టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న నటుడు మాధవన్ (Madhavan). నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలడు. ఈ విలక్షణ నటుడు తాజాగా నటించిన చిత్రం ‘రాకెస్టీ: ది నంబీ ఎఫెక్ట్’. ప్రముఖ సైంటిస్ట్ నంబీ నారాయణన్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’. జానపద కథలు విక్రమ్, బేతాళ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి పుష్కర్, గాయత్రి ద్వయం దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన ఈ మూవీ మంచి హిట్ సాధించింది. ఈ సినిమాలో పోలీస్ పాత్రైన విక్రమ్ క్యారెక్టర్ని మాధవన్, వేద అనే గ్యాంగస్టర్ పాత్రలో విజయ్ సేతుపతి నటించి మెప్పించారు. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని మాతృకకి డైరెక్షన్ చేసిన ఆ దర్శక ద్వయమే బాలీవుడ్‌లోనూ తాజాగా రిమేక్ చేస్తున్నారు. ఆ మూవీలో హృతిక్ రోషన్ (Hrithik Roshan), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) హీరోలుగా నటిస్తున్నారు. అందులో.. విజయ్ సేతుపతి (Vijay sethipathi) పాత్రని హృతిక్, మాధవన్ పాత్రలో సైఫ్ నటిస్తున్నారు. ఈ మూవీపై తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మాధవన్ స్పందించాడు.
మాధవన్ మాట్లాడుతూ.. ‘నేను మీకు లౌక్యంతో, డిప్లొమాటిక్‌గా సమాధానం ఇవ్వదలుచుకోలేదు. హృతిక్ రోషన్ అద్భుతంగా నటిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నా దృష్టంతా సైఫ్పైనే ఉంటుంది. దానికి కారణం ఆయన తమిళంలో నేను చేసిన పాత్రను చేస్తుండడమే. అందుకే ఆయన పర్ఫామెన్స్ చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఆయన నన్ను మించిపోయేలా చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఆ పాత్ర చాలా ఈజ్‌తో చేయగలడని నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ‘విక్రమ్ వేద’ రీమేక్ చిత్రీకరణను త్వరలో పూర్తి చేసి, సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతోంది.