క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ

ABN , First Publish Date - 2022-05-27T08:03:29+05:30 IST

క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ

క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ

ఇదే మహానాడు నినాదం.. రాష్ట్రం జగన్‌ జాగీరు కాదు

అధినేత చంద్రబాబు హెచ్చరిక


అడుగడుగునా స్వాగతాలు.. 

చంద్రబాబుకు బాపట్ల జిల్లా పరిధిలోని జాతీయ రహదారి పక్కనున్న బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయల్దేరిన చంద్రబాబుకు అద్దంకి ఎమ్మెల్యే రవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద ఎదురేగి అధినేత, టీడీపీకి అనుకూలంగా నినాదాలు హోరెత్తించాయి. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ వద్ద ఎస్‌ఎన్‌పాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌, త్రోవగుంట వద్ద ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ల నాయకత్వంలో వేలాదిమంది టీడీపీ అభిమానులు ఘనంగా ఆహ్వానం పలికారు. భారీ బైక్‌ ర్యాలీతో ఊరేగింపులు నిర్వహించారు. 


అమరావతి (ఆంధ్రజ్యోతి), యడ్లపాడు, మే 26: ‘క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అనేది మహానాడు నినాదమని, ఇదే ప్రతి తెలుగువాడి నినాదం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఒంగోలు మహానాడుకు భారీ వాహనాల ర్యాలీతో ఆయన బయల్దేరారు. వందలాది కార్లు, భారీగా మోటార్‌సైకిళ్లు అనుసరించగా, రాత్రి ఏడుగంటల ప్రాంతంలో మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి...ఆయన ఒంగోలుకు బయల్దేరారు. మహిళల నుంచి హారతులు అందుకుని వాహనంలో కూర్చుకున్నారు. మహానాడుకు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తున్నా...అలాంటివేం లెక్కచేసేదే లేదు అన్నట్లుగా భారీ ర్యాలీతో వెళ్లారు. ఆయనకు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు భాష్యం ప్రవీణ్‌, తెలుగుయువత రాష్ట్ర మాజీ కార్యదర్శి కుర్రా అప్పారావుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పెద్ద ఎత్తున హాజరైన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులలో ఉత్సాహం నింపుతూ వాహనంపై నుంచి చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు తమ్ముళ్ల ఉత్సాహం చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. మహానాడుని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కంపించి పోయేలా ప్రజలంతా భారీగా మహానాడుకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మహానాడు నిర్వహించుకునేందుకు స్టేడియం ఇవ్వలేదని, ఆర్టీసీ బస్సులు రానివ్వడం లేదన్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌, స్కూలు బస్సులు ఇస్తామంటే ఆర్టీఏ అధికారులతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ‘‘బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టుకోనివ్వరా.. ఈ రాష్ట్రం మీ జాగీరా.. మీ ఆటలు సాగవు.. ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రిని, సైకోను ఇంతవరకు చూడలేదు. తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న జగన్‌రెడ్డికి భవిష్యత్‌లో చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం’’ అని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశాన్ని అడ్డుకోవడం ఆయన తండ్రి వల్లే కాలేదని, ఇక ఈయన వల్లేం అవుతుందని ఆగ్రహించారు. ‘‘జగన్‌రెడ్డి పాలనలో ఏ వర్గమైనా.. కులమైనా సంతోషంగా ఉందా? ఏ గ్రామమైనా బాగుపడిందా? బాదుడి దెబ్బకి ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా? ఇక్కడ ఉన్నవారిలో ఎవరైనా సంతోషంగా ఉన్నామంటే తిరిగి అమరావతికి వెళ్లిపోతాను. మీ కోసమే నేను వచ్చా. మీ తరపున పోరాడడానికే వచ్చా. నా ఆలోచన, కష్టం అంతా మీ కోసమే. చిలకలూరిపేటలో రూ.2లకే 20లీటర్ల తాగునీరు ఇచ్చే ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభిస్తుంటే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతారా? ఎంతమందిపై పెడతారు? లక్షలు, కోట్లమందిపై పెడతావా జగన్‌? లక్షలమంది ఒకేసారి రోడ్డెక్కితే శ్రీలంకలో మాదిరి నువ్వుకూడా పారిపోతావు. రాజపక్స కంటే గొప్ప మొనగాడా ఈ జగన్‌? ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అన్నారు.. జనం నిలదీస్తుండడంతో ఇప్పుడు బస్సుయాత్ర అంటున్నారు. సామాజిక న్యాయం అని చెబుతున్నారు. ఎక్కడుంది సామాజిక న్యాయం? జనం చెవుల్లో పూలు పెడుతున్నారు. త్వరలోనే జనం మీ చెవుల్లో పూలు పెట్టే రోజు వస్తుంది. అమరావతిని కాదని రాజధానిని విశాఖ తీసుకెళ్తానన్న జగన్‌రెడ్డి ఆ ప్రాంతం వారికి రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు? రాయలసీమకూ ఎందుకు ఇవ్వలేదు? విజయసాయిరెడ్డికి పదవి ఇవ్వకపోతే ఆయన అప్రూవర్‌గా మారతారు. అదే జరిగితే జగన్‌ జైలుకు పోవాల్సి వస్తుంది. అందుకే ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు జగన్‌ కేసుల్లో ముద్దాయిలు. రాజ్యసభ సీట్లలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక్కటైనా ఇచ్చారా? టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు అమలు చేసిన 25 పథకాలను ఈ ముఖ్యమంత్రి రద్దు చేశారు. బీసీలకూ అలాగే చేశారు. డబ్బున్న వాళ్లకు ఊడిగం చేయడం, పేదల పొట్ట కొట్టడం జగన్‌కు చాలా ఇష్టం. నా ప్రభుత్వం అప్పట్లో తెచ్చిన గ్రీన్‌ ప్రాజెక్ట్‌ను దావోస్‌ వెళ్లి ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ఈయన ఓ స్టిక్కర్‌ ముఖ్యమంత్రి. దావోస్‌ వెళ్లి రూ.16 కోట్లు వృధాచేసి కథలు చెబుతున్నారు. నేను తెచ్చిన పరిశ్రమల్ని తప్పు పట్టారు. తిరిగి వాటికోసమే దావోస్‌ వెళ్లారు’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అతి కిరాతకంగా దళిత యువకుడిని చంపి, అతని ఇంటికే తీసుకెళ్లి కుటుంబ సభ్యుల్ని బెదిరించారని మండిపడ్డారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈ ఉదంతంలో నిందితుడిని రక్షించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ‘‘దళిత కుటుంబానికి న్యాయం జరిగేలా అక్కడి టీడీపీ నేతలు కృషి చేశారు. నిజాలను బయటకు వచ్చేలా చేయడంతో పోలీసులు కేసు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజలంతా ఎమ్మెల్సీ చంపిన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం గురించి చర్చించుకుంటుంటే పచ్చని కోనసీమలో చిచ్చుపెట్టారు. పోలీసులు అక్కడే ఉండికూడా మంత్రి ఇంటిని తగులబెడుతుంటే ఏం చేశారు? ఇళ్లు, బస్సులు, దుకాణాలు తగులబెడుతుంటే ఫైరింజన్లు ఎందుకు రాలేదు? వారి ఇళ్లు వారే తగులబెట్టుకుని ఇతరులపై బురద జల్లేందుకు సిద్ధమయ్యారు. జగన్‌రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు తెలుసు’’ అని హెచ్చరించారు. కాగా, మహానాడుకు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి తరలి వచ్చే పార్టీ కార్యకర్తల ఆకలి తీర్చేందుకు వంకాయలపాడు వద్ద భోజన ఏర్పాట్లను ఏర్పాటు చేయించిన భాష్యం ప్రవీణ్‌ను ఆయన అభినందించారు. 


బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులో పనిచేయని ఏసీ

ఒంగోలు ర్యాలీలో భాగంగా తన కాన్యాయ్‌లో బయల్దేరిన చంద్రబాబు కొంతదూరం వెళ్లగానే...కాన్వాయ్‌లో కారు దిగేయాల్సి వచ్చింది. కాన్వాయ్‌లోని బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనంలో ఏసీ పనిచేయలేదు. అదే కాన్వాయ్‌లో అదనంగా ఉన్న మరో ఏసీ వాహనం కూడా పనిచేయలేదు. దీంతో ఆయన కాన్వాయ్‌లోని కారు దిగి ర్యాలీలో వస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కారులోకి ఎక్కారు. ఏలూరి సాంబశివరావు స్వయంగా డ్రైవింగ్‌ సీట్‌లోకి వచ్చి కారు నడిపారు. ప్రతిపక్షనే తగా చంద్రబాబునాయుడి కాన్వాయ్‌ కార్లను ప్రభుత్వమే సమకూర్చాలి. అలా ప్రభుత్వమే సమకూర్చిన ఆ కాన్వాయ్‌ కార్లకు ఇటీవల కాలంలో తరచూ మరమ్మతులు వస్తున్నాయి. 





Updated Date - 2022-05-27T08:03:29+05:30 IST