వాట్సాప్‌లో ప్రశ్నపత్రం...

ABN , First Publish Date - 2020-06-05T10:02:21+05:30 IST

జిల్లాలో గురువారం నుంచి పదో తరగతి రివిజనల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

వాట్సాప్‌లో ప్రశ్నపత్రం...

ఇంటి వద్దనే పరీక్షలు

ఆన్‌లైన్‌లో టెన్త్‌ రివిజన్‌ పరీక్షలు ప్రారంభం


రాజాం రూరల్‌, జూన్‌ 4 : జిల్లాలో గురువారం నుంచి పదో తరగతి రివిజనల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 10 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను ముందస్తుగా సిద్ధం చేసేందుకు విద్యాశాఖ ఏటా ‘రివిజన్‌ పరీక్షలు’ నిర్వహించేది. ఈ ఏడాది కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో ప్రభుత్వం పాత పరీక్ష విధానానికి స్వస్తి పలికింది. నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. వాట్సాప్‌లో ప్రధానోపాధ్యాయుల ద్వారా ప్రశ్నపత్రాలు అందజేసి.. విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో ఇంటివద్దనే పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు గురువారం పరీక్షలు నిర్వహించారు. గతంలో మాదిరి 11 రోజులు కాకుండా కేవలం ఆరు రోజుల్లో ఈ పరీక్షలు పూర్తి చేయనున్నారు. విద్యార్థులకు వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రాలను ప్రధానోపాధ్యాయులు అందజేశారు.


ఈ సౌకర్యం లేని విద్యార్థులు సమీపంలోని మరో విద్యార్థి వద్దకు వెళ్లి ప్రశ్నపత్రం తెలుసుకుని పరీక్షలు రాసేలా ముందస్తు సమాచారం అందించారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా జవాబులు రాసి.. ఆ పత్రాలను తిరిగి వాట్సాప్‌లోనే పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు. ఉదయం 9.30  నుంచి 12.45 గంటల వరకూ పరీక్ష నిర్వహించారు. జవాబుపత్రాలను స్వీయ మూల్యాంకన విధానంలో దిద్దనున్నారు. విద్యార్థి ఏయే సామర్థ్యంలో వెనుకబడి ఉన్నాడో నిర్ధారించేందుకు ముందుగా పరీక్షలు నిర్వహించడం ద్వారా తెలుసుకోవచ్చని డోలపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వి.వసంతకుమార్‌ తెలిపారు. 

Updated Date - 2020-06-05T10:02:21+05:30 IST