క్వారంటైన్‌.. క్లోజ్‌

ABN , First Publish Date - 2020-05-23T08:57:41+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్స్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే వారిని

క్వారంటైన్‌.. క్లోజ్‌

మూసివేత దిశగా కేంద్రాలు

జిల్లాలో రెండు మినహా అన్ని ఖాళీనే

భోజనం సరఫరా నిలిపేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు

వీటికి ప్రత్యామ్నాయంగా సచివాలయాల్లో 10 బెడ్లతో ఏర్పాటు


గుంటూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్స్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌ చేసేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలను అధికార యంత్రాంగం మూసివేస్తోన్నది. లాక్‌డౌన్‌ 4.0లో ఆంక్షలు సడలించడం, పాజిటివ్‌ కాంటాక్ట్స్‌ని కూడా హోం ఐసోలేషన్‌లోనే పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో ఏర్పాటు చేసిన 38 క్వారంటైన్‌ కేంద్రాలను మూసివేయనున్నారు. 


 జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాలు ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, ఇంనీరింగ్‌, కామర్స్‌ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఒక పాజిటివ్‌ కేసు వస్తే దాదాపుగా 60 నుంచి 80 మంది కాంటాక్ట్స్‌ని గుర్తించి వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. అక్కడ 14 నుంచి 20 రోజుల పాటు ఉంచి భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. క్వారంటైన్‌ వ్యవధిలో రెండు సార్లు స్వాబ్‌ టెస్టు చేసి నెగెటివ్‌ వచ్చిన వారిని తిరిగి ఇళ్లకు పంపించారు. అయితే ఇందుకోసం ఖర్చు తడిసి మోపెడంత అవుతోన్నది.


ఇప్పటికే భోజనాలు, ఇతరత్రా ఖర్చులకు రూ.3 కోట్లకు పైగా వ్యయం జరిగింది. మరోవైపు క్రమక్రమంగా సాధారణ పరిస్థితులకు ప్రజాజీవనాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం సడలింపులు ఇస్తూ వస్తోన్నది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల్లో ఉన్న క్వారంటైన్‌ కేంద్రాలను ఎత్తి వేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే దాదాపు 36 మూసి వేసినట్లుగా అధికారవర్గాలు  తెలిపాయి.   అడవితక్కెళ్లపాడులోని ఎన్‌టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌, నంబూరులోని వీవీఐటీ మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు చెప్పారు. త్వరలో ఈ రెండు కూడా మూసి వేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు క్వారంటైన్‌ కేంద్రాలకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్‌ని కూడా ఫుడ్‌ ప్యాకెట్స్‌ సరఫరా నిలిపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ కేంద్రాలకు ప్రత్యామ్నాయంగా సచివాలయాల్లో 10 బెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.  

Updated Date - 2020-05-23T08:57:41+05:30 IST