గుంతల పేరుతో.. గంతలు

ABN , First Publish Date - 2021-07-25T05:19:05+05:30 IST

ఆ భూములు ఎన్నో దశాబ్దాల క్రితం వ్యవసాయ భూములుగా రికార్డుల్లో ఉండేవి. దశలవారీగా వాటిల్లో గనుల తవ్వకాలకు అనుమతులిస్తూ వచ్చారు.

గుంతల పేరుతో.. గంతలు

క్వారీ గుంతలను వ్యవసాయ భూములుగా మార్చే ప్రయత్నాలు

భారీ కుంభకోణానికి తెరచాటున ప్రయత్నాలు


గుంటూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఆ భూములు ఎన్నో దశాబ్దాల క్రితం వ్యవసాయ భూములుగా రికార్డుల్లో ఉండేవి. దశలవారీగా వాటిల్లో గనుల తవ్వకాలకు అనుమతులిస్తూ వచ్చారు. అనుమతించిన దాని కంటే ఐదు రెట్లకు పైగా ఖనిజాన్ని తవ్వేసి భారీ గుంతలుగా చేశారు. ఇక ఇప్పుడు వాటిని తిరిగి వ్యవసాయ భూములుగా కన్వర్షన్‌ చేసి బ్యాంకుల నుంచి పంట రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా పెట్టుబడి సాయం కొట్టేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతోన్నాయి. ఇందుకోసం ఒక నాయకుడు భారీ మొత్తంలోనే డీల్‌ కుదుర్చుకొన్నట్లు ఆరోపణలు గుప్పుమంటోన్నాయి. భూమి రికార్డుల్లో కనక అవి వ్యవసాయ భూములుగా మారాయంటే రూ. కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లే ప్రమాదం జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పొంచి ఉన్నది. 

జిల్లాలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఖనిజం తవ్వుకొని అమ్ముకొనేందుకు భారీ సంఖ్యలో పర్మిట్లు ఇచ్చారు. ఆ ఖనిజం ద్వారా ఆదాయం సమృద్ధిగా ఉండటంతో చాలామంది భూయజమానులు వ్యవసాయ భూముల నుంచి కన్వర్షన్‌ చేయించారు. ఎన్‌వోసీలు తెచ్చుకొని ఖనిజం తవ్వకాలు చేశారు. 20 అడుగుల లోతు వరకు అనుమతులు తెచ్చుకొని ఏకంగా 100 అడుగులకు పైగా ఖనిజాన్ని తవ్వేశారు. దీనిపై రాష్ట్ర గనుల శాఖకు ఫిర్యాదులు వెళ్లగా ప్రస్తుతం విచారణ జరుగుతోన్నది. 

ఒకసారి మైనింగ్‌ అనుమతులు ఇచ్చిన భూమి తిరిగి వ్యవసాయానికి పనికిరాదు. ఇందుకారణం అందులో 20 అడుగుల కంటే ఎక్కువ లోతులో గుంటలు ఏర్పడతాయి. కేవలం ల్యాండ్‌ ఫిలింగ్‌ చేసుకోవడానికి మాత్రమే అనుమతులు ఉంటాయి. ఒక విధంగా అవి నిరర్ధక భూములుగా మారిపోతాయి. అయితే వీటి ద్వారా ఆదాయం పొందేందుకు భారీ స్కెచ్‌ వేశారు. అడంగల్‌, ఆర్‌ఎస్‌ఆర్‌ తదితర భూమి రికార్డుల్లో తిరిగి వాటిని వ్యవసాయ భూములుగా మార్చితే పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అవుతాయి. తద్వారా ఏటా పంట రుణం తీసుకొనేందుకు ఆస్కారం ఉంటుంది. అలానే ఎకరానికి ఏటా రూ. 12,500 పంట పెట్టుబడిసాయంగా కూడా పొందవచ్చు. ఈ విధంగా 200 నుంచి 300 ఎకరాల వరకు క్వారీ గుంటలను వ్యవసాయ భూములుగా మార్చేందుకు పథకరచన జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని భూములను చేపల చెరువులుగా మార్చే ప్రయత్నం కూడా జరుగుతోన్నది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ పని చేస్తోన్న రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. 




Updated Date - 2021-07-25T05:19:05+05:30 IST