విద్యార్థులందరికీ నాణ్యమైన ‘భోజనం’

ABN , First Publish Date - 2021-12-03T06:00:27+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ అన్నారు.

విద్యార్థులందరికీ నాణ్యమైన ‘భోజనం’
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న డీఈవో చంద్రకళ

డీఈవో చంద్రకళ

తగరపువలస, డిసెంబరు 2: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ అన్నారు. గురువారం చిట్టివలస జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులూ రోజుకొక వంటకాన్ని విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. రోజూ గుడ్లు, వేరుశనగపప్పు చక్కీలను ఇస్తున్నామన్నారు. నిర్ణయించిన మెనూ ప్రకారం ఏమి వంట చేశారో ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయడానికి ఐఎంఎంఎస్‌ పేరుతో ఒక యాప్‌ను రూపొందించామని పేర్కొన్నారు. దీనిని పర్యవేక్షించేండుకు బృందాలను నియమించామన్నారు. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులను వారి అవగాహన స్థాయిల ఆధారంగా గ్రేడ్‌లుగా విభజించి ఉదయం, సాయంత్రం చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణనిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయులతో డీఈవో సమావేశమై బోధించే పాఠాలకు సంబంధించి టీచింగ్‌ నోట్స్‌ తయారుచేయాలని సూచించారు. హెచ్‌ఎం మురళీమోహన్‌ పాఠశాలకు సంబంధించిన పలు అంశాలను డీఈవోకు వివరించారు.


Updated Date - 2021-12-03T06:00:27+05:30 IST