Queen Elizabeth II : ప్రధాన మంత్రులను నియమించడంలో బ్రిటిష్ క్వీన్ రికార్డు

ABN , First Publish Date - 2022-09-07T23:05:52+05:30 IST

బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 తన పాలనా కాలంలో 15 మంది ప్రధాన మంత్రుల

Queen Elizabeth II : ప్రధాన మంత్రులను నియమించడంలో బ్రిటిష్ క్వీన్ రికార్డు

లండన్ : బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 తన పాలనా కాలంలో 15 మంది ప్రధాన మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించి, రికార్డు సృష్టించారు. 1721 నుంచి 79 మంది ప్రధాన మంత్రులు బ్రిటన్‌ను పరిపాలించారు. వీరిలో 14 మంది తమ పదవీ కాలాలను క్వీన్ ఎలిజబెత్-2 పాలనా కాలంలోనే పూర్తి చేసుకున్నారు. ఈ జాబితాలోకి లిజ్ ట్రస్ కూడా చేరబోతున్నారు. ఆమె ఆ దేశానికి మూడో మహిళా ప్రధాన మంత్రి కూడా.


క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్‌ను సుదీర్ఘ కాలం పరిపాలించిన మోనార్క్‌గా రికార్డు సృష్టించారు. 1926లో జన్మించిన ఆమె పాలనా కాలంలో ప్రధాన మంత్రి పదవిని నిర్వహించిన వారు ఎవరంటే...


విన్‌స్టన్ చర్చిల్ (1951-55) : క్వీన్ పాలనలో ప్రధాన మంత్రి పదవిని నిర్వహించిన తొలి నేత విన్‌స్టన్ చర్చిల్. ఆయన 1940-45 మధ్య కాలంలో కింగ్ జార్జి-6 క్రింద కూడా  ప్రధాన మంత్రి పదవిని నిర్వహించారు. అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 


ఆంథోనీ ఈడెన్ (1955-57) : ఆంథోనీ 1955 ఏప్రిల్‌లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. అయితే ఓ ఏడాదిలోనే ఆయన అప్రూవల్ రేటింగ్స్ 70 శాతం నుంచి 40 శాతానికి తగ్గిపోయాయి.  తీవ్ర విమర్శలపాలైన ఆయన చివరికి 1957లో తన పదవికి రాజీనామా చేశారు. 


హెరాల్డ్ మెక్‌మిలన్ (1957-63) : ఆంథోనీ తర్వాత ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన హెరాల్డ్ మెక్‌మిలన్ అద్భుత పనితీరు కనబరిచారు. 1959 సాధారణ ఎన్నికల్లో ఆధిక్యతను సాధించారు. 


అలెక్ డగ్లస్-హోమ్ (1963-64) : ఈయన కేవలం 363 రోజులు మాత్రమే ప్రధాన మంత్రి పదవిని నిర్వహించారు. 


హెరాల్డ్ విల్సన్ (1964-70, 1974-76) : లేబర్ పార్టీ నేత హెరాల్డ్ విల్సన్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత విడాకులు, అబార్షన్, హోమోసెక్సువాలిటీ వంటివాటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన చట్టాలను తీసుకొచ్చారు. మరణ శిక్షలను కూడా నిషేధించారు. 


ఎడ్వర్డ్ హీత్ (1970-74) : పారిశ్రామిక, ఆర్థిక సంస్కరణలకు ప్రయత్నించిన ప్రధాన మంత్రిగా ఎడ్వర్డ్ హీత్ రికార్డు సృష్టించారు. ఇండస్ట్రియల్ రిలేషన్స్ యాక్ట్‌ను ఆయన ప్రభుత్వం తీసుకొచ్చింది. 


జేమ్స్ కలఘన్ (1976-79) : లేబర్ పార్టీ నేత జేమ్స్ కలఘన్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత నాలుగు ముఖ్యమైన పదవులను నిర్వహించి రికార్డు సృష్టించారు. ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్, హోం సెక్రటరీ, ఫారిన్ సెక్రటరీ, ప్రధాన మంత్రి ఈ నాలుగు పదవులను నిర్వహించిన ఏకైక ప్రధాని ఆయనే.


మార్గరెట్ థాచర్ (1979-90) : ‘ఉక్కు మహిళ’గా పేరు తెచ్చుకున్న మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 11 ఏళ్ళపాటు ఆ పదవిని నిర్వహించారు. 


జాన్ మేజర్ (1990-97) : జాన్ మేజర్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది. 


టోనీ బ్లెయిర్ (1997-2007) : లేబర్ పార్టీ నేత టోనీ బ్లెయిర్ కూడా సుదీర్ఘ కాలం ప్రధాన మంత్రి పదవిని నిర్వహించారు. నార్తర్న్ ఐరిష్ పీస్ ప్రాసెస్‌‌ను ఆయన పూర్తి చేయగలిగారు. 


గోర్డన్ బ్రౌన్ (2007-10) : లేబర్ పార్టీ నేత గోర్డన్ బ్రౌన్ ప్రపంచంలో మొట్ట మొదటి వాతావరణ మార్పుల చట్టాన్ని తీసుకొచ్చారు. 


డేవిడ్ కామెరూన్ (2010-16) : కన్జర్వేటివ్ పార్టీ నేత డేవిడ్ కామెరూన్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిన ఘనతను సాధించారు. పర్యావరణ హితకరమైన నిర్ణయాలు అమలు చేసిన ఘనత కూడా ఆయనదే. 


థెరీసా మే (2016-2019) : కన్జర్వేటివ్ పార్టీ నేత థెరీసా మే కూడా పర్యావరణాన్ని కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుని మంచి పేరు సంపాదించుకున్నారు. 


బోరిస్ జాన్సన్ (2019-22) : థెరీసా మే ప్రధాన మంత్రి పదవికి 2019లో రాజీనామా చేసిన తర్వాత బోరిస్ జాన్సన్ ఆ పదవిని చేపట్టారు. బ్రెగ్జిట్ ప్రాసెస్‌ను పూర్తి చేసి జనాదరణ పొందారు. 


లిజ్ ట్రస్ : బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్‌ను 2022 సెప్టెంబరు 6న క్వీన్ ఎలిజబెత్ -2 నియమించారు. సాధారణంగా ఈ కార్యక్రమం బకింగ్‌హాం ప్యాలెస్‌లో జరుగుతూ ఉండేది. కానీ ఈసారి స్కాట్లాండ్‌లోని  బల్మోరల్ ఎస్టేట్‌లో జరిగింది.


Updated Date - 2022-09-07T23:05:52+05:30 IST