Sep 25 2021 @ 17:42PM

అన్ని దెయ్యం పాత్రలే వస్తున్నాయి: రాయ్ లక్ష్మీ

‘‘ఇటీవల కాలంలో అన్ని దెయ్యం పాత్రలే వస్తున్నాయి. పైగా నా వద్దకు వచ్చే కథలన్నీ హర్రర్‌ జానర్‌లోనే ఉన్నాయి. అందుకే ఆలోచనలో పడ్డాను. ఇటువంటి పాత్రలు చేయాలా? వద్దా? అని. అయితే, ‘సిండ్రెల్లా’  కథ కూడా అలాగే ఉన్నప్పటికీ.. ‘సిండ్రెల్లా’ అనే పదం నాకెంతో నచ్చింది. అందుకే ఈ చిత్రంలో నటించేందుకు సమ్మతించాను అని హీరోయిన్‌ రాయ్‌ లక్ష్మీ పేర్కొంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సిండ్రెల్లా శుక్రవారం తెలుగు, తమిళ  భాషల్లో విడుదలైంది. ఆమెతో పాటు సాక్షి అగర్వాల్‌, రోబో శంకర్‌ తదితరులు నటించారు. విను వెంకటేష్‌ కథ సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్ఐ ప్రొడక్షన్‌పై నిర్మించారు. డ్రామా, హర్రర్‌ జానర్‌లో ఓ ఫాంటసీ మూవీగా నిర్మించారు. ఈ చిత్ర బృందం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాయ్‌లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ఇదొక భిన్నమైన దెయ్యం కథ. ఎంటర్‌టైన్‌గా సాగిపోతుంది. దర్శకుడు విను ప్రతి ఒక్కరికీ నచ్చేలా నిర్మించారు. రోబో శంకర్‌ హాస్యం కడుపుబ్బ నవ్విస్తుంది. ముందు ద్విపాత్రాభినయం అన్నారు.. చివరకు త్రిపాత్రాభినయం చేశాను..’’ అని రాయ్‌ లక్ష్మి వెల్లడించింది.