క్వారంటైన్‌ కేంద్రాలు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2020-05-12T11:01:20+05:30 IST

ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ఆయా జిల్లాల వారీగా క్వారంటైన్‌ కేంద్రాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర

క్వారంటైన్‌ కేంద్రాలు సిద్ధం చేయాలి

వీసీలో కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్సు కమిటీ చైర్మన్‌ క్రిష్ణబాబు


కడప (కలెక్టరేట్‌), మే 11: ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ఆయా జిల్లాల వారీగా క్వారంటైన్‌ కేంద్రాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర టాస్క్‌ఫోర్సు కమిటీ చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు ఆదేశించారు. సోమవారం విజయవాడ నుంచి కోవిడ్‌-19 అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో జిల్లా నుంచి కోవిడ్‌-19 జిల్లా ప్రత్యేకాధికారి శశిభూషణ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్సు చైర్మన్‌ మాట్లాడుతూ విదేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, ఇందులో గల్ఫ్‌ దేశాల నుంచి 65 శాతం మంది వచ్చే వారున్నారన్నారు.


ఇతర దేశాల నుంచి విమానం రాగానే రిసెప్షన్‌ టీం ఉంటుందని, అక్కడే వారందరికీ పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. 15-20 వేల మంది విదేశాల నుంచి వచ్చే అవకాశం ఉందని, జిల్లాల వారీగా వారిని క్వారంటైన్లలో ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. అంతర రాష్ట్ర రవాణాకు సంబంధించి ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించనుందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు స్పందన ఆన్‌లైన్‌ ఫోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్‌ జాబితాలో చెక్‌పోస్టు, రైల్వేస్టేషన్‌ వివరాలు పక్కాగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జేసీ గౌతమి, జేసీ-2 శివారెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ శ్రీవాస్‌నూపూర్‌, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.ఉమా సుందరి, వివిధ నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-12T11:01:20+05:30 IST