క్వాలిటీ.. కనిపించదేమిటీ!

ABN , First Publish Date - 2022-05-26T04:13:45+05:30 IST

పరిగి మునిసిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తోంది. చేపట్టిన పనులు అవినీతికి కేరాఫ్‌గా మారుతున్నాయి. అంగబలం, అర్థలబలం ఉంటే ఏం చేసినా నడుస్తుందన్న నానుడిగా పనులు జరుగుతున్నాయి.

క్వాలిటీ.. కనిపించదేమిటీ!
రోడ్డువిస్తరణలో నాణ్యత లోపించిన డివైడర్‌ పనులు

  • పరిగి మునిసిపాలిటీ అభివృద్ధి పనుల్లో లోపించిన నాణ్యత
  • ఇసుకకు బదులు డస్ట్‌ వాడకం
  • రోడ్డు విస్తరణ పనుల్లో ఇష్టారాజ్యం!
  • నిబంధనలకు తూట్లు.. 
  • అటు పనులు... ఇటు మరమ్మతులు
  • తొమ్మిది నెలల గడువు..
  •  మూడేళ్లు గడిచినా పూర్తికాని పనులు

పరిగి మునిసిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తోంది. చేపట్టిన పనులు అవినీతికి కేరాఫ్‌గా మారుతున్నాయి.  అంగబలం, అర్థలబలం ఉంటే ఏం చేసినా నడుస్తుందన్న నానుడిగా పనులు జరుగుతున్నాయి.  ముందు పనులు చేసుకుంటూపోతుంటే, వెనుక నుంచి కూలిపోతున్నాయంటే  పనుల నాణ్యత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.

పరిగి, మే 25(ఆంధ్రజ్యోతి): పరిగి మునిసిపాలిటీ పరిధిలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులు అవినీతికి కేరా్‌ఫగా మారాయి. మునిసిపాలిటీలో ప్రధాన పనులను మంత్రి కేటీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించారు. ఇట్టి పనులను స్థానిక ఇంజనీరింగ్‌ అధికారులు కాకుండా, హెడ్‌క్వార్టర్‌లో ఉండే ప్రత్యేక విభాగం ఇంజనీర్లతో పనులు చేయిస్తున్నారు. అయినా కేటీఆర్‌ ఆదేశాలను కూడా ఇక్కడ లెక్కచేయడం లేదు. స్థానికంగా అంగబలం, అర్థలబలం ఉంటే ఏం చేసినా నడుస్తుందన్న నానుడిగా పనులు జరుగుతున్నాయి. వివిధ స్థాయిల్లో కమీషన్ల కక్కుర్తి వల్లనే ఇలా జరుగుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి పనుల్లో గుత్తేదారు నిబంధనలను తుంగలో తొక్కి నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగు కాలాలపాటు  మన్నికగా ఉండాల్సిన పనులు మున్నాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి. ముందు పనులు చేసుకుంటే పోతుంటే, వెనుక నుంచి కూలిపోతున్నాయంటే పనుల నాణ్యత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. తహసీల్దార్‌ కార్యాలయం మీదుగా టెలిఫోన్‌ ఎక్స్ఛెంజ్‌ వరకు, అంబేద్కర్‌ విగ్రహం నుంచి గాంధీవిగ్రహం, గాంధీ విగ్రహం నుంచి పోస్టాఫీసు, తహసీల్దార్‌ కార్యాలయం వరకు బీటీ, సీసీ, ఇరుపక్కల మురుగు కాలువలు, స్ట్రీట్‌ లైట్ల ఏర్పాటు కోసం కోసం వివిధ బిట్‌ కోడ్‌లలో రూ.10 కోట్లు మంజూరీ చేసింది. ఈ పనులకు జూలై, 27, 2019లో శంకుస్థాపన చేశారు. అయితే తొమ్మిది నెలల గడువు మాత్రం ఇచ్చారు. కానీ రెండు, మూడుసార్లు పరిమితకాలం పెంచుతూ వచ్చారు.  ఇలామూడేళ్లు గడస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. రూ.10 కోట్లు విలువ చేసే పనులు పరిగి మునిసిపల్‌ పరిధిలోనే కొనసాగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులతోపాటు, ఇరువైపుల మురుగు కాలువల నిర్మాణం, డివైడర్లు, స్ట్రీల్‌ లైౖట్ల  పనులు జరుగుతున్నాయి. ఈ పనులను గుత్తేదారు ఇష్టారాజ్యంగా చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీసీ రోడ్డు నిర్మాణం అయితే గతంలో ఉన్న తారురోడ్డుపైనే వేశారు. రోడ్డుకు ఇరు పక్కల  మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. అయితే వాటిని నిర్మించకుండానే సీసీ రోడ్డును వేస్తున్నారు. అంతేకాకుండా ఈ పనుల్లో  ఇసుక కాకుండా డస్ట్‌తోనే పనులు చేపడుతున్నారు. దీంతో ముందుగా నిర్మించుకుంటూ పోతుంటే, వెనుకాల నుంచి శిథిలమైపోతున్నాయి. దీంతో కోట్ల రూపాయలు ఖర్చు  చేసి చేపడుతున్న నిర్మాణాలు అనతికాలంలోనే దెబ్బతింటున్నాయి. చూసిన వారంతా ఇవేమి పనులని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులు కళ్ళ్లు మూసుకున్నారా..? లేక చూసి ఊరుకుంటున్నారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

