెట్లు పడగొట్టగా, రాహుల్ చాహర్ రెండు, సందీప్ శర్మ ఒక వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2022-04-30T03:07:24+05:30 IST