నాణ్యమైన విద్యే ఎన్‌ఈపీ లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-25T07:43:43+05:30 IST

నాణ్యమైన విద్యావ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్రాలు కృషి చేయాలని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020 చైర్మన్‌ కస్తూరి రంగన్‌ సూచించారు

నాణ్యమైన విద్యే ఎన్‌ఈపీ లక్ష్యం

మెరుగైన విద్యావ్యవస్థ కోసం రాష్ట్రాలు కృషి చేయాలి 

దేశ ఔన్నత్యం, సమగ్రత పెరిగేలా నూతన విధానం 

ఈ పాలసీని దేశంలో అన్ని వర్సిటీలు అమలు చేయాలి 

ఎస్‌ఆర్‌ఎం సెమినార్‌లో ఎన్‌ఈపీ చైర్మన్‌ కస్తూరి రంగన్‌ 


అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన విద్యావ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్రాలు కృషి చేయాలని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020 చైర్మన్‌ కస్తూరి రంగన్‌ సూచించారు. ‘21వ శతాబ్దంలో శక్తిమంతమైన సమాజ నిర్మాణం’ అంశంపై ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రత్యేక విశిష్ట ప్రసంగ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది. ముఖ్య అతిథి కస్తూరి రంగన్‌ ప్రసంగిస్తూ... తరగతి గదిలో అత్యంత నాణ్యమైన విద్యా బోధన అందుబాటులో ఉండాలన్నదే ఎన్‌ఈపీ లక్ష్యంగా పేర్కొన్నారు. దేశ ఔన్నత్యం, జాతీయత, సమగ్రత పెరిగేలా నూతన విద్యావిధానం రూపుదిద్దుకుందన్నారు. విద్యార్థుల్లో సృజన, విజ్ఞానం, క్రమశిక్షణ పెరిగే నూతన విద్యా విధానాన్ని పరిచయం చేశామన్నారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు సృజన, పరిశోధనతో కూడిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని అమలు చేయాలని సూచించారు. విద్యా బోధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దీనికోసం కృషి చేయాలని కోరారు. ఏఐ, త్రీడీ టెక్నాలజీ, మెషీన్‌ లెర్నింగ్‌ కోర్సులను ప్రోత్సహించాలన్నారు. నాణ్యమైన విద్యాబోధన, పరిశోధనా రంగాల్లో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ సాధిస్తోన్న ప్రగతి, కృషిని ఆయన కొనియాడారు. 


ఏపీలో విద్యారంగ పురోభివృద్ధి కోసం చేపడుతున్న సంస్కరణలు ప్రశంసనీయమన్నారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగానికి ఏటా రూ.30వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నామని, వినూత్న సంస్కరణలు చేపట్టి విద్యారంగ వ్యవస్థను పటిష్ఠ పరుస్తున్నామన్నారు. దేశంలో మొదటిసారిగా ఎన్‌ఈపీ మార్గదర్శకాలను అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ అని మంత్రి పేర్కొన్నారు. అనంతరం కస్తూరి రంగన్‌కు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ వి.ఎ్‌స.రావు ఆన్‌లైన్‌లో జ్ఞాపికను ప్రదానం చేశారు. మంత్రి సురేశ్‌కు ‘స్పేస్‌ అండ్‌ బియాండ్‌ ప్రొఫెషనల్‌ వాయిస్‌ ఆఫ్‌ కస్తూరి రంగన్‌’ పుస్తకాన్ని వర్సిటీ ప్రో వైస్‌ చాన్సలర్‌ నారాయణరావు ఆన్‌లైన్‌లో అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ జనరల్‌ ప్రెసిడెంట్‌ విజయలక్ష్మీ సక్సేనా, ఎస్‌ఆర్‌ఎం రిజిస్ట్రార్‌ వినాయక్‌ కల్లూరి, సీఎ్‌సఈ హెచ్‌ఓడీ రఘునాథన్‌, వివిధ వర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లు, పరిశోధనా రంగ నిపుణులు పాల్గొన్నారు.


ఇంగ్లీషు మీడియం పెట్టినా..తెలుగు ఔన్నత్యాన్ని కాపాడతాం: మంత్రి సురేశ్‌


గుంటూరు, జూలై 23: రాష్ట్రంలో పాఠశాల స్థాయిలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టినప్పటికీ తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడతామని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆధ్వర్యంలో గుంటూరులో శనివారం జరిగిన గుర్రం జాషువా 50వ వర్ధంతికి హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గుంటూరులో జాషువా నివశించిన ఇంటిని స్మారక భవనంగా మార్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. రాబోయే కొత్త జిల్లాల్లో ఒకదానికి జాషువా పేరు పెట్టాలని మాణిక్యవరప్రసాద్‌ కోరారు.

Updated Date - 2021-07-25T07:43:43+05:30 IST