హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల నిరసన.. ఎమ్మెల్యే కేపీ వివేక్ సంఘీభావం

ABN , First Publish Date - 2022-05-27T02:52:35+05:30 IST

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హైదారాబాద్ పర్యటన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా ..

హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల నిరసన.. ఎమ్మెల్యే కేపీ వివేక్ సంఘీభావం

హైదరాబాద్: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హైదారాబాద్ పర్యటన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంఘీభావం తెలిపారు.  


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను బడాబాబులకు బీజేపీ ప్రభుత్వం అమ్ముతుందన్నారు. మేకిన్ ఇండియా పథకం అంతా బక్వాస్ అని విమర్శించారు. బీజేపీ సర్కార్ విధానాలతో కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రం లాభాల బాటలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ.. నష్టాల్లో ఉన్న వాటిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల చట్టబద్ధ హక్కులను పట్టించుకోకుండా రెండేళ్లుగా పీఎఫ్, దశాబ్దకాలంగా ఈఎల్ ఇంక్రిమెంట్, రెండు దశాబ్దాలుగా వేజ్ రివిజన్ ఎరియర్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. జీవితాంతం కష్టపడి పదవీ విరమణ పొంది తమ శేషజీవితాన్ని గడిపే సమయంలో న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా చిత్రవధకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు చుట్టం చూపులా రావడం తప్ప రాష్ట్రానికి ఇచ్చింది, చేసిన మేలు ఏదీ లేదన్నారు.


ఇప్పటికైనా విశ్రాంత ఉద్యోగుల ఆవేదనను పట్టించుకోని, వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేక్ డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు ఆపేది లేదని, అవసరమైతే రాబోయే రోజుల్లో ఢిల్లీలో కూడా నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. 


ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్‌లు జయరాం, తంగ లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, రషీద్ బైగ్, కర్నేకంటి మల్లేష్, సత్తిరెడ్డి, హెచ్ఎంటీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ కేవీ రామారావు, కోఆర్డినేటర్ పండరి, రవీందర్ గౌడ్, నిరంజన్ గౌడ్, రాములు గౌడ్, దేవేందర్, కేఎం ప్రకాష్, తులసీ దాస్, అనంత్ రాములు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-27T02:52:35+05:30 IST