కొవిడ్‌ సెంటర్లలో నాణ్యమైన వైద్యం

ABN , First Publish Date - 2020-07-07T08:43:08+05:30 IST

కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన వైద్య సేవలందించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.

కొవిడ్‌ సెంటర్లలో  నాణ్యమైన వైద్యం

సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలి

ఔషధాల విషయంలోనూ రాజీపడొద్దు

అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం


అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన వైద్య సేవలందించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం  సీఎస్‌ నీలం సాహ్ని,  వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ తదితరులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలని ఆదేశించారు. కరోనా బారిన పడినవారికి అందిస్తున్న సదుపాయాలు, ఔషధాల్లో రాజీ పడకూడదన్నారు. వారికి అత్యంత మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.


కేసులు ఎక్కువున్న ప్రాంతాల్లో ఇంటింటి సర్వే..

కాగా, కొవిడ్‌ కేసులు ఎక్కువగా గుర్తించిన ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు,  ఆశావర్కర్లు, గ్రామ/వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు ఆరా తీయాలని సీఎం ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, అవసరమైన మందులు అందించాలని సూచించారు. కరోనా వైర్‌సపై ప్రజల్లోని భయాందోళనలు తొలగించేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్న మనోధైర్యం వారిలో కల్పించాలన్నారు. కాగా, కరోనా మైల్డ్‌ పాజిటివ్‌ వచ్చినవారికి వైద్య సేవలందించేందుకు అన్ని జిల్లాల్లో 3000-4000 బెడ్లు సిద్ధం చేశామని అధికారులు వివరించారు.


వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని  సీఎం సూచించారు. ‘రోజంతా వైద్య సేవలందించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన మందులు ఇవ్వాలి.  అధికారులు విస్తృత ప్రచారం చేస్తూ హోర్డింగులు పెట్టాలి.  మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి. ఏమాత్రం అనుమానం వచ్చినా టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి.. తగిన పరీక్షలు చేయించుకోవడం.. ఇళ్లలోనే ఉంటూ చికిత్స చేయించుకోవచ్చన్న విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. గ్రామ సచివాలయాల్లో ఫోన్‌ నంబర్లన్నీ ఉంచాలి’ అని సీఎం ఆదేశించారు. 

Updated Date - 2020-07-07T08:43:08+05:30 IST