‘కోవిడ్‌’ డాక్టర్లకు క్వారంటైన్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2020-04-10T11:10:22+05:30 IST

కోవిడ్‌-19 ఆస్పత్రిలో ఏడు రోజుల పాటు విధులు నిర్వర్తించిన డాక్టర్లు 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో

‘కోవిడ్‌’ డాక్టర్లకు క్వారంటైన్‌ తప్పనిసరి

కరోనా వైద్యసేవలకు ఐఎంఏ, ప్రైవేటు వైద్యులు సిద్ధంగా ఉండాలి

కలెక్టర్‌ భరత్‌ గుప్తా వెల్లడి


తిరుపతి (వైద్యం), ఏప్రిల్‌ 9: కోవిడ్‌-19 ఆస్పత్రిలో ఏడు రోజుల పాటు విధులు నిర్వర్తించిన డాక్టర్లు 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. డాక్టర్ల కుటుంబ సంక్షేమమే ప్రధానంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అదే సమయంలో హోమ్‌ క్వారంటైన్‌కు అనుమతి లేదని స్పష్టంచేశారు. డాక్టర్లకు ప్రత్యేక క్వారంటైన్‌గా వారికి కావాల్సిన గెస్ట్‌హౌస్‌లు, లాడ్జీలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కరోనా వైద్యసేవలపై గురువారం ఆయన తిరుపతిలో రుయా వైద్యాధికారులతో సమీక్షించారు. కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను ఆయునన అభినందించారు. మీకు అవసరమైన అన్నిరకాల పీపీఈ కిట్లు, మాస్కులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం చిత్తూరులోని కోవిడ్‌ ఆస్పత్రిలోనూ పాజిటివ్‌ కేసులను ఉంచామన్నారు. ఎక్కడా క్రిటికల్‌ కేసులు లేవన్నారు.


డాక్టర్లు పూర్తి సెక్యూరిటీతో వెళ్లి వైద్యసేవలు అందించాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి లేదా రుయా సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. రుయాలో రెండు రోజుల్లో మెడిసిన్‌ వార్డును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఐఎంఏ, ప్రైవేటు డాక్టర్లు, వైద్య సిబ్బంది జాబితా అందిందని, వారికి వేతనాలు ప్రభుత్వమే అందించనుందన్నారు. ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు రాగానే వీరంతా విధుల్లోకి రావాలన్నారు. ఓపీలో విధులు నిర్వహిస్తున్న వారూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే క్వారంటైన్‌కు పంపాలని సూచించారు.


అవసరాన్ని బట్టి నెగెటివ్‌ కేసులను ఈఎస్‌ఐ, అమర ఆస్పత్రులను క్వారంటైన్లుగా ఉపయోగించుకునేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రసూతి ఆస్పత్రికీ అవసరమైన హెల్త్‌ సీఫ్టీ మెటీరియల్‌ అందించాలన్నారు. మొదటి కరోనా పాజిటివ్‌ వచ్చిన యువకుడిని డిశ్చార్జి చేస్తున్నామని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణయ్య కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా.. ఇది మీ(డాక్టర్లు) విజయమని, ఇదే స్ఫూర్తితో వైద్య సేవలందించాలని అభినందించారు. 

Updated Date - 2020-04-10T11:10:22+05:30 IST