తాకట్టు పెడితే తిరిగొస్తుందా?

ABN , First Publish Date - 2021-06-14T09:19:46+05:30 IST

భూమిని ఆదాయ వనరుగా భావించి అభివృద్ధి చేస్తే.. అది ఎప్పటికీ ఆర్థిక అవసరాలను తీర్చుతూనే ఉంటుంది. క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చిపెడుతూనే ఉంటుంది. అందుకు భిన్నంగా దానిని

తాకట్టు పెడితే తిరిగొస్తుందా?

అసలే పీకల్లోతు ఆర్థిక కష్టాలు

విడిపించుకోలేకపోతే పరిస్థితేంటి?

ఆర్‌అండ్‌బీ భూముల తనఖా యోచనపై సర్వత్రా ఆందోళన

నాడు ఆదాయ వనరు.. నేడు తాకట్టు సరుకు

ఆర్‌అండ్‌బీ స్థలాల్లో స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి 2018లో నిర్ణయం

ప్రభుత్వం మారడంతో ప్రతిపాదన బుట్టదాఖలు

2019లోనే అమ్మకం పద్దులోకి బిల్డ్‌ ఏపీ ద్వారా ప్రయత్నాలు

సఫలం కాకనే ఇప్పుడు తనఖా యోచన

విజయవాడ అతిథిగృహంపై కన్ను


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

భూమిని ఆదాయ వనరుగా భావించి అభివృద్ధి చేస్తే.. అది ఎప్పటికీ ఆర్థిక అవసరాలను తీర్చుతూనే ఉంటుంది. క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చిపెడుతూనే ఉంటుంది. అందుకు భిన్నంగా దానిని తెగనమ్మితే భూమీ పోతుంది.. దానిపై వచ్చిన సొమ్మూ ఖర్చయిపోతుంది.. ఇలా అమ్ముకోవడం అలవాటుగా మారితే.. చివరాఖరుకు సెంటు భూమి కూడా మిగలదు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూములకు ఇదే తెగులు పట్టించింది. కొత్తగా ఆదాయ వనరులను సృష్టించుకోలేక విలువైన భూములను అమ్మాలనుకుంటోంది. ఇందుకోసం బిల్డ్‌ ఏపీ మిషన్‌ పేరిట ఎన్నో విన్యాసాలు చేసినా కోర్టుల ముందు ఆ పాచిక పారలేదు. ఇప్పుడు వ్యూహాత్మకంగా తాకట్టు ఆలోచనలకు తెరలేపింది. తొలి పద్దులో రోడ్లు భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ ఆస్తులనే బయటకు తీసింది.


ఈ శాఖ వద్ద భూములు, భవనాల రూపంలో సుమారు రూ.6,500 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. 2017లో నాటి ప్రభుత్వం ఓ సర్వే చేయించినప్పుడు వీటి విలువ తేలింది. ఇప్పుడు మరింత పెరిగి ఉంటుంది. అయితే 2019లో జగన్‌ సర్కారు వచ్చాక అన్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఖాళీ భూముల లెక్క తీశారు. బిల్డ్‌ ఏపీ మిషన్‌ కింద ఎన్‌బీసీసీ ద్వారా ఎంపిక  చేసిన ఖాళీ భూములను విక్రయించాలనుకున్నారు.


ఇందుకోసం మరోసారి పూర్తిస్థాయి పరిశీలన జరిగింది. అప్పుడే ఆ భూముల్లో స్టార్‌ హోటళ్లు నిర్మించే ప్రతిపాదన ఉందని, వాటిని అమ్మడం సరైందని కాదని సీనియర్‌ అధికారులు అభిప్రాయపడ్డారు. అధికారిక సమాచారం ప్రకారం ఆర్‌అండ్‌బీ వద్ద 1,750 ఎకరాలపైనే భూమి ఉన్నట్లు తేలింది. ఇందులో సింహభాగం నగరాలు, పట్టణాలు, డివిజనల్‌ కేంద్రాల్లో ఉన్నవే. మండల, డివిజన్‌, జిల్లా ప్రధాన కేంద్రాల్లో ప్రైమ్‌ ఏరియాల్లోనే అతిఽథి గృహాలు, ఆఫీసులు, ప్రాజెక్టు యూనిట్ల పేరిట ఈ భూములున్నాయి. వీటిలో 40 శాతమే బిల్డప్‌ ఏరియా. మిగతాది ఖాళీయే.


స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ భూమి ఎస్‌డీసీకి!

రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీకి 60కిపైగా అతిథి గృహాలున్నాయి. సగటున ఒక్కొక్కటీ 1.50 ఎకరాల నుంచి నాలుగెకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. కొన్ని చోట్ల పదెకరాల విస్తీర్ణంలోనూ ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న భూముల విలువే రూ.6,500 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటిలో కీలకమైనది విజయవాడ నగరం నడి బొడ్డున ఉన్న స్టేట్‌ గెస్ట్‌హౌస్‌. మొత్తం మూడు ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది. దీని విలువ ఇప్పుడు రూ.450 కోట్లపైనే ఉంటుందని ఆర్‌అండ్‌బీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో బిల్డప్‌ ఏరియా ఒకటిన్నర ఎకరం కాగా.. మిగతాది ఖాళీగా ఉంది. సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న భూముల జాబితాలో దీనిని కూడా చేర్చారు. మిషన్‌ ఏపీ కింద ఆ భూమిని అమ్మాలన్న చర్చలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్లింది. ఇప్పుడు దీనిని కూడా ఏపీఎ్‌సడీసీకి కట్టబెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ భూమిని తాకట్టు పెట్టవద్దని ఆర్‌అండ్‌బీ వర్గాలు ప్రాఽధేయపడుతున్నాయి. ‘ఇది చాలా విలువైన అతిథి గృహం. రాష్ట్రానికి వచ్చే వీఐపీలు, ఇతర అతిఽథులకు ఇక్కడే బస ఏర్పాటు చేస్తున్నారు. చీఫ్‌ జస్టిస్‌, గవర్నర్‌, ఇతర ముఖ్యుల అవసరాలకు దీనిని వినియోగించాల్సిన అవసరం ఉంది. అమ్మడం, లేదా తాకట్టుపెట్టే చర్యలొద్దు’ అని ఓ సీనియర్‌ అధికారి సూచించారు.


