వదిలేసి వెళ్లిపో.. విశాఖలో భూదందా..!

ABN , First Publish Date - 2020-02-18T09:07:59+05:30 IST

అది విశాఖ నగరం వెంకోజీపాలెంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న జ్ఞానానంద-రామానంద ఆశ్రమం! ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. దీనిపై కొందరు పెద్దల కన్ను పడింది. ఈ ఆశ్రమాన్ని ప్రైవేటు ట్రస్టుకు

వదిలేసి వెళ్లిపో.. విశాఖలో భూదందా..!

ఆశ్రమంపై ‘అధికార’ పడగ

ప్రైవేటు ట్రస్టుకు ఇవ్వాలని ఒత్తిడి

దేవదాయశాఖకు నేతల లేఖలు

రిటైర్డ్‌ పోలీసు అధికారితో బెదిరింపులు

రెవెన్యూ అధికారులతో రాయబారాలు

విశాఖ నగరంలో మరో భూదందా!

అసలే బంగారంలాంటి విశాఖ నగరం! 

ఆపై... కొత్తగా ‘వస్తున్న’ రాజధాని కళ! 


విలువైన స్థలాలను దక్కించుకునేందుకు ‘వేట’ మొదలుపెట్టారు. ఖాళీ స్థలాలు, క్లబ్బు జాగాలే కాదు... ఆశ్రమాలనూ వదలబోమంటున్నారు! దశాబ్దాల తరబడి నడుస్తున్న ఓ ఆశ్రమంపై కన్నేశారు. ప్రైవేటు ట్రస్టుకు అప్పగించాలని ఒత్తిడి  తెస్తున్నారు. ఏకంగా మంత్రులే అధికారికంగా లేఖలు రాశారు. మాజీ పోలీసు అధికారులను రంగంలోకి దించి... కుదిరితే నయానా, లేకుంటే భయానా ఒప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఏమిటా ఆశ్రమం... ఆ భూములు దక్కించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆశ్రమ నిర్వాహకులు ఏమంటున్నారు? 

‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

అది విశాఖ నగరం వెంకోజీపాలెంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న జ్ఞానానంద-రామానంద ఆశ్రమం! ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. దీనిపై కొందరు పెద్దల కన్ను పడింది. ఈ ఆశ్రమాన్ని ప్రైవేటు ట్రస్టుకు అప్పగించాలంటూ కొందరు ప్రజాప్రతినిధులు ఏకంగా దేవదాయ శాఖకు లేఖలు రాశారు. ఆశ్రమ నిర్వాహకులు స్వామి పూర్ణానంద సరస్వతికి కొందరు ఫోన్‌ చేసి ఒత్తిడి తీసుకొచ్చారు. రిటైర్డు పోలీస్‌ అధికారినీ రంగంలోకి దింపి అతనితో బెదిరించారు. ఆశ్రమాన్ని అప్పగించకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. చివరకు రెవెన్యూ అధికారులు కూడా ఆశ్రమానికి వచ్చి స్వామితో రాయబారాలు నడిపారు. దీంతో స్వామి నగరంలో పలువురు ప్రముఖుల్ని కలిసి తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నారు. 


1955లో ఆశ్రమ స్థాపన..

వెంకోజీపాలెంలో జాతీయ రహదారికి అతి సమీపంలో కొండవాలున 1955లో జ్ఞానానంద సరస్వతి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అందులో శివాలయం కూడా నిర్మించారు. శివాలయంతోపాటు సుబ్రమణ్యస్వామి, నవగ్రహ, అయ్యప్ప, వినాయక, రాజేశ్వరి ఆలయాలూ అక్కడ ఉన్నాయి. శివాలయంలో ధూప, దీప, నైవేద్యానికి స్థానికులు పీలా అప్పారావు, కోడి సన్యాసి ఆరు ఎకరాల భూమిని 1958 జూలై 12న దానం చేస్తూ  గిఫ్ట్‌ డీడ్‌ రాసిచ్చారు. అదే ప్రాంగణంలో పాఠశాల నిర్వహణ కోసం ఆశ్రమానికి ఆనుకుని 3.31 ఎకరాల కొండపోరంబోకు భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో గజం రిజిస్ర్టేషన్‌ విలువ ప్రకారం రూ.50 వేలు ఉంది.


కానీ, మార్కెట్‌ ధర మాత్రం గజం రూ.లక్ష వరకూ ఉంది. ఆ విధంగా ఆశ్రమ స్థలం విలువ అక్షరాలా  రూ.300 కోట్లు. జ్ఞానానంద సరస్వతి కాలం చేసిన తర్వాత ఆయన శిష్యుడు స్వామి పూర్ణానంద సరస్వతి 1980లో ఆశ్రమ బాధ్యతలు స్వీకరించారు. కాగా, తానిచ్చిన గిఫ్ట్‌డీడ్‌ను రద్దుచేయాలంటూ దాత పీలా అప్పారావు చేసిన అభ్యర్థనలను కోర్టు కొట్టివేసింది. ఆశ్రమంలోని పిల్లల విద్యా బోధనకు ప్రభుత్వం కొంతకాలం సాయం అందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయం అక్కర్లేదని 1986లో ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వానికి లేఖ రాశారు. స్థానిక దాతల నుంచి విరాళాలు సేకరించి పాఠశాలను సొంతంగా నిర్వహించారు. ప్రభుత్వ గుర్తింపు లేదని విద్యాశాఖ నోటీసు జారీ చేయడంతో తర్వాత ఆ పాఠశాలను ఎత్తివేశారు. మొత్తం 75 మంది విద్యార్థులలో 51 మంది స్థానిక ఆశ్రమంలో ఉంటూ సమీపంలోని జీవీఎంసీ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. మిగిలిన 24 మంది ఇదే ఆశ్రమానికి చెందిన భోగాపురం సమీప అక్కవరంలోని ఆశ్రమంలో ఉంటున్నారు. ఆశ్రమంలో గోశాల కూడా ఉంది.

 

ఆది నుంచీ బెదిరింపులు.. ఆక్రమణలు

ఆశ్రమానికి దాతలు ఇచ్చిన ఆరు ఎకరాలు, ప్రభుత్వం ఇచ్చిన 3.31 ఎకరాలు వెరసి 9.31 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఆక్రమణకు గురికావడంతో స్వామి విజ్ఞప్తి మేరకు 2010లో సర్వే విభాగం అధికారులు సర్వే చేశారు. ఇక్కడ 6.3 ఎకరాలే ఉందని, హెచ్‌బీ కాలనీ నిర్మాణంలో మూడు ఎకరాలు పోయిందని, అప్పట్లో స్వామి అభ్యంతరాలు చెప్పలేదని సర్వే అధికారులు తేల్చిచెప్పారు. కాగా, పడమర వైపున కొంత స్థలాన్ని కొందరు ఆక్రమించి, తప్పుడు సర్వే నంబర్లతో ప్రముఖ బిల్డర్‌(ప్రస్తుతం విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ-వైసీపీ)కి విక్రయించారు. ఎంవీవీ బిల్డర్స్‌ పేరుతో అక్కడ అపార్ట్‌మెంట్‌ నిర్మించారు.


ఆశ్రమ ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయంటూ 2009లో మానవ హక్కుల కమిషన్‌కు స్వామి ఫిర్యాదు చేయగా, ఆక్రమణలు తొలగించి, ఆస్తులు కాపాడాలంటూ జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ అధికారులను 2013లో కమిషన్‌ ఆదేశించింది. ఆ ఆదేశాలు అమలుకాక పోవడంతో స్వామి 2017లో ధిక్కార పిటిషన్‌ వేయగా,  ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది. కాగా, ఆశ్రమంలోని శివాలయాన్ని 2005లో దేవదాయశాఖ స్వాఽధీనం చేసుకుంది. ఆశ్రమంలోని పాఠశాల భవనాలను ఆలయ అర్చకులకు కేటాయించింది. ప్రస్తుతం ఆశ్రమమూ దేవదాయశాఖ ఆధీనంలో ఉందన్నట్టు బోర్డు ఏర్పాటు చేసింది. దీంతో దేవదాయశాఖపై స్వామి కోర్టులో పోరాడుతున్నారు. అప్పగించాలంటూ 

మంత్రుల లేఖలు!


ఆశ్రమాన్ని ప్రైవేటు ట్రస్టుకు అప్పగించాలని దేవదాయ, పర్యాటక శాఖల మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీ్‌పరాజ్‌.... దేవదాయ శాఖకు లేఖలు రాశారు. కొంతమంది కీలక వ్యక్తుల కోరిక మేరకే ఇలా చేసినట్టు తెలిసింది. ఆశ్రమంలోని శివాలయం దేవదాయ శాఖకు చెందినదని, అందువల్ల మొత్తం ఆశ్రమాన్ని ప్రైవేటు ట్రస్టుకు అప్పగించాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. దీంతో గతనెలలో విజయవాడ నుంచి దేవదాయ శాఖ అధికారి ఒకరు స్వామికి ఫోన్‌చేసి ఆశ్రమాన్ని అప్పగించాలని కోరారు. దీనిపై అప్పుడే కోర్టులో స్వామి వ్యాజ్యం వేయగా, స్టేట్‌స్‌ కో జారీచేసింది. రిటైర్డు పోలీస్‌ అధికారి ఒకరు రెండుమూడు పర్యాయాలు ఆశ్రమానికి వచ్చి పెద్దలతో గొడవలొద్దని బెరించారు. దీంతో 2 రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యేలు గంటా, వాసుపల్లిలకు సమస్యను స్వామి నివేదించారు. 


నాకు ప్రాణహాని

ఆశ్రమ స్థలంలో ఎంవీవీ సత్యనారాయణ(విశాఖ ఎంపీ), పీలా కోటేశ్వరరావు వేర్వేరుగా అపార్టుమెంట్లు నిర్మించారు. మరికొంత స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిని తొలగించాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం. పీలా కోటేశ్వరరావు పలుకుబడి ఉపయోగించి పలు రకాలుగా బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే  ఆశ్రమాన్ని ప్రైవేటు ట్రస్టుకు అప్పగించాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నది. దీంతో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆశ్రమాన్ని కాపాడాలని కోరాను. నాకు ప్రాణహాని ఉంది. ఆశ్రమాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని, మంత్రులను కోరుతున్నాను.


స్వామి పూర్ణానంద సరస్వతి,  ఆశ్రమ నిర్వాహకులు

Updated Date - 2020-02-18T09:07:59+05:30 IST