ఉద్యోగాలిప్పిస్తామని కోట్లు కొల్లగొట్టారు

ABN , First Publish Date - 2021-03-04T06:00:16+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు చెన్నై, కలకత్తా వరకు విస్తరించిన ఈ ముఠాను పట్టుకోవడానికి జిల్లా పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక బృందాలను నియమించింది.

ఉద్యోగాలిప్పిస్తామని  కోట్లు కొల్లగొట్టారు
నిందితులను అరెస్టు చూపుతున్న డీఎస్పీ సుధాకరరెడ్డి తదితరులు

ఇద్దరి అరెస్టు 

చిత్తూరు జిల్లాలోనే నిరుద్యోగుల నుంచి రూ.1.50 కోట్లు వసూలు

కలకత్తా ముఠా అరెస్టుకు ప్రత్యేక బృందాలు 

డీఎస్పీ సుధాకరరెడ్డి


చిత్తూరు, మార్చి 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు చెన్నై, కలకత్తా వరకు విస్తరించిన ఈ ముఠాను పట్టుకోవడానికి జిల్లా పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక బృందాలను నియమించింది. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ సుధాకరరెడ్డి బుధవారం వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా పట్టనూరుకు చెందిన ఎ.దేవప్రియన్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. చెన్నైలోని వళ్లువర్‌ స్ర్టీట్‌కు చెందిన వీఎస్‌.హరిహరకుమార్‌, సుదర్శన్‌తో పాటు కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. కలకత్తాలోని కొంతమంది ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేశారు. కొందరికి ఉద్యోగాలు వచ్చినట్లు నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చేవారు. ఈ విధంగా జిల్లాతో పాటు కడప, నెల్లూరుతో పాటు తమిళనాడులో వివిధ జిల్లాల్లో సుమారు 50 మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే రూ.1.50 కోట్లు వసూలు చేశారు. దీనిపై చిత్తూరు, పాకాల, జీడీనెల్లూరు పోలీసు స్టేషన్ల పరిధిలోని బాధితుల నుంచి ఫిర్యాదులందాయి. బుధవారం చిత్తూరు టూటౌన్‌ సీఐ యుగంధర్‌ సిబ్బందితో కలిసి కాణిపాకం బైపాస్‌లో నిఘావేసి దేవప్రియన్‌, హరిహరకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో చెన్నైకి చెందిన కొందరిని, కలకత్తాకు చెందిన ముఠాను అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. నిందితును అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన రాజ్‌కుమార్‌, సుధాకర్‌, అప్పయ్యను అభినందించారు.

Updated Date - 2021-03-04T06:00:16+05:30 IST