పాలకులకు భయం ఉండాలి

ABN , First Publish Date - 2021-07-28T06:40:32+05:30 IST

పాలకులకు ప్రజలంటే భయం ఉండాలి. లేకపోతే మోనార్కిజం పెరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

పాలకులకు భయం ఉండాలి
‘రైతన్న’ చిత్రం కృతజ్ఞతాభినందన సభలో మాట్లాడుతున్న ఆర్‌.నారాయణమూర్తి

లేకపోతే మోనార్కిజం పెరుగుతుంది

రైతుల ఉద్యమం స్వచ్ఛమైనది

నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి


విజయవాడ, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : ‘పాలకులకు ప్రజలంటే భయం ఉండాలి. లేకపోతే మోనార్కిజం పెరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంలో స్వచ్ఛత ఉంది. అందుకే పార్లమెంట్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు కొత్త చట్టాలను రూపొందించినా, ఇప్పటి వరకు కేంద్రం అమలు చేయలేకపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ చట్టాలు కార్యాచరణలోకి రాలేకపోయాయి.’ అని సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. విజయవాడలోని ప్రైవేటు హోటల్‌లో మంగళవారం జరిగిన  ‘రైతన్న’ చిత్రం కృతజ్ఞతాభినందన సభలో ఆయన మాట్లాడారు. కుతంత్రంతోనే కేంద్రం అన్నదాతలపై నల్లచట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. దేశంలో అన్ని ధరలూ పెరుగుతున్నా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఖర్చులూ పోగా 50శాతం మిగిలే విధంగా గిట్టుబాటు ధర కల్పిస్తేనే వ్యవసాయరంగం మనుగడ సాగిస్తుందని అభిప్రాయపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, వ్యవసాయ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి ఆర్‌.నారాయణమూర్తి రూపొందించిన రైతన్న చిత్రం ఎంతో ఊతం ఇస్తుందని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ‘‘దేశంలో ఇప్పటి వరకు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాటిని అరికట్టడానికి 2018లో ఆలిండియా కిసాన్‌ సంఘ్‌ పార్లమెంట్‌లో భేటీ అయిన తర్వాత కేంద్రం స్వామినాథన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. కేరళ రాష్ట్రంలో ఉన్నట్టు రుణ ఉపసంహరణ చట్టాన్ని అమలు చేయాలని, ఏడాదిలో ఒకసారి రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఈ రెండింటిని అమలు చేయలేదు. ఇది కాకుండా రైతులపై కుతంత్రంగా మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చారు. వాటిని రద్దు చేయాలని రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మొత్తం సన్నివేశాలతో రైతన్న చిత్రాన్ని ఆర్‌.నారాయణమూర్తి రూపొందించారు. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ చిత్రీకరించాలి’’ అని అభిప్రాయపడ్డారు. అనంతరం ఆర్‌.నారాయణమూర్తిని అఖిల భారత కిసాన్‌ సంఘ్‌ అధ్యక్షుడు రావుల వెంకయ్య, రైతు సంఘం అధ్యక్షుడు వై.కేశవరావు, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు జమలయ్య, ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అధ్యయన వేదిక కన్వీనర్‌ టి.లక్ష్మీనారాయణ తదితరులు ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2021-07-28T06:40:32+05:30 IST