భూ వివాదంలో అడ్వకేట్ - భూ యజమానుల మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2021-02-23T14:26:25+05:30 IST

హైదరాబాద్: భూ వివాదంలో అడ్వకేట్ - భూ యజమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకుంది.

భూ వివాదంలో అడ్వకేట్ - భూ యజమానుల మధ్య వాగ్వాదం

హైదరాబాద్: భూ వివాదంలో అడ్వకేట్ - భూ యజమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ -7 లో నివాసముండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్ చౌదరి కొంతకాలంగా ఓ భూవివాదం కేసును డీల్ చేస్తున్నారు. ఇటీవల ఆ కేసును ఓడిపోవడం జరిగింది. మావద్ద లక్షల రూపాయల డబ్బు తీసుకుని అవతలి వాళ్లకు అమ్ముడుపోతావా అంటూ భూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో ఇరువురి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 16న సాయంత్రం 6 గంటల సమయంలో హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ -7 లో  అడ్వకేట్, భూ యజమానులు బాహాబాహీకి దిగారు. యజమానులకు చెందిన వ్యక్తులు కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఒకతను ఏకంగా అడ్వకేట్ తలపై రివాల్వర్ గురుపెట్టి చంపేస్తానంటూ దాడికి తెగబడ్డాడు. అయితే అప్పటికే వీరి అరుపులు.. కేకలతో చుట్టుపక్కల జనం అక్కడికి చేరుకోవడంతో కాస్త వెనక్కి  తగ్గారు. మూకుమ్మడిగా దాడి చేయడంతో అడ్వకేట్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎవరూ లేకపోతే తనను చంపేసే వారేనని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఇన్‌స్పెక్టర్ పాలేపల్లి రమేష్ కుమార్, ఎస్సై చంద్రశేఖర్ రెడ్డిలు గుట్టుచప్పుడు కాకుండా విచారిస్తున్నారు. స్ట్రీట్ నంబర్ -7 చూసే ఎస్సై నవీన్ ఉన్నప్పటికీ.. ఇటీవల బదిలీపై వచ్చిన మరో ఎస్సై చంద్రశేఖర్ రెడ్డికి ఈ కేసు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే దాడికి యత్నించిన ఇద్దరిని కాపాడినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-02-23T14:26:25+05:30 IST