HYD : సోఫా అమ్మేందుకు OLX లో సీనియర్ జర్నలిస్ట్ పోస్ట్.. కొనుగోలు చేస్తానని ఓ వ్యక్తి ఫోన్.. క్యూఆర్ కోడ్ పంపగా నిమిషాల్లో..!

ABN , First Publish Date - 2021-10-07T17:46:16+05:30 IST

సీనియర్‌ పాత్రికేయుడు సోఫా అమ్మేందుకు ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.

HYD : సోఫా అమ్మేందుకు OLX లో సీనియర్ జర్నలిస్ట్ పోస్ట్.. కొనుగోలు చేస్తానని ఓ వ్యక్తి ఫోన్.. క్యూఆర్ కోడ్ పంపగా నిమిషాల్లో..!

హైదరాబాద్ సిటీ : నగరంలోని యూసు‌ఫ్‌గూడ తాహెర్‌ విల్లాలో నివసిస్తున్న సీనియర్‌ పాత్రికేయుడు బీవీఎస్‌ భాస్కర్‌ సోఫా అమ్మేందుకు ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. కొనుగోలు చేస్తానని ఓ వ్యక్తి ఆయనకు ఫోన్‌ చేశాడు. రూ. 13 వేలకు ఒప్పందం కుదిరింది. ఫోన్‌ చేసిన వ్యక్తి క్యూఆర్‌ కోడ్‌ పంపించాడు. భాస్కర్‌ దాన్ని స్కాన్‌ చేయగా అతడి ఖాతా నుంచి రెండుసార్లు రూ. 13 వేల చొప్పున  రూ. 26 వేలు డ్రా అయ్యాయి. బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


నకిలీ మెసేజ్‌తో.. 

జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీకి చెందిన పూసపాటి లక్ష్మీపతిరాజుకు విష్ణువర్ధన్‌ అనే స్నేహితుడు ఉన్నాడు. గత నెల 24న రూ. 20 వేలు ఆర్థిక సాయం చేయాలని విష్ణువర్ధన్‌ ఫేస్‌బుక్‌ నుంచి నకిలీ మెసేజ్‌ వచ్చింది. లక్ష్మీపతి ఫోన్‌ పే ద్వారా రూ. 20 వేలు, మరోసారి రూ. 20 వేలు పంపించాడు. ఈ నెల 5న ఇంకా డబ్బు కావాలని మెసేజ్‌ వచ్చింది. మోసమని గ్రహించిన లక్ష్మీపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


క్రెడిట్‌ కార్డు నంబర్‌ సవరించాలంటూ...

చప్పల్‌బజార్‌ ప్రాంతానికి చెందిన ప్రకాష్‌ కుమారుడు మహేందర్‌ పరాంకర్‌(39) ప్రైవేట్‌ ఉద్యోగి. అతడికి జూలై 6న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఆర్‌బీఎల్‌ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. మీ క్రెడిట్‌ కార్డు నంబర్‌ సవరించాలని, ఓటీపీ నంబర్‌ చెప్పమన్నాడు. అతడి మాటలు నమ్మిన పరాంకర్‌ ఓటీపీ చెప్పడంతో వెంటనే అతడి ఖాతా నుంచి రూ. 64,900 మాయమయ్యాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు కాచిగూడ పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-10-07T17:46:16+05:30 IST