క్వాడ్: చైనాపై భారత్ దౌత్య విజయం

ABN , First Publish Date - 2021-03-25T06:18:37+05:30 IST

భారత్ దౌత్య విధానాలు, విజయాల పరంపరలో ఇటీవల జరిగిన ‘క్వాడ్‌’ (ఖ్ఖఅఈ) సమావేశాలు మరొక కలికితురాయి. ఇండో పసిఫిక్‌ సముద్రక్షేత్రంలో మితిమీరుతున్న...

క్వాడ్: చైనాపై భారత్ దౌత్య విజయం

భారత్ దౌత్య విధానాలు, విజయాల పరంపరలో ఇటీవల జరిగిన ‘క్వాడ్‌’ (ఖ్ఖఅఈ) సమావేశాలు మరొక కలికితురాయి. ఇండో పసిఫిక్‌ సముద్రక్షేత్రంలో మితిమీరుతున్న చైనా ఆగడాలను నియంత్రించడానికి భారత్‌, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లు ‘క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ పేరిట మొదలు పెట్టిన ప్రయత్నాలు ప్రస్తుతం ఒక నిర్ణయాత్మక స్థితికి చేరుకున్నాయి. ఇండో పసిఫిక్‌ సముద్రక్షేత్రంలో దుందుడుకు తనంతో తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న చైనాను నియంత్రించి ఈ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడంతో పాటు శాంతి, భద్రత, శ్రేయస్సులను ప్రోత్సహించడంలో భారత్‌ క్రియాశీలక పాత్రను పోషిస్తున్నది. 


నిరంతర చర్చల ఫలితంగా ఇండో–పసిఫిక్‌ సముద్ర తీరంలో చైనా యుద్దోన్మాదాన్ని నిలువరించడం కోసం 2017 నవంబర్‌లో ‘క్వాడ్‌’ స్థాయీ రూపం సంతరించుకున్నది. క్వాడ్‌ ఏర్పాటును చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. నాటో సైనిక కూటమికి ఇది ఆసియా ప్రతిరూపమని విమర్శించింది. నాలుగు ప్రాధాన్యత కలిగిన ప్రజాస్వామ్య దేశాలు కలిసి క్వాడ్‌ను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం చైనాకు బాగా తెలుసు. అందుకే క్వాడ్‌ ఏర్పాటు కాకుండా ఉండేందుకు విశ్వప్రయత్నం చేసింది. 


అయితే భారత్‌ అందించిన ప్రోత్సాహంతో కారణంగా 2021 మార్చ్ 21న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశం జరిగింది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ జరిగినప్పటికీ ప్రపంచ పటంపై అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశం ఇది. క్వాడ్‌లోని నాలుగు దేశాలలో కేవలం భారత్‌తో మాత్రమే చైనాకు సరిహద్దు వివాదాలున్నాయి. ఈ భౌగోళిక వివాదాలను అడ్డం పెట్టుకుని క్వాడ్‌లో భారత్‌పట్ల దురభిప్రాయాలను కలిగించడానికి చైనా అనేక విధాల ప్రయత్నించింది. అయితే భారత్‌ అవలంభించిన బలమైన విధానాల కారణంగా చైనా పన్నాగాలు ఫలించలేదు. క్వాడ్‌ నుంచి భారత్‌ను తప్పించేందుకు గాను చైనా ఏకపక్షంగా సరిహద్దు వివాదాలను సృష్టించింది. భారత సరిహద్దులలోకి అన్యాయంగా చొచ్చుకునివచ్చి అంతర్జాతీయ వివాదాలకు తెరలేపుదామని ప్రయత్నించింది. ఈ దుష్ట పన్నాగాలలో భాగంగా డోక్లాం, వుహాన్‌, కులప్పరం, లడఖ్‌ వివాదాలను సృష్టించే యత్నం చేసింది. అయితే చైనా కుట్రలను చొరబాట్లను భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. పైగా చైనా దుందుడుకు విధానాలకు వ్యతిరేకంగా అం తర్జాతీయ అభిప్రాయాలను కూడ గట్టింది. చైనాను ఏకాకిని చేసే ప్రయత్నంలో భారత్‌ విజయం సాధించింది. అన్ని రంగాలలోను చైనాను నిలువరించాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలు గుర్తించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందులో ఒక బలమైన మెట్టు క్వాడ్‌ సమావేశం. 


చైనా విస్తరణ వాదానాకి బలైన దేశాలలో ఫిలిప్పీన్స్‌, వియత్నాం ఉన్నాయి. చైనాను నిలువరించడానికి చిన్న దేశాలైన వీటికి బలం సరిపోలేదు. చైనాకు భయపడే దేశాలు వీటికి అండగా నిలువడానికి ముందుకు రాలేదు. దీంతో చైనా దాష్టీకాలను ఈ చిన్న దేశాలు భరిస్తూ వచ్చాయి. క్వాడ్‌ ఏర్పాటుతో ఈ చిన్న చిన్న దేశాలలో మనోధైర్యం వచ్చింది. తమకు మద్దతుగా నిలబడడానికి ప్రపంచ దేశాలు ఉన్నాయన్న నమ్మకం బాధిత దేశాలకు కలిగింది. 