 లోపించిన నాణ్యత

 మురుగు కాలువలు, డివైడర్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించడం లేదు. సిమెంట్‌, కంకర, ఇసుక సరైన పాళ్లలో కలపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అసలు సీసీ పనుల్లో ఇసుకకు బదులు డస్ట్‌ను వినియోగిస్తున్నారు. సీసీ, సైడ్‌డ్రెన్‌ పనుల నిర్మాణాలు చేపట్టిన వారంపది రోజుల్లోనే దెబ్బతింటున్నాయి. విస్తరణ పనులు, ఇతర నిర్మాణాలు చేపట్టిన తర్వాత వాటర్‌ క్యూరింగ్‌ అసలు చేపట్టడం లేదు. వాహనాల రాకపోకలతో నెర్రలు బారుతున్నాయి.  చేపట్టిన అభివృద్ధి పనులు నాలుగు కాలాలు నాణ్యతగా ఉండడానికా.. లేదా గుత్తేదారుల లాభం కోసమా? స్థానికులు ప్రశ్నిస్తు న్నారు. 

గంప ఇసుక వేస్తే ఒట్టు

విస్తరణ పనుల్లో ఇసుక వాడాల్సి ఉన్నా.. ఇప్పటి వరకూ  గంప సాండ్‌  కూడా వాడలేదనేది నగ్నసత్యం. ఇప్పటికే మూడుకోట్ల విలువ చేసే పనులు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఒక్క ట్రాక్టర్‌ ఇసుక కూడా వాడలేదు. డస్ట్‌తో చేపట్టే పనులు అప్పుడే దెబ్బతింటున్నాయి. రికార్డుల్లో ఇసుక వాడినట్లు  రాసుకుంటున్నారు.  అధికారులు, పాలకులు, గుత్తేదారు కలిసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నాణ్యత, పనుల్లో జాప్యంపై ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ సీపీఎంల ఆధ్వర్యంలో పలు మార్లు ధర్నాలు, ఆందోళనలు చేపట్టినా అధికారుల్లో స్పందన లేకపోవడం శోచనీయం

 లైటింగ్‌ పనుల్లోనూ ఇష్టారాజ్యం!

టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ఏర్పాటు చేస్తున్న సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ పనులు కూడా ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. ఇందుకు రూ.60 లక్షలు వ్యయం చేస్తున్నారు. లైటింగ్‌లో భాగంగా ిఫిల్లర్ల ఏర్పాటు బేస్‌ సరిగ్గా లేదని తెలుస్తోంది. గాలివానకు కూలిపోయే అవకాశం ఉంది. పైపులు, వైరింగ్‌, ఫిల్లర్‌ పైపులు కూడా నాణ్యతగా లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ పనుల్లో సాంకేతికపరమైన నిబంధనలు పాటించకపోతే నిరుపయోగంగా మారే అవకాశం లేకపోలేదు.  

అధికారులు ఏం చేస్తున్నారు?:మీర్‌మహమూద్‌అలీ, మాజీ జడ్పీటీసి, పరిగి

పరిగి పట్టణంలో  కోట్ల విలువ చేసే  అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించింది. డివైడర్‌ పనులు  అయితే వంకర టింకరగా చేపట్టారు. ఇసుకకు బదులు డస్ట్‌ వాడుతున్నారు.  ఇంత తతంగం నడుస్తున్నా అధికారులు కళ్లు ముసుకున్నారా? లేక గుత్తేదారుకు వత్తాసు పలుకుతున్నారా తెలియడం లేదు. ఉన్నతాధికారులు  రోడ్డు విస్తరణపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి.

పనుల నాణ్యతపై విచారణ జరిపించాలి:ఇ.కృష్ణ, పట్టణ కాంగ్రెస్‌ అఽధ్యక్షుడు, పరిగి

రోడ్డు విస్తరణ పనుల్లో అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. గుత్తేదారు పనులను ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. మూడేళ్లుగా జాప్యం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో జాప్యం, నాణ్యత లేకపోవడంపై హెచ్‌ఆర్సీ, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.  ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం: సాజిద్‌, డీఈఈ, మునిసిపల్‌ శాఖ

పనుల్లో జాప్యం వాస్తవమే. కాంట్రాక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నాం. అయితే పరిస్థితులను బట్టి గడువును పెంచుకుంటూ వచ్చాం. ఇప్పటికే 70శాతం బిల్లులు పేమేంట్‌ చేశాం. దెబ్బతిన్న పనులను తిరిగి చేయిస్తున్నాం. రికార్డులు ఎక్కువగా చేస్తున్నట్లు వస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇచ్చిన గడువులోపు పూర్తి చేయకపోతే గుత్తేదారుపై చర్యలు తీసుకుంటాం. 


Updated Date - 2022-05-26T04:13:45+05:30 IST