ఇప్పుడు తాకట్టు బాటలో.. 

బిల్డ్‌ ఏపీ మిషన్‌ కింద ప్రభుత్వ పరిధిలో ఉన్న ఖాళీ భూములు అమ్మాలని జగన్‌ సర్కారు నిర్ణయించినప్పుడు ముందు ఆర్‌అండ్‌బీ భూములపైనే కన్నేశారు. అయితే ఈ ప్రక్రియ కోర్టులో ఉంది. అది ఎప్పటికి తేలుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో ఏపీఎ్‌సడీసీ ద్వారా కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న ఖాళీ భూములను ఈ కార్పొరేషన్‌కు అప్పగించాలన్నది నిర్ణయం. ఇందులో తొలుత ఆర్‌అండ్‌బీ వద్ద ఉన్న భూములే అప్పగించాలన్నది ప్రతిపాదన. ఒక్కసారి ప్రభుత్వ భూములు ఆ కార్పొరేషన్‌ చేతికి వెళ్లాక రుణం కోరుతూ ఆ భూములను తన ఆస్తులుగా చూపిస్తుంది. వాటిని తనఖా పెట్టి భారీగా రుణం తీసుకుంటుంది. ఒక్కసారి తనఖా కిందకు వెళ్లిన భూమి అంత తేలిగ్గా తిరిగొస్తుందా? ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న రాష్ట్రప్రభుత్వం.. భారీస్థాయిలో ఆదాయ, రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది. తెచ్చిన అప్పులు తీర్చి తిరిగి ఆ భూములను ఎప్పుడు తనఖా నుంచి ఇప్పించగలదన్నదే పెద్ద సమస్య. తీర్చకపోతే తాకట్టుపెట్టుకుని సొమ్ములిచ్చిన సంస్థలు చేతులు కట్టుకుని కూర్చుంటాయా? తన డబ్బు వస్తే చాలనుకుని వాటిని ఎవరికో ఒకరికి తక్కువకే విక్రయించుకుని సొమ్ము చేసుకోవా? దీనికి ప్రభుత్వ సమాధానమేంటో స్పష్టత లేదు.


స్టార్‌ హోటళ్ల కోసం కసరత్తు..

నవ్యాంధ్రలో హోటల్‌ రంగం భారీగా పెరుగుతున్న నేపఽథ్యం లో ఆర్‌అండ్‌బీ వద్ద ఖాళీగా ఉన్న భూముల్లో త్రీస్టార్‌, ఫైవ్‌స్టార్‌ హోట ళ్లు, గెస్ట్‌హౌస్‌లు నిర్మించాలని 2018లో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆర్‌అండ్‌బీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖ, ఏలూరుతోపాటు 13జిల్లాల ప్రధాన కేంద్రాలు, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు, నగరాల పరిధిలో స్టార్‌ హోటల్స్‌ నిర్మించాలనుకున్నారు. వీటిని ప్రైవేటు పెట్టుబడులతో నిర్మించినా ప్రభుత్వానికీ 30శాతం గదులు కేటాయిస్తారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే అతిథులకు ఇక్కడ వసతి కల్పించాలని భావించారు. దీనివల్ల ప్రైవేటు హోటల్‌ గదులపై వెచ్చిస్తున్న ఖర్చు ఆదా అవుతుందనుకున్నారు. విధివిధానాలు కూడా ఖరారుచేశారు. 2019 నవంబరు నాటికి హోటళ్ల నిర్మాణం ప్రారంభించాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని ప్రముఖ స్టార్‌ హోటళ్ల నిర్వహణ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ఈ ఆలోచన కార్యరూపం దాలిస్తే ఏటా సర్కారుకు ఆదాయం వచ్చేది. హోటళ్లపై చేసే ఖర్చు ఆదా అయ్యేది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో ఈ ప్రతిపాదనను బుట్టదాఖలైంది.


రూ.వేల కోట్ల విలువైన ఆర్‌అండ్‌బీ స్థలాల్లో స్టార్‌ హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, గెస్ట్‌హౌస్‌లు నిర్మించి వాటిని రెగ్యులర్‌ ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని గత ప్రభుత్వం భావించింది. కానీ జగన్‌ సర్కారు వచ్చాక ఆ ప్రతిపాదనను అటకెక్కించింది. ఖాళీ భూములను అమ్మాలనుకుంది. కుదరకపోవడంతో ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) ద్వారా తాకట్టుకు సమాయత్తమవుతోంది.ఒక్కసారి తనఖాలోకి వెళ్లిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత తేలికా? పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న సర్కారు.. దానిని ఎలా విడిపించి తీసుకు రాగలుగుతుందన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-06-14T09:19:46+05:30 IST