ప్రపంచంపై ఆధిపత్యం వహించడం తన జన్మహక్కుగా భావిస్తున్న చైనాకు క్వాడ్‌ ఏర్పాటు ఆశనిపాతంగా తగిలింది. చైనా అండ చూసుకుని రెచ్చిపోతున్న పాకిస్థాన్‌ కూడా క్వాడ్‌ ఏర్పాటు తరువాత కొంత వెనకడుగు వేసింది. చైనా తన సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా పలు పొరుగు దేశాల సరిహద్దుల వెంట రోడ్ల నిర్మాణం మొదలుపెట్టింది. ఇందులో పాకిస్థాన్ ను కూడా తన అవసరాలకు ఉపయోగించుకున్నది. దీంతో పాటు దక్షిణ చైనా సముద్ర ప్రాం తంలో కూడా సైనికపాటవాన్ని పెంచుకుంటూ పోయింది. కాంగ్రెస్‌ హయాంలో చైనా చేతిలో భారత్‌ మోసపోతూనే వచ్చింది. మొదటిసారిగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత చైనా ఆటలకు అడ్డుకట్ట పడింది. క్వాడ్‌ను ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన దేశాలు కూడా ప్రజాస్వామ్య దేశాలే. చైనాలో ప్రజాస్వామ్యం ఆనవాళ్లు కూడా కనపడవు. క్వాడ్‌ ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే. చైనా సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షకు బలమైన అడ్డుకట్ట వేయడమే. 2019లో మలబార్‌ ప్రాం తంలో క్వాడ్‌దేశాలు సంయుక్త నౌకా విన్యాసాలు చేసినపుడే క్వాడ్‌ తనకు వ్యతిరేకంగా బలమైన శక్తిగా ఆవిష్కృతమవుతున్నదన్న సంగతి చైనా తెలుసుకున్నది. 


వాస్తవానికి చైనాకు పొరుగుదేశాలతో భౌగోళిక సరిహద్దులపై వివాదాలకంటే సముద్ర జలాలపై ఆధిపత్యం చాలా అవసరం. ముఖ్యంగా ఇండో పసిఫిక్‌ సముద్రక్షేత్రంలో చైనాకు బలమైన స్థావరాలు చాలా అవసరం. చైనా ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వ్యాపారాలు సముద్రయానంపైనే ఆధారపడి ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. చైనా ఉత్పత్తులను ప్రపంచం నలుమూలలకు పంపడానికి సముద్ర మార్గమే సులువైన చవకైన మార్గం అందుకే మొదటి నుంచి ఇండో–పసిఫిక్‌ క్షేత్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ వచ్చింది. క్వాడ్‌ ఏర్పాటుతో ఇపుడు ఆ ప్రయత్నాలకు గండిపడే అవకాశమున్నది. క్వాడ్‌ ఒక స్థాయీ రూపం సంతరించుకుంటున్న సమయంలో అనేక ఐరోపా దేశాలు ఇండో–పసిఫిక్‌ క్షేత్రంలో తమ వ్యూహాలను, ప్రణాళికలను రూపొందించుకుని ప్రకటిస్తూ రావడం కూడా చైనాకు పెద్ద దెబ్బ. 


ఇండో–పసిఫిక్‌ క్షేత్రం మధ్యలో భారత్‌ ఉన్నది. అంటే చాలా కీలకమైన ప్రదేశంలో ఉన్నది. దీనికితోడు అనేక దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నది. ఒకవేళ ఏదైనా సమయంలో చైనా దేశం భారత సరిహద్దులను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే ఇందుకు ప్రతిగా సముద్ర మార్గంలో చైనా వాణిజ్య వ్యాపారాలను దాదాపుగా స్తంభింపజేసే బలం భారత్‌కు ఉంది. పైగా ఇతర దేశాల మద్దతును కూడగట్టగలిగే స్థితిలో ఉన్నది. క్వాడ్‌లో భారత్‌ ప్రాతినిథ్యం పట్ల చైనా భయపడడానికి కూడ ప్రధాన కారణం ఇదే. ఇండో–పసిఫిక్‌ క్షేత్రంలో చైనా సామ్రాజ్యవాద కాంక్షలను నిలువరించడానికి ప్రపంచ దేశాల ముందు భారత్‌ను మించిన బలమైన, నమ్మకమైన శక్తి మరొకటి లేదు. ఈ విషయం కూడా చైనాకు బాగా తెలుసు. 


ఇండో–పసిఫిక్‌ క్షేత్రంలో సమగ్రమైన అభివృద్ధితో పాటు శాంతి సుస్థిరతల ఏర్పాటు కోసం భారత్‌ విస్తృత స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అన్ని దేశాల ఆర్థిక వికాసానికి తోడ్పడేలా, ఒకరికొకరు సహకారం అందించుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చైనా దేశాల ఆర్థిక, భౌగోళిక సామ్రాజ్యవాద విస్తరణకు ప్రతిగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. సైనిక రంగంలో కూడా క్వాడ్‌ దేశాలు ఒకరికొకరు పూర్తి సహాయం అందించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. భారత చొరవ కారణంగా ఇండోనేషియా, సింగపూర్‌ లాంటి దేశాలు కూడా క్వాడ్‌లో చేరేందుకు సిద్ధం అవుతున్నాయి. సముద్ర క్షేత్రాలు, సముద్ర మార్గాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. సముద్ర మార్గాలు సుగమం కావడం వల్ల దేశ ఆర్థికవ్యవస్థ బలపడుతుందని ప్రస్తుత ప్రభుత్వం బలంగా నమ్ముతున్నది. దీంతోపాటు చైనా సామ్రాజ్యవాద కాంక్షలను అడ్డుకోవచ్చు అందుకే విదేశాంగ శాఖలో అంతర్భాగంగా ఇండో–పసిఫిక్‌ క్షేత్రంలో చేపట్టాల్సిన చర్యల గురించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ శాంతి, సుస్థిరత, ఆర్థిక ప్రగతి కోసం ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.

కామర్సు బాలసుబ్రహ్మణం

కార్యదర్శి, బీజేపీ పార్లమెంట్‌ కార్యాలయం

Updated Date - 2021-03-25T06:18:37+05:30 IST